విజన్‌ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలి

రానున్న 25 ఏళ్లలో రాష్ట్ర, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజన్‌ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు రంగనాథబాబు గొర్రెపాటి సూచించారు.

Published : 08 May 2024 05:41 IST

అమరావతి, పోలవరం పూర్తయితేనే అభివృద్ధి
ప్రవాస భారతీయుడు రంగనాథబాబు గొర్రెపాటి

ఈనాడు, అమరావతి: రానున్న 25 ఏళ్లలో రాష్ట్ర, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజన్‌ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు రంగనాథబాబు గొర్రెపాటి సూచించారు. మంగళవారం ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. ‘‘ఎవరిని ఎన్నుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనేది ఆలోచించి ఓటు వేయాలి. న్యాయబద్ధంగా పరిపాలన చేసే నాయకులను ఎన్నుకోవాలి. స్వార్థం, సొంత లాభం కోసం మోసం చేసేవారిని ఎన్నుకోవడం వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోవాల్సి వస్తుంది. అభివృద్ధిపై విజన్‌ ఉండి, ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు, అవగాహన ఉన్న నేతకు ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని సూచించారు.

అమరావతిని చూస్తే బాధేస్తోంది..

ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. దళిత డ్రైవర్‌ను చంపి, ఇంటికి డెలివరీ చేశారని ఆరోపణలున్న ఎమ్మెల్సీ అనంతబాబును సీఎం జగన్‌ పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. న్యాయబద్ధ పాలన ఎక్కడ ఉంది? ప్రజలకు డబ్బులు ఇస్తే ఏం పట్టించుకోరనే ఉద్దేశంతో జగన్‌ ఉన్నారు. కొంచెం చదువుకున్నవారు కూడా ఇప్పుడు మంచి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. అమెరికాలో తెలుగువారిని ఎవ్వరిని కలిసినా ఏపీలో ప్రభుత్వం బాగోలేదని చెబుతున్నారు. అభివృద్ధి లేకపోతే ఆదాయం ఎలా వస్తుంది? ఆదాయం రాకపోతే పన్నులు పెంచేయాల్సి వస్తుంది. దీంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందే కానీ అభివృద్ధి జరగదు. గత ప్రభుత్వంలో అమరావతిలో నిర్మాణాలు జరిగినప్పుడు 23 వేల మంది అక్కడ పని చేసేవారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని చూస్తే బాధేస్తోంది. మంచి ప్రభుత్వం ఉంటే గత ఐదేళ్లలో రాజధాని చాలా వరకు పూర్తయిపోయేది. పోలవరం సైతం పూర్తయ్యేది. ఈ రెండూ పూర్తయితే రాష్ట్ర భవిష్యత్తు చాలా బాగుంటుంది. మంచి ప్రభుత్వం వస్తేనే అది సాకారమవుతుంది.

పొమ్మంటే ఎవరొస్తారు..:

రాష్ట్రానికి కంపెనీలు, పరిశ్రమలను తీసుకురావాలి. అమరరాజా బ్యాటరీస్‌ను వెళ్లగొట్టారు. వారు వెళ్లిపోతే నమస్కారం పెడతామని నాయకులు మాట్లాడితే రాష్ట్రానికి ఇంకెవరు వస్తారు? ఎవరు పరిశ్రమలు పెడతారు? కియాలాంటి పరిశ్రమలు వస్తే పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది. దీంతో పేద వారికి సాయం చేయొచ్చు’ అని రంగనాథబాబు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు