ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28% పన్ను

ఆన్‌లైన్‌ గేమింగ్‌, గుర్రపు పందేలు, కేసినోల్లో.. పూర్తి పందెం విలువపై 28% పన్ను విధించాలని మంగళవారం జరిగిన జీఎస్‌టీ మండలి 50వ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

Published : 12 Jul 2023 01:02 IST

సినిమాహాళ్లలో ఆహార పానీయాలపై పన్ను 5 శాతానికి తగ్గింపు
జీఎస్‌టీ మండలి నిర్ణయం

దిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్‌, గుర్రపు పందేలు, కేసినోల్లో.. పూర్తి పందెం విలువపై 28% పన్ను విధించాలని మంగళవారం జరిగిన జీఎస్‌టీ మండలి 50వ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. మంత్రుల కమిటీ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా ఈ పన్ను రేటును జీఎస్‌టీ మండలి నిర్ణయించింది.  నైపుణ్య ఆధారిత/అదృష్టం ఆధారిత గేమ్‌లా అనే వర్గీకరణ చేయకుండానే ఆన్‌లైన్‌ గేమింగ్‌పై పన్ను విధించడం గమనార్హం. ఆన్‌లైన్‌ గేమింగ్‌లు, కేసినోలకు గరిష్ఠ పన్ను విధించాలనే నిర్ణయం వెనక పరిశ్రమను దెబ్బతీయాలన్నది తమ ఉద్దేశం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అత్యవసర వస్తువులకు విధిస్తున్న స్థాయిలోనే, వీటికి పన్ను రేట్లు ఉండొచ్చన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌కు ప్రస్తుతం పన్ను సంబంధిత అంశంపైనే జీఎస్‌టీ మండలి నిర్ణయం తీసుకుందని, నియంత్రణ పరమైన అంశాన్ని ఐటీ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని ఆమె వివరించారు. యువత ఆన్‌లైన్‌ గేమింగ్‌కు బానిసలు కాకుండా నియంత్రించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై ఏవైనా గేమింగ్‌ కంపెనీలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే.. ప్రభుత్వం పోరాడేందుకు సిద్ధంగా ఉందని రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా తెలిపారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌, గుర్రపు పందేలు, కేసినోలను నిర్వచించేందుకు జీఎస్‌టీ చట్టంలో సవరణలు చేయనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌కు గరిష్ఠ జీఎస్‌టీ రేటును విధించడాన్ని ఆల్‌ ఇండియా గేమింగ్‌ ఫెడరేషన్‌ వ్యతిరేకించింది.వ్యాపార విస్తరణ పైనా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.


రెస్టారెంట్ల మాదిరే

సినిమా హాళ్లలో పానీయాలు, ఆహార పదార్ధాలపై సేవా పన్నును 5 శాతానికి తగ్గించింది. సినిమా టికెట్లపై (రూ.100లోపు ఉంటే 12%, రూ.100 పైన ఉంటే 18%) వర్తింపజేస్తున్న పన్ను కాకుండా.. రెస్టారెంట్‌లలో విధిస్తున్న తరహాలో 5 శాతం పన్నే ఆహార, పానీయాలపై విధించనున్నారు. జీఎస్‌టీ మండలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మల్టీప్లెక్స్‌ ఆపరేటర్లు స్వాగతించారు. థియేటర్ల వ్యాపారం పుంజుకునేందుకు ఈ పరిణామం దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.


యుటిలిటీ వాహనాలు అంటే..

యుటిలిటీ వాహనాలకు సంబంధించి, 28% జీఎస్‌టీకి అదనంగా 22 శాతం సెస్‌ విధింపునకు ‘యుటిలిటీ వాహనం’ నిర్వచనంలోనూ జీఎస్‌టీ మండలి మార్పు చేసింది. 1500 సీసీ లేదా అంతకుమించి ఇంజిన్‌ సామర్థ్యం, 4 మీటర్లు లేదా అంతకుమించి పొడువు, అన్‌- ల్యాడెన్‌ గ్రౌండ్‌ క్లియరెన్స్‌ 170 ఎంఎం ఉన్న యుటిలిటీ వాహనాలకే సెస్‌ విధించనున్నట్లు పేర్కొంది.  


వీటికి మినహాయింపు

కేన్సర్‌ ఔషధం దినుటక్సిమాబ్‌, అరుదైన వ్యాధుల చికిత్సలో వాడే మరికొన్ని ఔషధాల దిగుమతులపై జీఎస్‌టీ నుంచి మినహాయింపును ఇస్తూ జీఎస్‌టీ మండలి నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక వైద్య అవసరాల కోసం (ఎఫ్‌ఎస్‌ఎమ్‌పీ) ఉపయోగించే ఆహార పదార్థాల దిగుమతులతో పాటు ప్రైవేట్‌ సంస్థలు అందించే శాటిలైట్‌ ప్రయోగ సేవలకు కూడా జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు సీతారామన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు