samsung: శాంసంగ్‌ కార్యాలయాల్లో డీఆర్‌ఐ తనిఖీలు

నెట్‌వర్క్ పరికరాల దిగుమతి సమయంలో డ్యూటీలు ఎగ్గొట్టిందన్న అనుమానంతో శామ్‌సంగ్‌ కార్యాలయాల్లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ తనిఖీలు చేసింది

Published : 09 Jul 2021 16:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నెట్‌వర్క్ పరికరాల దిగుమతి సమయంలో డ్యూటీలు ఎగ్గొట్టిందన్న అనుమానంతో శాంసంగ్‌  కార్యాలయాల్లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ తనిఖీలు చేసింది. బుధవారం దిల్లీ, ముంబయిల్లోని  సంస్థ కార్యాలయాల్లో ఈ తనిఖీలు మొదలయ్యాయి. వీటిల్లో వెలుగు చూసిన అంశాలపై డీఆర్‌ఐ ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. నెట్‌వర్క్‌ కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ముంబయి కార్యాలయంలో తొలుత అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత గురుగ్రామ్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో కూడా వీటిని నిర్వహించారు.

ఆ సమయంలో దిగుమతులకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించినట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. కాకపోతే, వారు ఏమి గుర్తించారో ఇంకా ప్రకటించలేదు. మరోపక్క ఈ తనిఖీలపై శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు. ప్రస్తుతం దేశంలో అత్యధిక 4జీ ఫోన్లు విక్రయిస్తున్న సంస్థ ఇదే. దీంతోపాటు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌కు 4జీ పరికరాలను సరఫరా చేస్తోంది.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఉండటంతో శాంసంగ్‌ తన స్వదేశం దక్షిణకొరియా, వియాత్నాం నుంచి టెలికమ్‌ పరికరాలను ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా దిగుమతి చేసుకొంటోంది. కానీ, భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేని దేశాల్లో తయారైన నెట్‌వర్కింగ్‌ పరికరాలను ద.కొరియా, వియాత్నాంల మార్గం నుంచి దిగుమతి చేసుకొంటున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. వాస్తవానికి ఆ పరికరాలపై పన్నులు చెల్లించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని