Twitter: ట్విటర్‌ యూజర్లకు షాక్‌.. ట్వీట్స్‌ చూడటానికి లిమిట్‌!

ట్విటర్‌ యూజర్లకు ఆ సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ షాకిచ్చారు. ట్వీట్స్‌ను చూడటంలో వినియోగదారులకు పరిమితులు విధించారు.

Updated : 02 Jul 2023 16:37 IST

దిల్లీ: ట్విటర్‌ యూజర్లకు ఆ సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ షాకిచ్చారు. ట్వీట్స్‌ను చూడటంలో వినియోగదారులకు పరిమితులు విధించారు. వెరిఫైడ్​, అన్​వెరిఫైడ్​, కొత్త అన్​వెరిఫైడ్ ఖాతాదారులకు వేర్వేరుగా లిమిట్‌ ఇచ్చారు.

ట్విటర్‌ (Twitter) సేవల్లో శనివారం రాత్రి నుంచి అంతరాయం ఏర్పడటంపై ఎలాన్‌ మస్క్ (Elon Musk) స్పందిచారు. ట్విటర్‌లో పోస్టులను వీక్షించడంపై తాత్కాలికంగా పరిమితులను తీసుకొచ్చినట్లు ఆయన ప్రకటించారు. ఖాతాల తీరును బట్టి రోజుకు ఎన్ని పోస్టులు వీక్షించ వచ్చో కూడా ఆయన తెలిపారు. ఈ విషయాన్ని శనివారం ఆయన ట్వీట్‌ చేసి ప్రకటించారు.

భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ట్విటర్‌ యూజర్లు ట్వీట్లను యాక్సెస్‌ చేయలేకపోయారు. యాప్‌లో నెలకొన్న ఈ అంతరాయంపై పలువురు యూజర్లు ఫిర్యాదు చేశారు. కొందరు ట్వీట్లు ఓపెన్‌ చేస్తుంటే ‘కెనాట్‌ రీట్రైవ్‌ ట్వీట్స్‌’ ‘రేట్‌ లిమిట్‌ ఎక్సీడెడ్‌’ వంటి సందేశాలు దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. దీనిపై ట్విటర్‌ యజమాని మస్క్ స్పందిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. డేటా స్క్రాపింగ్, సిస్టమ్ మానిప్యులేషన్ల సమస్యలను పరిష్కరించడానికి ఈ తాత్కాలిక పరిమితులను తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. ‘‘యూజర్లు ట్విటర్‌కు బానిసయ్యే అవకాశాలెక్కువగా ఉన్నాయి.. దాని నుంచి బయటపడాల్సిన అవసరముంది. నేను ప్రపంచానికి మంచి చేస్తున్నాను’’ అని సమర్థించుకొన్నారు.

రోజుకు వీక్షించే పోస్టుల సంఖ్యను పరిమితం చేస్తున్నట్లు  మస్క్‌ తన ట్వీట్‌లో తెలిపారు. వెరిఫైడ్‌ అకౌంట్‌కు 6వేల పోస్టులు, అన్‌ వెరిఫైడ్‌ అకౌంట్‌కు 600 పోస్టులు, కొత్త అన్‌ వెరిఫైడ్ అయిన ఖాతాలు 300 వరకు పోస్టులు వీక్షించవచ్చని అందులో పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వీటి పరిమితి పెంచుతామని.. వెరిఫైడ్‌కు 8 వేలు, అన్‌వెరిఫైడ్‌కు 800, కొత్త అన్‌వెరిఫైడ్‌కు 400 పోస్టులు రోజులో వీక్షించవచ్చని మరో ట్వీట్‌లో వెల్లడించారు. శనివారం రాత్రి నుంచి ట్విటర్‌ సేవలకు అంతరాయం ఏర్పడడంతో #twitterdown  హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌లోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని