‘ఉపాధి’లోనూ ఊదేస్తున్నారు!

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) పనుల్లో జరిగే అక్రమాలు గుర్తించడంలో సామాజిక తనిఖీ (సోషల్‌ ఆడిట్‌) బృందాలది కీలకపాత్ర.

Published : 25 Aug 2023 05:53 IST

సామాజిక తనిఖీల పేరుతో కమీషన్లు
రూ.లక్ష విలువైన పనులకు రూ.10 వేల చొప్పున వసూలు
ఈనాడు, అమరావతి

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) పనుల్లో జరిగే అక్రమాలు గుర్తించడంలో సామాజిక తనిఖీ (సోషల్‌ ఆడిట్‌) బృందాలది కీలకపాత్ర. లేని కూలీల పేరుతో వేతనాలు కాజేసినా.. తప్పుడు హాజరుతో అక్రమాలకు పాల్పడినా.. తక్కువ విస్తీర్ణంలో చేసిన పనిని ఎక్కువగా చూపి నిధులు నొక్కేసినా ఈ సామాజిక తనిఖీ బృందాలు గుర్తించి తగిన చర్యలకు సిఫారసు చేస్తాయి. కానీ కంచే చేను మేసినట్లుగా తనిఖీ బృందాల్లోని కొందరు అవకతవకలకు పాల్పడుతున్నారు. తనిఖీల పేరుతో ఒక్కో పంచాయతీలో అక్కడ చేసిన పనుల విలువ ఆధారంగా గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వీరి ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి.

పాధి హామీ పథకం కింద రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా కూలీలకు ఉపాధి లభిస్తోంది. ఈ మేరకు పనుల నిర్వహణ.. కూలీల వేతనాలకు ఏటా దాదాపు రూ.6 వేల కోట్ల నిధులు వస్తున్నాయి. నిధుల వినియోగంతో పాటు పనుల్లో పారదర్శకతకు ప్రతి పంచాయతీలోనూ ఏటా సామాజిక తనిఖీలు చేస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని సామాజిక తనిఖీలు, జవాబుదారీతనం, పారదర్శకత సంస్థ (ఎస్‌ఎస్‌ఏటీ) పనిచేస్తోంది. నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం ఆయా పంచాయతీల పరిధిలో జరిగిన ఉపాధి పనులను ఈ సంస్థ సిబ్బంది తనిఖీ చేసి లోపాలు, అవకతవకలు గుర్తిస్తారు. అక్రమాలు గుర్తిస్తే బాధ్యులైన క్షేత్రస్థాయి సిబ్బందిపై చర్యకు సిఫార్సు చేస్తారు.


బాహాటంగా వసూళ్లు

గతంలో సామాజిక తనిఖీలకు వెళ్లేప్పుడు క్షేత్రస్థాయి సిబ్బంది భోజనం ఏర్పాటు చేసినా ఎస్‌ఎస్‌ఏటీ సిబ్బంది తిరస్కరించేవారు. తామే సొంతంగా వసతి ఏర్పాట్లు చేసుకునేవారు. కానీ గత నాలుగేళ్లుగా తనిఖీ సిబ్బందిలో విచ్చలవిడితనం పెరిగిపోయింది. తమకు వసతి, భోజన సదుపాయం కల్పించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి నిర్దేశిస్తున్నారు. పనులను తనిఖీ చేసి బహిరంగంగానే కమీషన్లు తీసుకుంటున్నారు. రూ.లక్ష విలువైన పనికి రూ.10 వేల చొప్పున ఇవ్వాల్సిందేనని ఫీల్డ్‌ అసిస్టెంట్లను డిమాండ్‌ చేస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.


డబ్బులిస్తే సరే... లేదంటే చుక్కలే

  • తాము అడిగిన మేరకు కమీషన్లు ఇచ్చినచోట ఉపాధి పనుల్లో లోపాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. తూతూమంత్రంగా తనిఖీలతో సరిపెడుతున్నారు. అధికారులకు అనుమానం రాకుండా ఒకటి, రెండు పనుల్లో చిన్నచిన్న లోపాలున్నట్లు చూపించి మమ అనిపిస్తున్నారు.
  • డబ్బులివ్వని ఫీల్డ్‌ అసిస్టెంట్లకు మాత్రం తనిఖీల పేరుతో చుక్కలు చూపిస్తున్నారు. కూలీల మస్టర్లలో దిద్దుబాట్లు ఉన్నాయని.. తక్కువ పని చేస్తే ఎక్కువగా చూపించారని తప్పుడు నివేదికలు రాస్తున్నారు. తప్పనిసరిగా నిర్వహించాల్సిన ఏడు రికార్డులు అందుబాటులో లేవంటూ క్షేత్రస్థాయి సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారు.

హాజరులో మాయాజాలం

సామాజిక తనిఖీ బృందాల బెడద పడలేక ఫీల్డ్‌ అసిస్టెంట్లు తప్పనిసరి పరిస్థితుల్లో వారికి కమీషన్లు ముట్టజెబుతున్నారు. ఈ మొత్తం చిన్న పంచాయతీల్లో రూ.వేలల్లో, పెద్ద పంచాయతీల్లో రూ.లక్షల్లో ఉంటోంది. అలా ఇచ్చిన సొమ్మును తిరిగి సంపాదించుకోడానికి కొందరు ఫీల్డ్‌ అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. పర్యవసానంగా కూలీల హాజరు వ్యవహారంలో గోల్‌మాల్‌ జరుగుతోంది. ఉదాహరణకు ఒక బృందంలో ఇద్దరు, ముగ్గురు కూలీలు రాకపోయినా.. హాజరైనట్లు నమోదు చేేస్తున్నారు. ఇలా కూలీల బ్యాంకు ఖాతాలకు జమయ్యే వేతనాల నుంచి కొంత మొత్తం తీసుకుంటున్నారు. ప్రతి కూలీకి రూ.250 కనీస వేతనం తప్పనిసరిగా వచ్చేలా చూడాలని గ్రామీణాభివృద్ధిశాఖ ఆదేశాలున్నాయి. దీన్ని తమకు అనుగుణంగా మార్చుకుని కొందరు సిబ్బంది కూలీలతో తక్కువ విస్తీర్ణంలో పనులు చేయించి ఎక్కువ పని చేసినట్లు నమోదు చేయిస్తున్నారు. బదులుగా ఒక్కో కూలీ వేతనాల నుంచి రూ.50-100 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా తీసుకుంటున్న మొత్తాల నుంచే తనిఖీ బృందాలకు మామూళ్లు సమర్పించుకుంటున్నామని ఓ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు