Kadapa: జగన్‌ కోసం యాత్ర చేశా... చివరికి మామను పోగొట్టుకున్నా

అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తనపై కేసులు పెట్టించి వేధిస్తుండడంతో తన మామ గుండెపోటుతో మృతి చెందారని సుండుపల్లి మండలం దిన్నెల గ్రామానికి చెందిన వైకాపా నేత సిద్ధార్థగౌడ్‌ ఆరోపించారు.

Updated : 12 Nov 2022 13:36 IST

సమాధి సాక్షిగా వైకాపా నేత సిద్ధార్థగౌడ్‌ ఆవేదన

ఈనాడు డిజిటల్‌, కడప: అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తనపై కేసులు పెట్టించి వేధిస్తుండడంతో తన మామ గుండెపోటుతో మృతి చెందారని సుండుపల్లి మండలం దిన్నెల గ్రామానికి చెందిన వైకాపా నేత సిద్ధార్థగౌడ్‌ ఆరోపించారు. ఆయన రాష్ట్ర డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. సుండుపల్లి మండలంలో ఓ జాతీయ నేత విగ్రహం మురుగు కాలువల వద్ద పడేసిన వైనాన్ని వివరిస్తూ ఎమ్మెల్యే వైఖరిని సామాజిక మాధ్యమాల్లో ఆయన ప్రశ్నించారు. దాంతో నందలూరు, రాయచోటి, సుండుపల్లె, రాజంపేట పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కర్మక్రియల సందర్భంగా తన మామ సమాధి వద్ద గురువారం వీడియో తీసి ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అందులో... వైకాపా నేత సిద్ధార్థగౌడ్‌ మాట్లాడుతూ... ‘కేసులన్నీ ఎమ్మెల్యే ఒత్తిడితోనే పెట్టారు. హైదరాబాద్‌లో తలదాచుకుంటే.. పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులు అక్కడికీ వచ్చి దౌర్జన్యం చేశారు. భార్యాపిల్లలు అత్తగారి ఊరైన వికారాబాద్‌ జిల్లాలోని పరిగికి వెళ్లిపోగా అక్కడికీ రావడంతో తీవ్ర మనస్తాపంతో గత నెల 28న మా మామ పెద్ద బిచ్చయ్య గుండెపోటుతో మృతి చెందారు. పోలీసులొచ్చి నా డ్రైవర్‌ను కొట్టి రూ.లక్ష, ఫోన్‌ తీసుకెళ్లిపోయారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో వందల ఎకరాల భూములను కబ్జా చేశారు. ఎమ్మెల్యే అనుచరులు యోగేశ్వరరెడ్డి, హస్తవరానికి చెందిన ఉమామహేశ్వరరెడ్డి, నందలూరు మండలం లేబాకకు చెందిన నాగేంద్ర బినామీలుగా ఉన్నారు. బినామీల పేరిట 200 ఎకరాలు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యుడు మేడా విజయభాస్కర్‌రెడ్డి పేరిట 800 ఎకరాల ప్రభుత్వ భూములు కాజేశారు. ఇంకా చిట్టా ఉంది. త్వరలో విప్పుతాను..’ అని వివరించారు. ‘ఒంటిమిట్టలో చింతరాజుపల్లె రమణపై ఎర్రచందనం కేసులు 25 వరకు ఉండగా, మరో స్మగ్లర్‌ గడ్డం జనార్ధనరెడ్డిలాంటి దుర్మార్గులను దగ్గర పెట్టుకుని నాపై కేసులు పెడతారా అంటూ’ ఆయన ప్రశ్నించారు. వైకాపా అధికారంలోకి రావాలని కోరుకుంటూ.. తాను శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు డ్రైవర్లతో కలిసి భరోసా యాత్ర నిర్వహించానని, ఇప్పుడు ఆపార్టీ కారణంగానే మామను కోల్పోయానని సిద్ధార్థగౌడ్‌ ఆవేదన వ్యక్తంచేశారు.


నా ప్రమేయం లేదు

మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే

నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల్లో నా ప్రమేయం లేదు. రాజకీయంగా నాకు అనుచరులు ఉంటే... వారంతా అక్రమాలకు పాల్పడ్డారంటే ఎలా?. సిద్ధార్థగౌడ్‌ వీడియో విడుదల వెనుక ఎవరో ఉండి ఉంటారు. నేను స్థానికంగా వ్యాపారాలు చేయడం లేదు. నా పేరు సంబోధిస్తూ అనుచరులంటూ ప్రచారం చేయడం బాధగా ఉంది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు