Mangalagiri: కలెక్టర్‌ అభ్యంతరం తెలిపినా బేఖాతర్‌.. లోకేశ్‌ నియోజకవర్గంలో ఈ మర్మమేమిటో?

రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం గల నియోజకవర్గాల్లో ప్రస్తుతం మంగళగిరి ఒకటి. ఇక్కడి నుంచి తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Updated : 27 Mar 2024 08:15 IST

ఈనాడు, అమరావతి: రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం గల నియోజకవర్గాల్లో ప్రస్తుతం మంగళగిరి ఒకటి. ఇక్కడి నుంచి తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో భాగమైన మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థకు ఇదే జిల్లాకు చెందిన నిర్మల్‌కుమార్‌ను ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడానికి ముందే వ్యూహాత్మకంగా కమిషనర్‌గా నియమించి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆయన ఇదే (సొంత) జిల్లాకు చెందిన వారని జిల్లా కలెక్టర్‌ సైతం ధ్రువీకరించినా కమిషనర్‌ బాధ్యతల్లో స్వల్ప మార్పులు చేసి ఆయననే పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కొనసాగించడం విశేషం. నిబంధనల ప్రకారం మంగళగిరి కమిషనర్‌గా ఉన్న నిర్మల్‌కుమార్‌ను బదిలీ చేయాలి. ఈ విషయాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్‌ గతంలోనే మున్సిపల్‌ పరిపాలనా శాఖకు లేఖ రాశారు. అయినా నిర్మల్‌కుమార్‌ను ఉన్నతాధికారులు బదిలీ చేయలేదు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ మరోసారి నిర్మల్‌కుమార్‌ స్థానికుడు అనే విషయాన్ని గుర్తుచేస్తూ లేఖ రాశారు.

అయినా కమిషనర్‌గా నిర్మల్‌కుమార్‌ ఇక్కడే కొనసాగుతారని పేర్కొంటూ...ఆయన స్థానంలో ఎన్నికల విధులకు మాత్రం నగరపాలక సంస్థలో ఆడిట్‌శాఖ ఉపసంచాలకుడిగా ఉన్న ఎగ్జామినర్‌ను వినియోగించుకోవాలని సూచిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.  ఎన్నికల విధుల్లో కమిషనర్‌ పాల్గొనరని చెప్పినప్పటికీ మున్సిపల్‌ అధికారులు, సిబ్బందీ ఆయన పరిధిలోనే పనిచేస్తారు. ఆయన ఎన్నికల్లో నేరుగా కీలక బాధ్యతలు నిర్వర్తించకపోయినా పరోక్షంగా సిబ్బందిని ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు.  అధికారపార్టీకి సహకారం అందించాలన్న దురుద్దేశంతోనే కమిషనర్‌ను బదిలీ చేయకుండా ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పినట్లు తెలిసింది. ఇక్కడి నుంచి నారా లోకేశ్‌ పోటీచేస్తుండటంతో ఉద్దేశపూర్వకంగానే కమిషనర్‌ను బదిలీపై పంపకుండా వ్యూహం అమలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మల్‌కుమార్‌ మున్సిపల్‌ శాఖకు చెందినవారు కాదు. ఆయన కేంద్రం నుంచి డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో పనిచేస్తూ మంగళగిరి కమిషనర్‌గా నియమితులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని