Visakhapatnam: జోన్‌ ఏర్పాటులో రైల్వేశాఖ తాత్సారం

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటులో మంత్రిత్వశాఖ నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నట్లు లోక్‌సభ హామీల కమిటీ ఆక్షేపించింది.

Updated : 20 Dec 2023 08:51 IST

తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా లేవు
పార్లమెంటు హామీల కమిటీ ఆక్షేపణ
నిర్దిష్ట గడువుతో కూడిన కార్యాచరణ అమలుచేయాలని ఆదేశం

ఈనాడు, దిల్లీ: విశాఖపట్నం (Visakhapatnam) కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వేజోన్‌ (South Coast Railway zone) ఏర్పాటులో మంత్రిత్వశాఖ నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నట్లు లోక్‌సభ హామీల కమిటీ ఆక్షేపించింది. మంగళవారం సభకు సమర్పించిన నివేదికలో ఈ విషయంలో రైల్వేశాఖ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. దక్షిణకోస్తా రైల్వేజోన్‌, రాయగడ డివిజన్‌ ఏర్పాటు గురించి 2020 మార్చి, 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌ సభ్యులు అడిగిన ప్రశ్నకు రైల్వేమంత్రి సమాధానమిస్తూ డీపీఆర్‌ తయారైందని, అది రైల్వేబోర్డు పరిశీలనలో ఉందని, అందువల్ల నిర్దిష్ట గడువు చెప్పలేమని పేర్కొన్నారు. ఈ హామీ అమలుపై అధ్యయనం చేసిన కమిటీ మూడేళ్లుగా రైల్వేశాఖ వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘దక్షిణకోస్తా రైల్వేజోన్‌, రాయగడ డివిజన్‌ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరిగినట్లు కమిటీ గుర్తించింది. ఈ సమస్య నిరంతరం కొనసాగుతోంది. డీపీఆర్‌ ఇప్పటికీ ఇంకా రైల్వే మంత్రిత్వశాఖ పరిశీలనలోనే ఉంది. దాని ఖరారుకు కొంత సమయం పడుతుందన్న విషయాన్ని కమిటీ అర్థం చేసుకుంది.

ఇంత ముఖ్యమైన హామీలో మూడేళ్లకు పైగా జాప్యాన్ని కమిటీ అంగీకరించట్లేదు. అది రైల్వే మంత్రిత్వశాఖ నిర్లక్ష్యాన్ని చాటుతోంది. వాల్తేరు డివిజన్‌ మూసివేత గురించి ప్రజాప్రతినిధులతో పాటు, వివిధ భాగస్వామ్యపక్షాలతో చర్చించి సమస్యను పరిష్కరించి ఉండాల్సింది. దీనిపై మంత్రిత్వశాఖ సమాధానంతో కమిటీ సంతృప్తి చెందడంలేదు. రైల్వేజోన్‌ అంశాన్ని పార్టీలతో సంబంధం లేకుండా సభ్యులంతా సభలోనూ, బయట ప్రస్తావిస్తున్నారు. మౌలికవసతుల పనులు నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయడం కష్టమని కమిటీకి తెలుసు. ఇదే సమయంలో హామీలు నెరవేర్చడానికి రైల్వేశాఖ ప్రయత్నాలు చేయలేదన్నది నిజం. ఇప్పటికైనా రైల్వేశాఖ అన్ని పక్షాలతో సమన్వయం చేసుకొని, హామీల అమలుకు నడుం బిగించాలి. రాయగడ డివిజన్‌ ఏర్పాటుతో ఆ జిల్లాలో పారిశ్రామిక, సామాజిక, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. అందువల్ల రైల్వేశాఖ వెంటనే దక్షిణకోస్తా రైల్వేజోన్‌, రాయగడ డివిజన్‌ ఏర్పాటుకు నిర్దిష్ట గడువుతో కూడిన కార్యాచరణను తయారుచేసి అమలుచేయాలి’’ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని