జగన్‌ ‘వలలో’ గంగపుత్రుల విలవిల!

మరి ఆ హామీని నిలబెట్టుకున్నారా అంటే ‘ఒడ్డు దాటించే వరకు ఓడ మల్లన్న...ఒడ్డు దాటాక బోడు మల్లన్న’ అన్న చందంగా మత్స్యకారులను సీఎం జగన్‌ నిలువునా ముంచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గంగపుత్రులకు ఇచ్చిన ప్యాకేజీ, ఉద్యోగ హామీని గంగలో కలిపేశారు.

Updated : 21 Aug 2023 11:33 IST

నాలుగేళ్లుగా నెరవేరని పూడిమడక మత్స్యకారులకు ఇచ్చిన హామీ
ఇంటికో ఉద్యోగం..రూ.5 లక్షల ప్యాకేజీ అంటూ మాయమాటలు
సీఎం మడమ తిప్పడంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత
ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, అచ్యుతాపురం

సెజ్‌ నుంచి సముద్రంలోకి వేస్తున్న ఏపీఐఐసీ పైపులైను కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏపాటిది..? మేము అధికారంలోకి వస్తే సెజ్‌లోని పరిశ్రమల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తాం.. మాకు మద్దతుగా నిలవండి.. మీ జీవితాలను మార్చేస్తాం’

పాదయాత్రలో భాగంగా 2018 ఆగస్టు నెలాఖరున అచ్యుతాపురం వచ్చిన నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూడిమడక మత్స్యకార సంఘ నాయకులకు ఇచ్చిన హామీ ఇది..

మరి ఆ హామీని నిలబెట్టుకున్నారా అంటే ‘ఒడ్డు దాటించే వరకు ఓడ మల్లన్న...ఒడ్డు దాటాక బోడు మల్లన్న’ అన్న చందంగా మత్స్యకారులను సీఎం జగన్‌ నిలువునా ముంచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గంగపుత్రులకు ఇచ్చిన ప్యాకేజీ, ఉద్యోగ హామీని గంగలో కలిపేశారు. నాడు ఎన్నికల్ల్లో లబ్ధి కోసం నెత్తిపై తాటాకు టోపీ, వల చేతపట్టుకుని తనదైన శైలిలో నవ్వుతూ, ముద్దులు పెడుతూ పూడిమడక మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతానని డాంబికాలు పలికారు జగన్‌. ఎన్నికల ప్రచార సభల్లో ఆ పార్టీ ముఖ్య నాయకులు ఎంపీ విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుడివాడ అమర్‌నాథ్‌ ముఖ్యమంత్రి హామీనే పునరుద్ఘాటిస్తూ వచ్చారు. ఇదంతా నిజమని నమ్మిన మత్స్యకారులు పూడిమడకలో వైకాపాకు ఓట్లు వేసి గెలిపించారు. తీరా గెలిచాక వైకాపా ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చిన హామీని పక్కన పెట్టేసింది. నాలుగేళ్లుగా ఇదిగో..అదిగో అంటూ నాన్చుతూ గంగపుత్రులను మోసగిస్తోంది. ఇంటికో ఉద్యోగం మాట అటుంచితే.. రూ.5 లక్షల పరిహారం కూడా అందించలేక పోయింది. దీంతో సొంత పార్టీ నాయకులు కూడా ప్రభుత్వ పెద్దల తీరును తప్పుపట్టే పరిస్థితి నెలకొంది.

జగన్‌ను నమ్మారు.. రెండింటికీ చెడ్డారు..

తెదేపా ప్రభుత్వ హయాంలో అచ్యుతాపురం సెజ్‌లోని రసాయన పరిశ్రమల వ్యర్థాలను శుద్ధిచేసి పూడిమడక తీరంలో వదిలేందుకు ఏపీఐఐసీ ద్వారా పైపులైను నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. పరిశ్రమల వ్యర్థాలు సముద్రంలోకి విడుదల చేయడం వల్ల తాము ఉపాధి కోల్పోతామని అప్పట్లో మత్స్యకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారితో పలు దఫాలు అధికారులు చర్చలు జరిపిన తర్వాత ఆ గ్రామంలో 4,828 మంది మత్స్యకారులకు 2016లో జీవో 131 ద్వారా ఒక్కొక్కరికి రూ.1.25 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు ముందుకొచ్చారు. కొంతమంది పరిహారం తీసుకున్నారు. అయితే ఈ ప్యాకేజీ సరిపోదని 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక్కొక్కరికి రూ.5 లక్షల వంతున ఇవ్వాలని వైకాపా నాయకులు ఉద్యమబాట పట్టారు. వీరికి ఆ పార్టీ అధినేత జగన్‌తో పాటు ముఖ్య నాయకులు అప్పట్లో మద్దతు ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు మెరుగైన ప్యాకేజీ అందించడంతో పాటు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించి ఆదుకుంటామని బహిరంగంగా హామీ ఇచ్చారు. వైకాపా మాటలు నమ్మి తెదేపా ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీని అప్పట్లో చాలామంది తీసుకోలేదు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇంత వరకు పరిహారం ఇవ్వలేదు. దీంతో రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది అనకాపల్లి జిల్లా పూడిమడక మత్స్యకారుల పరిస్థితి.  గ్రామంలో వెయ్యి మందికి పైగా ఇంకా ప్యాకేజీ అందాల్సి ఉందని స్థానికులు చెబుతుంటే అధికారులు మాత్రం 497 మందికే ఇవ్వాల్సి ఉందంటున్నారు. 


మాట తప్పారు..మడమ తిప్పారు

‘మా జగన్‌ మాట తప్పడు.. మడమ తిప్పడు’ అని వైకాపా నాయకులు గొప్పగా చెప్పుకొనే మాటలు రివర్స్‌ అయ్యాయి. పూడిమడక మత్స్యకారులకు ఇచ్చిన హామీ విషయంలో ముఖ్యమంత్రి మడమ తిప్పేశారు. ఎంతలా అంటే ప్రతిపక్షాల కంటే సొంత పార్టీ నేతలే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించేంతగా ..రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఇచ్చిన హామీని నిలబెట్టుకోక పోవడంపై గంగపుత్రులు మండిపడుతున్నారు. ఇదివరకే స్థానిక ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు (కన్నబాబు), మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజులను వైకాపాకు చెందిన మత్స్యకార నాయకులు కలిసి మొర పెట్టుకున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు. పరిహారం సంగతి తేల్చాలంటూ ప్లకార్డులు చూపి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


వేట సాగక.. వలస బాట

సెజ్‌ వ్యర్థాలన్నీ సముద్రంలోకి విడిచిపెట్టడం వల్ల మత్స్య సంపద తగ్గిపోయి వేట సాగడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుద్ధి చేసిన వ్యర్థాలనే వదులుతున్నామని చెప్పినా గతంతో పోల్చితే చేపలు చిక్కడం లేదంటున్నారు. ఏటా సీజన్‌లో పూడిమడకను వీడి విశాఖ, కాకినాడ, ఒడిశా ప్రాంతాలకు వలసలు పోతున్నారు.  పూడిమడక వద్ద మినీ హార్బర్‌ నిర్మిస్తామని మూడేళ్లుగా ఊరిస్తున్నారు తప్ప ఒక్క అడుగు ముందుకు పడలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు