Layoffs: ఒకప్పుడు జావా డెవలపర్‌.. ఇప్పుడు ర్యాపిడో డ్రైవర్‌

లేఆఫ్‌ల కారణంగా కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగం కోల్పోయి.. ర్యాపిడో డ్రైవర్‌గా మారిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వివరాలను బెంగళూరుకు చెందిన నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మాత్రం ఇదో పబ్లిసిటీ స్టంట్‌ అని కామెంట్లు చేస్తున్నారు. 

Published : 23 Jun 2023 18:01 IST

బెంగళూరు: ఆర్థిక మాంద్యం భయాలతో గతేడాది చివర్లో ప్రారంభమైన లేఆఫ్‌లు (Layoffs) ఇప్పటికీ కొన్ని సంస్థల్లో కొనసాగుతూనే ఉన్నాయి. లేఆఫ్‌ల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో కొందరు ఇతర రంగాల్లో పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు చేస్తూ.. అర్హతకు తగిన అవకాశాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ ఆర్థిక మాంద్యం కారణంగా ఉద్యోగం కోల్పోయి బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వివరాలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

బెంగళూరుకు చెందిన లవ్‌నీష్‌ ధీర్‌ అనే నెటిజన్‌ ర్యాపిడో (Rapido) యాప్‌ ద్వారా బైక్‌ ట్యాక్సీని బుక్‌ చేసుకున్నాడు. మార్గమధ్యలో తన ర్యాపిడో డ్రైవర్‌ గతంలో ఓ కార్పొరేట్‌ కంపెనీలో పనిచేసినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ‘‘నా ర్యాపిడో డ్రైవర్‌ గతంలో హెచ్‌సీఎల్‌ కంపెనీలో జావా డెవలపర్‌గా పనిచేశాడంట. కొద్ది నెలల క్రితం ఆర్థిక మాంద్యం భయాలతో ప్రకటించిన లేఆఫ్‌ల కారణంగా ఉద్యోగం కోల్పోయినట్లు చెప్పాడు. మీకు తెలిసిన కంపెనీల్లో ఎక్కడైనా జావా డెవలపర్‌ ఓపెనింగ్స్‌ ఉంటే నాకు చెప్పండి. అతని వివరాలను మీకు డైరెక్ట్‌ మెసేజ్‌ చేస్తాను’’ అని ట్వీట్‌ చేశాడు.

ఈ ట్వీట్ చూసిన కొందరు నెటిజన్లు మాత్రం ఇదో పబ్లిసిటీ స్టంట్‌, కేవలం పాపులారిటీ కోసం ఇలాంటివి పోస్టులు చేస్తున్నారని కామెంట్‌ చేశారు. దీంతో ర్యాపిడో బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌ అర్హతకు సంబంధించిన వివరాల లింక్‌ను ధీర్ మరో ట్వీట్‌లో పోస్ట్‌ చేస్తూ.. నిజంగా మీరు అతనికి సాయం చేయాలనుకుంటే.. అతనికి ఓపెనింగ్స్‌ గురించి తెలియజేయండని ట్వీట్‌ చేశాడు. లేఆఫ్‌ల కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారిలో ఎక్కువ మంది ర్యాపిడో బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌లు, డెలివరీ ఏజెంట్‌లుగా మారుతున్నారు. ఈ క్రమంలోనే తమ విద్యార్హతకు తగిన ఉద్యోగం కోసం లింక్డ్‌ఇన్‌ వేదికగా వివరాలను షేర్‌ చేస్తూ.. సాయం చేయమని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని