సంక్షిప్త వార్తలు

అగ్రశ్రేణి ఎరువుల కంపెనీ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, కాకినాడలో ఫాస్పారిక్‌ యాసిడ్‌, సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Published : 30 Apr 2024 02:00 IST

కాకినాడలో కోరమాండల్‌ యూనిట్లు
ఫాస్పారిక్‌ యాసిడ్‌, సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ తయారీకి
రూ.1000 కోట్ల పెట్టుబడి!

ఈనాడు, హైదరాబాద్‌: అగ్రశ్రేణి ఎరువుల కంపెనీ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, కాకినాడలో ఫాస్పారిక్‌ యాసిడ్‌, సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ అరుణ్‌ అలగప్పన్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌.శంకర సుబ్రమణియన్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ యూనిట్‌ నిర్మాణానికి రూ.1,000 కోట్ల పెట్టుబడి అవసరమని అంచనా.  ఫాస్పారిక్‌ యాసిడ్‌ తయారీ ప్లాంటును రోజుకు 650 టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తారు. సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ ప్లాంటుకు రోజుకు 1800 టన్నుల సామర్థ్యం ఉంటుంది. డీఏపీ, ఎన్‌పీకే.. తదితర ఫాస్పాటిక్‌ ఎరువుల తయారీలో ఈ ఆమ్లాలను వినియోగిస్తారు. ఈ యూనిట్ల నిర్మాణంతో ముడిపదార్థాల కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ అధికార వర్గాలు వివరించాయి.


కేఫిన్‌ టెక్నాలజీస్‌ లాభం రూ.74 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో కేఫిన్‌ టెక్నాలజీస్‌ రూ.228.34 కోట్ల ఆదాయంపై రూ.74.47 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 24.7%, నికర లాభం రూ.32.6% వృద్ధి చెందాయి. త్రైమాసిక ఈపీఎస్‌    రూ.4.32గా నమోదయ్యింది. 2023-24 మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.837.53 కోట్లు, నికర లాభం రూ.246 కోట్లుగా ఉన్నాయి. ఒక్కో షేరుపై రూ.5.75 డివిడెండును సంస్థ ప్రకటించింది.


ఎంఈఐఎల్‌ గ్రూపునకు కర్ణాటకలో రూ.8000 కోట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎంఈఐఎల్‌ (మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌) గ్రూపు, కర్ణాటకలో 2,000 మెగావాట్ల శరావతి పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టు దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు విలువ రూ.8,000 కోట్లు. శరావతి నదిపై జల విద్యుత్తు ఉత్పత్తికి అధిక అవకాశాలు ఉన్నాయి. దీనిపై పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు నిర్మించడం ఎంతో లాభదాయకమని, ఇది దేశంలోనే అతిపెద్ద స్టోరేజ్‌ పవర్‌ జనరేషన్‌ యూనిట్‌ అవుతుందని ఎంఈఐఎల్‌ గ్రూపు పేర్కొంది. కర్ణాటకలో విద్యుత్తు డిమాండ్‌ అధికంగా, లభ్యత తక్కువగా ఉంది. ఈ కొరతను కొంతమేరకైనా తగ్గించడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఎల్‌అండ్‌టీ.. వంటి అగ్రశ్రేణి సంస్థలు పోటీపడినా, ఎంఈఐఎల్‌ సొంతం చేసుకోగలిగింది.


టయోటా రుమియన్‌లో ఆటోమేటిక్‌ వర్షన్‌
ధర రూ.13 లక్షలు

దిల్లీ: టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌(టీకేఎమ్‌) తన బహుళ వినియోగ వాహనం రుమియన్‌లో సరికొత్త ఆటోమేటిక్‌ వర్షన్‌ను ఆవిష్కరించింది. రుమియన్‌ జిలో ఇది వరకు 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌ బాక్స్‌లోనే లభిస్తుండగా.. ఇపుడు 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్సిమిషన్‌ను పొందొచ్చు. ఈ కొత్త వర్షన్‌ ధరను రూ.13 లక్షలు(ఎక్స్‌ షోరూం)గా నిర్ణయించారు. రూ.11,000తో బుకింగ్‌ చేసుకోవచ్చని.. డెలివరీలను త్వరలోనే ప్రారంభిస్తామని కంపెనీ చెబుతోంది. ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌ను రుమియన్‌ ఎస్‌, జీ, వీ వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. సీఎన్‌జీ వేరియంట్‌కూ బుకింగ్‌లను పునః ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. భారీ గిరాకీ రావడంతో, ఈ వేరియంట్‌ బుకింగ్‌లను గతేడాది సెప్టెంబరులో తాత్కాలింగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని