జీపీఎఫ్‌ ఖాతాల నుంచి ప్రభుత్వమే రూ.500 కోట్లు దొంగిలించింది

జగన్‌ సర్కారు ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోగా.. జీపీఎఫ్‌ ఖాతాల నుంచి రూ.500 కోట్లు దొంగతనంగా లాగేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ మండిపడ్డారు.

Updated : 08 May 2024 08:07 IST

ఉద్యోగి అనుమతి లేకుండా తీసుకుంటే తస్కరించడమే
ఉద్యమిస్తామంటే పోలీసులతో అణచివేస్తోంది
ఇలాంటి పాలనను ఎన్నడూ చూడలేదు
‘ఈనాడు’తో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ

ఈనాడు, అమరావతి: జగన్‌ సర్కారు ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోగా.. జీపీఎఫ్‌ ఖాతాల నుంచి రూ.500 కోట్లు దొంగతనంగా లాగేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ మండిపడ్డారు. ఉద్యోగి అనుమతి లేకుండా తీసుకుంటే దొంగతనం అనక ఏమంటామని ప్రశ్నించారు. ఉద్యోగుల గళాన్ని ఈ ప్రభుత్వం నిరంకుశంగా అణచివేసిందని, నల్ల రిబ్బన్‌తో నిరసన తెలుపుతామంటే నిర్బంధాలు, బైండోవర్‌ కేసులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నియంతృత్వ ధోరణిని తన 40 ఏళ్ల సర్వీసులో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై ‘ఈనాడు’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.

ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు

ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, హక్కుల గురించి మాట్లాడినా.. ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నా కేసులు పెట్టారు. ఈ నియంతృత్వంపై ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ భయం నుంచి ఉద్యోగులు బయటకు రావాలి. ఉద్యోగుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఇప్పటివరకు 13 సమావేశాలు నిర్వహించాం. ఈ రాష్ట్రంలో ఉద్యోగులు స్వేచ్ఛగా, ధైర్యంగా పనిచేసుకునే పరిస్థితి వస్తుందని బలంగా నమ్ముతున్నాను.

నిధులింకా వెనక్కి రాలేదు

ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి రూ.500 కోట్లను ఈ ప్రభుత్వం తీసేసుకుంది. అనుమతి లేకుండా తీసుక్నునందున ఇది దొంగతనం. కేంద్ర ఆర్థికమంత్రి సైతం దీన్ని ధ్రువీకరించారు. ఇలా చేసిన వ్యక్తిని క్రిమినల్‌ సెక్షన్‌ కింద విచారించాలి. దీనిపై ఆర్థికశాఖ కార్యదర్శి విచారణకు ఆదేశించామన్నారు. రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు సాంకేతిక తప్పిదమన్నారు. ఇప్పటివరకు ఎందుకు సరిచేయలేదు? ఇప్పటికీ ఈ నిధులు వెనక్కి రాలేదు. మా సొమ్మునే మాకు చెప్పకుండా తీసేసుకుని.. దానిపై ప్రశ్నించినందుకు కేసులు పెట్టిన ప్రభుత్వం.. విచారణ ఏమైందో చెప్పడం లేదు.

సీపీఎస్‌ డబ్బులు వాడేసుకుంటోంది

సీపీఎస్‌ను రద్దుచేస్తామని జగన్‌ హామీ ఇవ్వడంతో ఉద్యోగులు నమ్మారు. ఇప్పుడు అమలు చేయకపోవడంతో నిస్సహాయులుగా మిగిలారు. కొత్తగా జీపీఎస్‌ను తీసుకొచ్చారు. దీని అమలుకు నిబంధనలు రూపొందించలేదు. సీపీఎస్‌లో కేంద్రప్రభుత్వం తన వాటాను 10 నుంచి 14కు పెంచింది. కానీ, రాష్ట్రప్రభుత్వం పెంచకపోవడంతో ఉద్యోగులు 4% నష్టపోతున్నారు. ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన డబ్బులను ప్రాన్‌ ఖాతాకు జమచేయలేదు.

ఐఏఎస్‌లు కేంద్ర వైద్య పథకాన్నే కోరుకుంటున్నారు

ఐఏఎస్‌ అధికారులకు కేంద్ర వైద్యపథకం కావాలో.. రాష్ట్రప్రభుత్వ పథకం కావాలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. ఏపీకి చెందిన ఐఏఎస్‌ అధికారులు కేంద్ర ప్రభుత్వ వైద్యపథకం కావాలని చెప్పారు. సీఎంఓలో పనిచేసే వారే కేంద్ర పథకం కావాలన్నారంటే ఇక్కడ సేవలు ఎలా ఉన్నాయో చెప్పక్కర్లేదు. ఉద్యోగులు తమ వాటా చెల్లిస్తున్నా వైద్యసేవలు సక్రమంగా అందడం లేదు. ఈహెచ్‌ఎస్‌పై నమ్మకం లేకపోవడంతో ఒక మంచి వైద్యపథకం ఉండాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు.

నాడు రెండు డీఏలకే విమర్శలు.. నేడు అణచివేత

తెదేపా ప్రభుత్వం దిగిపోయే సమయానికి రెండు డీఏలు పెండింగ్‌ పెట్టింది. ఆ బకాయిలకే చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించాం. తాము అధికారంలోకి వస్తే సకాలంలో డీఏలు ఇస్తామని వైకాపా నేతలు ప్రకటించారు. మధ్యంతర భృతి 27% ఇచ్చి, ఫిట్‌మెంట్‌ను 23%కి తగ్గించేశారు. ఆరు నెలలకోసారి ఇవ్వాల్సిన డీఏ ఇవ్వకుండా.. తెదేపా ప్రభుత్వం ఇవ్వాల్సిన రెండు డీఏ బకాయిలు, ఆ తర్వాత రావాల్సినవి మొత్తం ఐదు డీఏలు కలిపి 19%, తగ్గించిన హెచ్‌ఆర్‌ఏ 4% కలిపి 23% ఫిట్‌మెంట్‌ ఇచ్చినట్లు చూపారు. వాస్తవంగా ఫిట్‌మెంట్‌ ఏమీ ఇవ్వలేదు. ఇదో వింత లెక్క. అప్పటి సీఎస్‌ సమీర్‌శర్మ, ఆర్థికశాఖ అధికారులు దీన్ని తీసుకొచ్చారు.

బకాయిలు రద్దు చేసి.. ప్రశ్నించకూడదంటే ఎలా?

ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఎంత ఉన్నాయో ప్రభుత్వం చెప్పట్లేదు. సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా వివరాలు ఇవ్వట్లేదు. మంత్రివర్గ ఉపసంఘం నిర్వహించిన ఒక సమావేశంలో రూ.20వేల కోట్ల బకాయిలు ఉంటాయేమోనని ఓ మంత్రి అనధికారికంగా చెప్పారు. భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి బాగోలేదని బకాయిలను రద్దు చేస్తామన్నా ఎవ్వరూ మాట్లాడకూడదు. మాట్లాడితే కేసులు పెట్టి జైల్లో పడేస్తామంటే ఏం చేయాలి? ఈ ఐదేళ్లలో ఒక్కసారీ డీఏ బకాయిలు ఇవ్వలేదు. ఈ రూ.20వేల కోట్ల బకాయిలను ఎలా చెల్లిస్తారనేదానిపై స్పష్టత లేదు. మాకు జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడాల్సి వస్తోంది. 12వ పీఆర్సీ ఇప్పటికే పెండింగ్‌లో ఉంది. 11వ పీఆర్సీ, డీఏ బకాయిలు వస్తాయా.. రావా అనేదానిపై ఉద్యోగులు, వారి కుటుంబాల్లో ఆందోళన ఉంది.

ప్రతిపక్ష నేతలను కలవడం నేరమా?

ఉద్యోగసంఘాల నాయకులు ఎన్నికల ముందు తమ సమస్యలపై ప్రతిపక్ష నేతలను కలిసి, చెప్పేవారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తారనేదాన్ని వాళ్లు వివరించేవారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతలను కలవడమే తప్పవుతోంది. ప్రతిపక్ష నేతను కలవడాన్నీ ఈ ప్రభుత్వం నేరంగా పరిగణిస్తోంది. ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు.. మేము నియంతపాలనలో ఉన్నాం.

ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రకటనలు

ఉద్యోగుల డిమాండ్లకు వ్యతిరేకంగా ప్రభుత్వమే ప్రకటనలు ఇవ్వడాన్ని ఈ ఐదేళ్లలోనే చూశాం. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి, ప్రజల్లో ఉద్యోగులను పలచన చేయాలని ప్రయత్నించారు. పీఆర్సీ, డీఏ బకాయిలను పదవీవిరమణ సమయంలో ఇస్తున్నామంటున్నారు. తెదేపా ప్రభుత్వం దిగిపోయేనాటికి రెండు డీఏలు తప్ప పదో పీఆర్సీ బకాయిలు మొత్తం చెల్లించేశారు. వైకాపా ప్రభుత్వం మాత్రం వేతన సవరణ బకాయిలను ఐదేళ్లలో ఇవ్వకపోగా.. పదవీవిరమణ తర్వాత ఇస్తామనే కొత్త సంప్రదాయానికి తెరలేపింది.

  •  ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు దూరం పెట్టాలని ప్రభుత్వం చూసింది. ప్రభుత్వం పట్ల ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఉన్నారన్నది నిజం.వారితో మరుగుదొడ్ల ఫొటోలు, నాడు-నేడు పనులు, మధ్యాహ్న భోజనాల ఫొటోలు తీయడం లాంటి బోధనేతర పనులు చేయించింది. 
  •  కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ నియామకాలే సరైనవి కావు. వీరి సమస్యలను మేము ప్రస్తావిస్తే తాము చూసుకుంటామని ప్రభుత్వ పెద్దలు చర్చల సమయంలో చెప్పారు. కానీ, వారికి ఎలాంటి ప్రయోజనాలు కల్పించలేదు. ఉద్యోగ సంఘాల గుర్తింపును రాజకీయంగా మార్చేశారు. ఆర్టీసీలో వైఎస్సార్‌ సంఘానికి గుర్తింపునిచ్చారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు