అంత అత్యవసరం ఏమిటో చెప్పమనండి

ఎన్నికలు పూర్తయ్యేవరకూ రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత పథకాల కింద నిధుల విడుదలకు అనుమతి నిరాకరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు మంగళవారం అత్యవసరంగా విచారణ జరిపింది.

Published : 08 May 2024 06:26 IST

రాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే తగిన నిర్ణయం తీసుకుంటాం
పెట్టుబడి రాయితీ, విద్యాదీవెన నిధులపై హైకోర్టుకు ఈసీ నివేదన

ఈనాడు, అమరావతి: ఎన్నికలు పూర్తయ్యేవరకూ రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత పథకాల కింద నిధుల విడుదలకు అనుమతి నిరాకరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు మంగళవారం అత్యవసరంగా విచారణ జరిపింది. ఈసీ తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల నియమావళికి లోబడి నిధుల విడుదల వాయిదా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఆగకుండా అత్యవసరంగా ఎందుకు పంపిణీ చేయాలో చెబుతూ రాష్ట్రప్రభుత్వం వినతి ఇస్తే ఈ వ్యవహారాన్ని పునఃపరిశీలన చేసి 24గంటల్లో తగిన నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు తెలిపారు. పెట్టుబడి రాయితీ నిధులను వెంటనే ఇవ్వకపోతే అవి మురిగిపోతాయని పిటిషనర్లు, రాష్ట్రప్రభుత్వం చెబుతున్న కారణం సహేతుకంగా లేదన్నారు. ఈ ఏడాది మార్చి 31కి ఆర్థిక సంవత్సరం పూర్తయిందని గుర్తుచేశారు. 13న పోలింగ్‌ ఉంది కాబట్టి, అది ముగిసిన తర్వాత లబ్ధిదారులకు నిధులను పంపిణీ చేయవచ్చన్నారు. రాష్ట్రప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ తాము వెంటనే వినతి ఇస్తామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. రాష్ట్రప్రభుత్వం ఇచ్చే వినతిపై ఎన్నికల కోడ్‌కు లోబడి నిర్ణయం తీసుకుని ఆ వివరాలను కోర్టుకు చెప్పాలని ఈసీని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

  • ఎన్నికలు ముగిసేవరకూ ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యాదీవెన, చేయూత పథకాల నిధులను పంపిణీ చేయొద్దని ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలుచేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటించారు. లబ్ధిదారులను గుర్తించారు. 6.95 లక్షల మంది రైతులకు రూ.847 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంపిణీకి అనుమతి కోరుతూ స్క్రీనింగ్‌ కమిటీ చేసిన అభ్యర్థనను ఈసీ నిరాకరించింది. ఇప్పటికే కొనసాగుతున్న పథకాల పంపిణీని నిలువరించాల్సిన అవసరం లేదన్న కోడ్‌కు భిన్నంగా ఈసీ వ్యవహరించింది. సకాలంలో పంపిణీ చేయకపోతే రైతులకు తీవ్రనష్టం జరుగుతుంది. ఈ వ్యవహారంలో తగిన ఉత్తర్వులివ్వండి’ అని కోరారు. విద్యాదీవెన పథకం కింద ఇప్పటికే రూ.97 కోట్లు విద్యార్థుల తల్లుల బ్యాంకుఖాతాల్లో జమ అయ్యిందన్నారు. ఇంకా జమకావాల్సిన రూ.610 కోట్ల విడుదలకు అనుమతివ్వాలని కోరారు. సకాలంలో సొమ్ము చెల్లించకపోతే విద్యాసంస్థలు విద్యార్థులను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని చెప్పారు. చేయూత పథకం నిధుల విడుదలకు అనుమతిచ్చేలా ఆదేశించాలని న్యాయవాది వీఆర్‌రెడ్డి కొవ్వూరి వాదించారు.
  • రాష్ట్రప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ఇవేవీ కొత్త పథకాలు కావన్నారు. ఎప్పటినుంచో కొనసాగుతున్నాయన్నారు. వాటిని నిలువరించడానికి వీల్లేదని ఎన్నికల నియమావళి చెబుతోందన్నారు. 6.95 లక్షల మంది రైతులకు పెట్టుబడి రాయితీ చేరాల్సి ఉందన్నారు. ఈ విషయంలో తగిన ఉత్తర్వులివ్వాలని కోరారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు