AP Volunteers: తీసుకునేది ప్రజా సొమ్ము... చేసేది వైకాపా సేవ

నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారం, ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని తెలిసినా వాలంటీర్లు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తడం మానట్లేదు.

Updated : 16 Aug 2023 07:54 IST

ఉప ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ తరఫున వాలంటీర్లు, ఉద్యోగులు

ఈనాడు - విజయనగరం, ప్యాపిలి - న్యూస్‌టుడే: నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారం, ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని తెలిసినా వాలంటీర్లు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తడం మానట్లేదు. ప్రస్తుతం స్థానిక సంస్థలకు జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో కూడా తమనెవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో వారు పాల్గొంటున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెంట శ్రీరాంపురం పంచాయతీ సర్పంచి స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో వైకాపా మద్దతుదారు తరఫున ఆ గ్రామ వాలంటీర్లు రంగంలోకి దిగారు. వాలంటీర్లు లగుడు భారతి, పూడి భవాని, వీఆర్‌ఏ ఆర్‌.ఈశ్వరరావు, విజయనగరం కలెక్టరేట్‌లో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగి నాగరాజు.. వైకాపా నాయకుడు కరక మహేశ్వరరావుతో కలిసి మంగళవారం ఇంటింటికీ తిరిగారు.

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు, వీఆర్‌ఏ, పొరుగు సేవల ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నియోజకవర్గ సమన్వయకర్త కె.ఎ.నాయుడు డిమాండ్‌ చేశారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణంలోని రెండో వార్డుకు ఎన్నికలు జరగనున్నాయి. వైకాపా తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి తరఫున నిర్వహించిన ప్రచారంలో వార్డు వాలంటీర్లు జింకల షరీఫ్‌, వేములపాటి శరత్‌కుమార్‌, మంగళి నాగరాజు, దాదు పాల్గొన్నారు. ఈ విషయంపై ఎంపీడీవో ఫజుల్‌ రహిమాన్‌ను వివరణ కోరగా వార్డు వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని హెచ్చరించామన్నారు. ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లకు తాఖీదులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు