నియామకాలు బాగుంటాయ్‌

ఈ ఏడాది డిసెంబరు వరకు నియామకాల జోరు కొనసాగనుందని ఒక నివేదిక అంచనా వేస్తోంది. కొత్త ఉద్యోగావకాశాలతో పాటు, ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకూ కంపెనీలు ముందుకు వస్తున్నాయి.

Updated : 22 Aug 2023 07:19 IST

కొత్త అవకాశాలు.. ఖాళీ పోస్టుల భర్తీ
నౌక్రీ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: ఈ ఏడాది డిసెంబరు వరకు నియామకాల జోరు కొనసాగనుందని ఒక నివేదిక అంచనా వేస్తోంది. కొత్త ఉద్యోగావకాశాలతో పాటు, ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకూ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. 1200 కు పైగా నియామక సంస్థలు, కన్సల్టెంట్ల నుంచి సేకరించిన అభిప్రాయాలతో, నౌక్రీ హైరింగ్‌ ఔట్‌లుక్‌ పేరిట నివేదికను సోమవారం విడుదల చేసింది. ఈ ప్రకారం..  

సర్వేలో పాల్గొన్న 92% మంది నియామకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. 47% మంది రిక్రూటర్లు కొత్త అవకాశాలు, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ పెరుగుతాయని పేర్కొన్నారు. 26% మంది కేవలం కొత్త ఉద్యోగాలే పెరిగేందుకు అవకాశం ఉందని తెలిపారు. 20% మంది తమ ఉద్యోగుల సంఖ్య యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేవలం 4% మందే ఉద్యోగాల్లో కొంత మేరకు కోత తప్పకపోవచ్చని వెల్లడించారు.

ఈ ఉద్యోగాలకు: బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, మార్కెటింగ్‌, ఆపరేషన్స్‌ లాంటి ఉద్యోగాలకు అధిక గిరాకీ ఉంటుందని రిక్రూటర్లు భావిస్తున్నారు. కాస్త అనుభవం ఉన్న వారికి అధిక ప్రాధాన్యం ఉండబోతోంది. వీరి తర్వాతే తాజా ఉత్తీర్ణుల కోసం చూస్తున్నారు.  

వలసలు తగ్గుతాయి: సర్వేలో పాల్గొన్న దాదాపు 70% మంది రిక్రూటర్లు రాబోయే 7 నెలల్లో ఉద్యోగుల వలసల రేటు 15%  లోపే ఉంటుందని భావిస్తున్నారు. కొంతమంది మాత్రం 40% వరకు కొనసాగొచ్చని అంచనా వేశారు.  అనిశ్చితి నేపథ్యంలో.. ఉద్యోగులు తాము ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో కొనసాగేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని నివేదిక పేర్కొంది. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, మార్కెటింగ్‌, ఆపరేషన్స్‌, మానవ వనరుల విభాగాల్లో అనుభవజ్ఞులు అత్యధికంగా ఉద్యోగాలు మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని వెల్లడించింది.

ఇంక్రిమెంట్లు పరిమితంగానే: ఈ ఏడాది ప్రథమార్థంలో సంస్థలు ఉద్యోగుల ఇంక్రిమెంట్ల విషయంలో పరిమితులు పాటించాయి. 42% కంపెనీలు 10% లోపే ఇంక్రిమెంట్‌ ఇవ్వగా, 31% సంస్థలు 10-15% మధ్య ఇచ్చాయి. 6%  సంస్థలే 30 శాతానికి మించి వేతనాన్ని పెంచాయని నివేదిక పేర్కొంది. 

ప్రాంగణ ఎంపికలపై: వచ్చే 6 నెలల్లో ప్రాంగణ నియామకాలు పెరగొచ్చని 11% మంది చెప్పగా, 36% మంది ప్రణాళిక ప్రకారమే తీసుకుంటామని తెలిపారు. 39% సంస్థలు ఈసారి ప్రాంగణ ఎంపికలు నిలిపి వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో నియామకాలు సాధారణ స్థితికి చేరుకునే అవకాశాలే కనిపిస్తున్నాయని నౌక్రీ.కామ్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ పవన్‌ గోయల్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని