‘అంబేడ్కర్‌’ను తొలగించి.. తన పేరు తగిలించి..!

గొప్పింటి బిడ్డలే విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలా? ప్రతిభ ఉన్న పేద పిల్లలు చదువుకోకూడదా? ప్రఖ్యాత వర్సిటీల్లో సీటు పొందిన పేద విద్యార్థులకు ఫీజు చెల్లించే స్థోమత ఉండదు.

Updated : 08 May 2024 06:27 IST

విదేశీ విద్యాదీవెన పథకం అమలులో జగన్నాటకం
అధికారంలోకి వచ్చాక మూడేళ్లు పథకం నిలిపివేత
ఆ తర్వాత అమల్లోకి తెచ్చినా నిబంధనల కొర్రీలు
పథకానికి ఉన్న రాజ్యాంగ నిర్మాత పేరు తొలగింపు
వైకాపా పాలనలో ఎంపికైన గిరిజన విద్యార్థి ఒకే ఒక్కరు!
దళిత బిడ్డలు 50 మంది లోపే
ఈనాడు - అమరావతి

  •  గొప్పింటి బిడ్డలే విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలా? ప్రతిభ ఉన్న పేద పిల్లలు చదువుకోకూడదా? ప్రఖ్యాత వర్సిటీల్లో సీటు పొందిన పేద విద్యార్థులకు ఫీజు చెల్లించే స్థోమత ఉండదు. అలాంటి వారికి మేనమామలా అండగా ఉంటా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఫీజులు చెల్లించి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటా
  • విదేశాల్లో చదువుకునే పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు ఫీజులు ఇస్తున్నాం. దేశంలో ఈ తరహా సాయం చేస్తున్న రాష్ట్రం ఏదీ లేదు.

 సీఎం జగన్‌ ‘విదేశీ విద్యాదీవెన’పై పలికిన ప్రగల్భాలు..


అవతార పురుషుడిలా.. దేశోద్ధారకుడిలా.. ప్రతీ ప్రభుత్వ పథకానికీ.. తన పేరు పెట్టుకుంటారు సీఎం జగన్‌. ప్రచార ఖండూతి.. ఆ స్థాయిలో ఉంటుందాయనకు. కానీ, ఆ శ్రద్ధలో రవ్వంతైనా పథకాల అమలుపైన ఉంటుందా అంటే.. అస్సలుండదు. విదేశీ విద్య పథకానికి గత ప్రభుత్వ హయాంలో పెట్టిన..  రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పేరుని తీసేసి.. తన పేరుని పెట్టుకున్న జగన్‌.. దాని అమలును మాత్రం తీసికట్టుగా తయారుచేశారు!


మాటలు చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు? పేదింటి బిడ్డల ఉన్నత చదువుల కోసం జగన్‌ ఎంతగా తాపత్రయపడుతున్నారో అనుకుంటారు. అంతే కదా. ఆయన మాటలన్నీ ఇలానే తియ్యగా ఉంటాయి.   చేతల్లోకి వస్తేగానీ ఆ మాటల వెనక ఎంత విషం ఉన్నది తెలియదు. ఇందుకు విదేశీ  విద్యాదీవెన పథకం ఒక ఉదాహరణ. ఇచ్చే డబ్బులను పెంచామని డప్పు కొట్టుకోవడమేగానీ గతంలో లేని నిబంధనలు తెచ్చి పేద, మధ్య తరగతి వర్గాలకు పథకాన్ని ఎలా దూరం  చేస్తున్నారో మాత్రం చెప్పరు. అర్హత సాధించే విద్యార్థులే లేనప్పుడు రూ.కోట్ల సాయం   అందిస్తామని ప్రకటించి ఏం లాభం? విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే వారిలో అత్యధికులు మిడ్‌రేంజ్‌(ర్యాంకింగ్‌లో మధ్యస్థాయి) విశ్వవిద్యాలయాలను ఆశ్రయించే వారే. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేందుకు సబ్జెక్టుల వారీగా టాప్‌-50 ర్యాంకు విశ్వవిద్యాలయాల్లో ఎంపికవ్వాలనే నిబంధన తెరమీదకు తెచ్చి జాబితాలో వాటి జాడే లేకుండా చేశారు. పథకానికి అర్హులే లేకుండా చేశారు. ఇక సాయం అందించేది ఎవరికి? ఏటా విదేశాల్లో ఉన్నత విద్య కోసం రాష్ట్రం నుంచి వెళ్తున్న విద్యార్థుల్లో ప్రభుత్వం పేర్కొన్న టాప్‌ విశ్వవిద్యాలయాల్లో ఎంపికయ్యే వారు ఒక శాతానికి మించి ఉండే అవకాశమే లేదు. అందులోనూ పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులు ఇక అంతకంటే తక్కువే. మిగతా వారంతా ఆర్థికంగా ఉన్నత కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఉంటారు. పైగా మెరిట్‌ విద్యార్థులకు ఆ టాప్‌ విశ్వవిద్యాలయాలే ఉపకారవేతనాలిస్తాయి. బ్యాంకులు విద్యారుణాలిచ్చేందుకు ముందుకు వస్తాయి. అలాంటి వారికి ఇక ప్రభుత్వం ఇచ్చేదేంటి?  ఈ విషయాలన్నీ మరుగునపెట్టి.. విదేశీ విద్యకు ఎక్కడలేని సాయాన్ని అందిస్తున్నట్టు ప్రజల్ని అడుగడుగునా మోసగించారు.  


ఎంపికైన ఎస్టీ విద్యార్థులు ఒక్కరే..

అట్టడుగు వర్గాలకు మేలు జరిగేలా అద్భుతంగా అమలు చేశామని చెబుతున్న విదేశీ విద్యాదీవెన పథకానికి గత ఐదేళ్లలో ఒక్క ఎస్టీ విద్యార్థి మాత్రమే ఎంపికయ్యారు. ఎస్సీ విద్యార్థులు 50 మంది లోపే. అన్ని వర్గాల వారి లెక్క తీసినా.. అది 390 మందే. తెదేపా ప్రభుత్వ హయాంలో 4,923 మందికి ఇదే పథకం కింద సాయం అందించారు. ఇది వైకాపా హయాంలోకంటే 12 రెట్లు ఎక్కువ. వైకాపా పాలనలో ఎస్సీ, ఎస్టీలకైతే  ఈ పథకంలో జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. అయినా ఉప ముఖ్యమంత్రులు, మంత్రి పదవులు వెలగబెట్టిన ఏ ఒక్క వైకాపా ఎస్సీ నాయకుడు దీనిపై ప్రశ్నించిన పాపాన పోలేదు. గత ప్రభుత్వంలో విదేశీ విద్యాదీవెన పథకానికి ఉన్న అంబేడ్కర్‌ పేరును తీసేసి.. దర్జాగా జగన్‌ తన పేరును పెట్టుకున్నా  నోరు మెదపలేదు. పైగా అంబేడ్కర్‌ పేరుని తీసేసినా     ఫర్వాలేదనేలా మాట్లాడారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? మరి పెంచామని డప్పు కొట్టుకుంటున్న  రూ.1.25కోట్ల (గరిష్ఠంగా) ప్రోత్సాహకం వల్ల ఎవరికి ఉపయోగం?


 ఇది కాదా నయ వంచన?..

విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే పేదల కలల్ని నిలువునా చిదిమేశారు జగన్‌. తెదేపా ప్రభుత్వ హయాంలో అమలైన    పథకాన్ని అధికారంలోకి రాగానే నిలిపేశారు. మొదటి మూడేళ్లు దాని ఊసే ఎత్తలేదు. ఆ తర్వాత ముస్లిం సంఘాలు కోర్టును ఆశ్రయించిన తర్వాత కక్కలేక మింగలేక ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చినా.. తన కుటిల నీతిని ప్రదర్శించారు. గతం కంటే ఆర్థికసాయాన్ని పెంచుతున్నామని చెప్పి దాని చాటున నిబంధనల కొర్రీలు వేశారు. ప్రపంచవ్యాప్తంగా క్యూఎస్‌ ర్యాంకింగ్‌లో ఉన్న టాప్‌ 200 వర్సిటీల్లో సీటు సంపాదించిన వారికి సంతృప్తికరస్థాయిలో ఆర్థికసాయం అందిస్తానని 2022 జులైలో ఉత్తర్వులిచ్చారు. క్యూఎస్‌ ర్యాంకింగ్‌ 100 వరకు ఉన్న వర్సిటీల్లో సీటు పొందితే 100 శాతం ఫీజు భరిస్తామని, 101 నుంచి 200 వరకు ఉన్న వర్సిటీల్లో అయితే 50 శాతం ఫీజు లేదా రూ.50 లక్షలు(ఏది తక్కువైతే అది) చెల్లిస్తామని చెప్పారు. దరఖాస్తులు ఆహ్వానిస్తే తొలి విడతలో అన్ని వర్గాల వారు కలిపి అర్హత సాధించింది 213 మంది విద్యార్థులే. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారు 119 మంది మాత్రమే. ఆ సంఖ్యనీ తగ్గించడానికి ఇంకా  కసరత్తు చేసి.. సబ్జెక్ట్‌ల అంశాన్ని తెరమీదకు తెచ్చి.. వాటిలో టాప్‌ 50 ర్యాంకుల్లో ఉన్న విశ్వవిద్యాయాల్లో సీటు సంపాదిస్తేనే సాయాన్ని అందిస్తామనేలా సవరణలు చేశారు. గరిష్ఠంగా ఫీజుల్ని రూ.1.25 కోట్ల దాకా చెల్లిస్తామని ప్రకటించారు. ఇలా నిబంధన సవరించిన తర్వాత మరో రెండు విడతల సాయాన్ని అందిస్తే.. ఎంపికైంది 117 మందే. మొత్తంగా మూడు విడతల్లో కలిసి  ఎంపికైన విద్యార్థులు 390 మంది మాత్రమే. ఇలా ఉంటుంది జగన్‌ మార్క్‌ మోసమంటే.


తెదేపా ప్రభుత్వంలో రూ.380 కోట్ల సాయం...

తెదేపా హయాంలో 13 దేశాలను ఎంపిక చేసి, అక్కడ  విద్యార్థులు కోరుకున్న కోర్సుల్లో చదివేందుకు వీలుగా విదేశీవిద్య పథకాన్ని అమలు చేశారు. ఒక్కొక్కరికి మొదట రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. తర్వాత దాన్ని రూ.15 లక్షలకు పెంచారు. 2014-19 మధ్య 1,926 మంది బీసీ విద్యార్థులకు, 491 మంది ఎస్సీ, ఎస్టీలకు, 527 మంది మైనారిటీలకు,     783 మంది ఈబీసీలకు, 1,196 మంది కాపులకు.. మొత్తంగా 4,923 మందికి రూ.380 కోట్ల మేర ఆర్థికసాయం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు