అమరావతి అభివృద్ధితోనే ఏపీ పురోగతి

రాజధాని అమరావతిపై ప్రధాని మోదీ ఇస్తున్న భరోసాతో రాజధాని వాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.

Published : 08 May 2024 05:48 IST

ప్రధాని మోదీ చేయూతతో విశ్వనగరంగా ఎదుగుతుంది
భవిష్యత్తులో ఆర్థిక చుక్కానిలా రూపుదిద్దుకుంటుంది
రాజధాని రైతులు, ఉద్యమ నేతల ఆశాభావం

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - తుళ్లూరు: రాజధాని అమరావతిపై ప్రధాని మోదీ ఇస్తున్న భరోసాతో రాజధాని వాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. జగన్‌ సీఎం అవడంతోనే నిలిచిపోయిన రాజధాని నిర్మాణం.. త్వరలోనే తిరిగి ప్రారంభమవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో బుధవారం జరిగే రోడ్‌షోలో ప్రధాని పాల్గొననున్నారు. రాష్ట్రంలో ఆయన పాల్గొంటున్న ఎన్నికల సభల్లో అమరావతి పునర్‌ వైభవానికి కూటమి కట్టుబడి ఉందన్న సంకేతాలను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వస్తే అమరావతికి మంచి రోజులు వస్తాయన్న భావనను రాజధాని రైతులు, రైతు కూలీలు, ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న వారు వ్యక్తం చేస్తున్నారు.


బడుగులే నష్టపోయారు..
- సువర్ణ కమల, కన్వీనర్‌, అమరావతి దళిత ఐకాస

రాజధానికి భూములు ఇచ్చిన ఎసైన్డ్‌ రైతులకు సమాన ప్యాకేజి ఇస్తామని ఓట్లు వేయించుకున్న జగన్‌.. నమ్మించి మోసం చేశారు. చిన్న, సన్నకారు రైతుల బతుకులు చితికిపోయాయి. అమరావతిని నిర్వీర్యం చేయడం వల్ల ఎక్కువగా బడుగులే నష్టపోయారు. అరాచకపాలన అంతమైతేనే అమరావతికి మంచి రోజులు వస్తాయి.


అమరావతితోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రగతి సాధ్యం
- శివారెడ్డి, అధ్యక్షుడు, అమరావతి పరిరక్షణ సమితి

పదేళ్ల కిందట తెలంగాణ నుంచి విడిపోయిన ఏపీ.. ఇంకా ప్రగతి పట్టాలెక్కకపోవడానికి జగన్‌ సర్కారు విధ్వంసక పాలనే కారణం. వైకాపా మినహా అన్ని పార్టీలూ అమరావతిని తమ మ్యానిఫెస్టోలో చేర్చాయి. యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే సుస్థిరమైన రాజధాని అవసరం. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాజధానిని అభివృద్ధి చేయకుండానే పాలించారు. త్వరలో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయన్న ఆశతో ఉన్నాం.


ఫీనిక్స్‌ పక్షిలా అమరావతి ఊపిరి పోసుకోవాలి
- బాలకోటయ్య, అధ్యక్షుడు, అమరావతి బహుజన ఐకాస

ఐదేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన జగన్‌.. అమరావతిని నిర్దాక్షిణ్యంగా చిదిమేశారు. రాష్ట్రానికి అక్షయపాత్ర లాంటి అమరావతి లేనిదే ఆంధ్రులకు భవిష్యత్తు లేదు. వైకాపా విధ్వంస పాలన అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భరోసాతో అమరావతి ఫీనిక్స్‌ పక్షిలా ఊపిరి పోసుకుంటుంది.


పాలన వికేంద్రీకరణ నిర్ణయంతో తిరోగమనం
- పువ్వాడ సుధాకర్‌, అమరావతి రైతు ఐకాస సమన్వయ కమిటీ సభ్యుడు

పాలన వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రాన్ని వైకాపా అధోగతిపాలు చేసింది. రూ.10 వేల కోట్లు వెచ్చించి తెదేపా ప్రభుత్వం అమరావతిలో చేపట్టిన పనులను జగన్‌ అర్ధాంతరంగా నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణను కోరుకుంటున్నాం. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతికి త్వరలో పూర్వ వైభవం వస్తుందన్న నమ్మకంతో ఉన్నాం.


బడుగుల రాజధానిని వైకాపా నిర్వీర్యం చేసింది
- చిలకా బసవయ్య, దళిత బహుజన ఐకాస కన్వీనర్‌

ఎస్సీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అమరావతిని ఈ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసింది. రాజధానికి భూములు ఇచ్చిన వారిలో అధికులు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. జగన్‌ వచ్చాక నిర్మాణ పనులను నిలిపి వేసి కక్ష సాధించారు. మాకు పనులు లేకుండా చేశారు.


ఐదేళ్లుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నారు
- డాక్టర్‌ వజ్జా రామలింగయ్య, ఎన్నారై, తుళ్లూరు

జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం కారణంగా భూములు త్యాగం చేసిన రైతులు, రైతు కూలీలు ఐదేళ్లుగా తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. 200 మందికి పైగా అసువులు బాశారు. అమరావతిని కాపాడుకునేందుకు 2019 డిసెంబరు నుంచి అలుపెరగకుండా రైతులు ఉద్యమిస్తున్నారు. కేంద్రం సహకారంతో భవిష్యత్తులో దేశం గర్వించే రీతిలో అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు