ఎమ్మార్‌ కేసులో డిశ్ఛార్జి పిటిషన్ల కొట్టివేత

ఎమ్మార్‌ వ్యవహారంలో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లోని నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లను కొట్టివేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 01 May 2024 06:44 IST

బి.పి.ఆచార్యకు ఐపీసీ కింద మినహాయింపు
విచారణ ఎదుర్కోవాల్సిందే
అభియోగాల నమోదు ప్రక్రియ జూన్‌ 18న

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మార్‌ వ్యవహారంలో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లోని నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లను కొట్టివేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన నిందితుడు బి.పి.ఆచార్యపై ఐపీసీ 120బి, 409 సెక్షన్ల కింద నమోదు చేసిన అభియోగాల నుంచి డిశ్ఛార్జి (మినహాయింపు) చేసింది. అయితే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(2) రెడ్‌విత్‌ 13(1)(సి)(డి)ల కింద విచారణను ఎదుర్కోవాల్సిందేనని పేర్కొంది. ఐపీసీ కింద ఉన్న అభియోగాలపై ఈ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు విచారణపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఈ కేసులో ఇతర నిందితులైన ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ పీజెఎస్‌సీ.. దుబాయ్‌, ఎమ్మార్‌ హిల్స్‌ టౌన్‌షిప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఈహెచ్‌టీపీఎల్‌), ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌ ల్యాండ్‌ లిమిటెడ్‌, స్టైలిష్‌ హోమ్స్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌ మాజీ సీఈఓ శ్రీకాంత్‌ జోషి, బౌల్డర్‌ హిల్స్‌ లీజర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సన్నిహితుడైన ఎన్‌.సునీల్‌రెడ్డి, ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌ ఫైనాన్స్‌ హెడ్‌ జి.విజయ్‌రాఘవ్‌ దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేసింది.

ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌ ఎండీ శ్రవణ్‌గుప్తా, విశ్రాంత ఐఏఎస్‌ కె.వి.రావులు డిశ్ఛార్జి పిటిషన్లు దాఖలు చేయలేదు. సీబీఐ నిందితులుగా చేర్చిన విశ్రాంత ఐఏఎస్‌లు ఎల్వీ సుబ్రహ్మణ్యం, కోనేరు మధులపై కేసును హైకోర్టు కొట్టివేసింది. తుమ్మల రంగారావు అప్రూవర్‌గా మారారు. ఈ కేసులో కీలక నిందితుడైన కోనేరు రాజేంద్రప్రసాద్‌ గత ఏడాది గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన పేరును కేసు నుంచి తొలగించారు. సీబీఐ కేసులో నిందితులతోపాటు ఈడీ కేసులో మాత్రమే నిందితులుగా ఉన్న కోనేరు ప్రదీప్‌, సౌత్‌ ఎండ్‌ ప్రాజెక్ట్స్‌, ఆసరా థీమ్‌ ప్రాజెక్ట్స్‌ తరఫున ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డిలు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో అభియోగాల నమోదు ప్రక్రియ నిమిత్తం తదుపరి విచారణను జూన్‌ 18వ తేదీకి వాయిదా వేస్తూ సీబీఐ కోర్టు న్యాయమూర్తి సీహెచ్‌.రమేశ్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

ఎమ్మార్‌ సొమ్మును మింగిన జగన్‌ సన్నిహితుడు

పర్యాటక ప్రాజెక్టుగా రాష్ట్రంలో మొదలైన ఎమ్మార్‌ ప్రాజెక్ట్స్‌ వల్ల కోనేరు రాజేంద్రప్రసాద్‌, ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేట్‌ కంపెనీలతోపాటు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సునీల్‌రెడ్డిలు లబ్ధి పొందారని సీబీఐ, ఈడీలు కేసులు నమోదు చేశాయి. సీబీఐ, ఈడీల అభియోగ పత్రాల ప్రకారం ఎమ్మార్‌ ప్రాజెక్ట్స్‌లో సంయుక్త భాగస్వామిగా భూమిని కేటాయించిన ఏపీఐఐసీ మాత్రం నిండా మునిగిపోయింది. ఏపీఐఐసీని ముంచినవారిలో ముందు వరుసలో అప్పటి వీసీ, ఎండీ బి.పి.ఆచార్య ఉండగా తెరవెనుక కోనేరు రాజేంద్రప్రసాద్‌ కథ నడిపారు. పైసాపెట్టుబడి పెట్టని ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌ ప్లాట్లను విక్రయించడం ద్వారా రూ.167.29 కోట్లు లబ్ధి పొందగా, డాక్యుమెంట్‌లో చూపినదానికంటే అధిక ధరకు విక్రయించగా వచ్చిన రూ.96 కోట్లను కోనేరు, సునీల్‌రెడ్డిలు పంచుకున్నారు. సునీల్‌రెడ్డి కంపెనీ సౌత్‌ఎండ్‌ ప్రాజెక్ట్స్‌లోకి 11 బోగస్‌ కంపెనీల ద్వారా రూ.45 కోట్లకు పైగా సొమ్ము వచ్చి చేరింది.  ప్రాజెక్టులో 26 శాతం వాటా ఉన్న ఏపీఐఐసీకి మాత్రం పైసా దక్కలేదు.

ఎంజీఎఫ్‌ ఖాతాల ప్రకారం చూసినా ఏపీఐఐసీకి రూ.43.50 కోట్ల నష్టం. ఎమ్మార్‌ వ్యవహారంపై హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు జరిపిన సీబీఐ అభియోగ పత్రం దాఖలు చేసింది. పర్యాటక ప్రాజెక్టుగా మణికొండ, గచ్చిబౌలిలో 535 ఎకరాల్లో గోల్ఫ్‌కోర్సు, కన్వెన్షన్‌ సెంటర్‌, హోటల్‌, విల్లాలతో కూడిన వాణిజ్య నిర్మాణ సముదాయాలను అభివృద్ధి చేయడానికి ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అమలుకు ఎమ్మార్‌ టౌన్‌ హిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఈహెచ్‌టీపీఎల్‌), బౌల్డర్‌ హిల్స్‌ లీజర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఎల్‌పీఎల్‌), సైబరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల (సీసీసీపీఎల్‌) పేర్లతో ప్రత్యేక ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది. ఈహెచ్‌టీపీఎల్‌, బీహెచ్‌ఎల్‌పీఎల్‌లలో 74 శాతం ఎమ్మార్‌కు, 26 శాతం వాటా ఏపీఐఐసీకి ఉండగా, సీసీసీపీఎల్‌లో మాత్రం ఏపీఐఐసీకి 49 శాతం, ఎమ్మార్‌కు 51 శాతం వాటాల నిర్ణయం జరిగింది.

రాష్ట్రప్రభుత్వానికి ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌తో 2002లో ఒప్పందం కుదిరినా 2004లో వైఎస్‌ ప్రభుత్వం రావడంతో అక్రమాలకు తెరలేచింది. వై.ఎస్‌.తో ఎమ్మార్‌ ఛైర్మన్‌, కోనేరు రాజేంద్ర ప్రసాద్‌, కేవీపీ రామచంద్రరావులతో జరిగిన సమావేశంలో కన్వెన్షన్‌ సెంటర్‌, హోటల్‌ నిర్మాణంలో ఏపీఐఐసీ వాటా 49 నుంచి 26 శాతానికి తగ్గిస్తూ వై.ఎస్‌. సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక ప్రాజెక్టుల్లో నామినీ డైరెక్టర్‌గా ఉన్న కోనేరు ఏపీఐఐసీకి సమాచారం ఇవ్వకుండా ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌తో అభివృద్ధి ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక ప్రాజెక్టులకు, ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌కు మధ్య 75:25 శాతంతో కుదిరిన ఒప్పందం కారణంగా ఏపీఐఐసీ వాటా పడిపోయి నష్టపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు