సంక్షిప్త వార్తలు

జగన్‌ పాలనలో రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యమైందని,  ఎండీయూ వ్యవస్థలను ప్రవేశపెట్టి 29,500 మంది డీలర్ల కుటుంబాలను వైకాపా ప్రభుత్వం రోడ్డున పడేసిందని రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు దివి లీలామాధవరావు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 10 May 2024 06:30 IST

జగన్‌ పాలనలో ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యం
రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంక్షేమ సమాఖ్య ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగన్‌ పాలనలో రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యమైందని,  ఎండీయూ వ్యవస్థలను ప్రవేశపెట్టి 29,500 మంది డీలర్ల కుటుంబాలను వైకాపా ప్రభుత్వం రోడ్డున పడేసిందని రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు దివి లీలామాధవరావు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నం.5 ద్వారా డీలర్లకు సంక్షేమ పథకాలను అందిస్తామన్న జగన్‌ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. విజయవాడలో రాష్ట్ర రేషన్‌ డీలర్ల సమాఖ్య కార్యాలయంలో కార్యవర్గ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ.. ‘సమస్యలు విన్నవించేందుకు పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కలిస్తే.. మాపై పార్టీ ముద్ర వేసి దుర్భాషలాడారు. తెదేపా అధినేత చంద్రబాబు మాత్రమే స్పందించి మా సమస్యలను తీరుస్తామని మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి సహకరించాలని రాష్ట్ర సంక్షేమ సమాఖ్య నిర్ణయించింది’ అని మాధవరావు తెలిపారు.


‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు చేయాల్సిందే’
పిఠాపురంలో న్యాయవాదుల ర్యాలీ

పిఠాపురం, న్యూస్‌టుడే: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దు చేయాల్సిందేనని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కాకినాడ జిల్లా పిఠాపురంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ చట్టం వల్ల పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్రమే ఈ చట్టం తీసుకురమ్మందని సీఎం అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దు చేస్తామని ప్రకటించిన పవన్‌కల్యాణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.


‘జగన్‌ కేసులపై విచారణ చేపట్టండి’

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: ‘సీబీఐ కోర్టు జడ్జి గారూ మా సీఎం గారి పదవి పూర్తవుతోంది. లండన్‌ వెళ్లాలని చూస్తున్నారు. ఆయన ఖాళీ అయ్యారు కాబట్టి దయచేసి పాత కేసుల విచారణ చేపట్టండి’ అని సినీ నటుడు శివాజీ కోరారు. సీబీఎన్‌, ఎన్నారై విభాగం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ.. ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో సీఎం జగన్‌ చెప్పినవన్నీ అసత్యాలంటూ ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు