మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు

బ్యాంకింగ్‌ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్‌ రాబడులు తగ్గడం, అక్కడి టెక్‌ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి.

Updated : 30 Apr 2024 02:41 IST

బ్యాంకింగ్‌ షేర్ల దూకుడు.. సూచీలకు భారీ లాభాలు
సమీక్ష

బ్యాంకింగ్‌ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్‌ రాబడులు తగ్గడం, అక్కడి టెక్‌ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. దేశీయంగా ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నిఫ్టీ కీలకమైన 22,600 పాయింట్ల ఎగువకు చేరింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు అండగా నిలిచాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి 83.45 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.51% నష్టంతో 89.04 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి.

 మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ సోమవారం రూ.2.48 లక్షల కోట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన రూ.406.52 లక్షల కోట్లు (4.90 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది.

సెన్సెక్స్‌ ఉదయం 73,982.75 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే జోరు కొనసాగించిన సూచీ, 74,721.15 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరకు 941.12 పాయింట్ల లాభంతో 74,671.28 వద్ద ముగిసింది. నిఫ్టీ 223.45 పాయింట్లు పెరిగి 22,643.40 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 22,441.90- 22,655.80 పాయింట్ల మధ్య కదలాడింది.

  •  ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు 4.67% పరుగులు తీసి రూ.1,158.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ.1,163.25 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.36,555.4 కోట్లు పెరిగి రూ.8.14 లక్షల కోట్లకు చేరింది.
  • అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేరు 2.93% లాభంతో  రూ.9,984 వద్ద, యెస్‌ బ్యాంక్‌ షేరు 3.67% పెరిగి రూ.27.11 దగ్గర ముగిశాయి.
  • మార్చి త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో హెచ్‌సీఎల్‌ టెక్‌ షేరు 5.79% కుదేలై రూ.1,387.10 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ  రూ.23,120.42 కోట్లు తగ్గి రూ.3.76 లక్షల కోట్లకు చేరింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 26 లాభపడ్డాయి. ఎస్‌బీఐ 3.09%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.90%, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.60%, ఎన్‌టీపీసీ 2.07%, కోటక్‌ బ్యాంక్‌   1.98%, టీసీఎస్‌ 1.51%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.45%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.26%, సన్‌ఫార్మా 1.18%, నెస్లే 1.08% రాణించాయి. ఐటీసీ 0.44%, విప్రో  0.37% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. బ్యాంకింగ్‌ 2.70%, ఆర్థిక సేవలు 1.81%, యుటిలిటీస్‌ 1.12%, విద్యుత్‌ 0.90%, ఇంధన 0.79% మెరిశాయి. స్థిరాస్తి, సేవలు నిరాశపరిచాయి. బీఎస్‌ఈలో 1982 షేర్లు లాభాల్లో ముగియగా, 1934 స్క్రిప్‌లు నష్టపోయాయి. 172 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
  • మెడికా సినర్జీలో మణిపాల్‌ హాస్పిటల్స్‌కు 87% వాటా: కోల్‌కతా కేంద్రంగా పనిచేసే ఆసుపత్రుల సంస్థ మెడికా సినర్జీలో 87% వాటా కొనుగోలు చేసేందుకు తప్పనిసరిగా అమలయ్యే ఒప్పందం చేసుకున్నట్లు మణిపాల్‌ హాస్పిటల్స్‌ సోమవారం ప్రకటించింది. లావాదేవీ విలువను వెల్లడించలేదు. తూర్పు రాష్ట్రాల్లో విస్తరించాలన్న వ్యూహంలో భాగంగా ఈ కొనుగోలు చేపట్టినట్లు మణిపాల్‌ హాస్పిటల్స్‌ ఎండీ, సీఈఓ దిలీప్‌ జోస్‌ తెలిపారు. తమ పోర్ట్‌ఫోలియోలో మెడికా సినర్జీని కలుపుకుని, రీబ్రాండింగ్‌ చేస్తామని వెల్లడించారు. మెడికా కొనుగోలుతో మణిపాల్‌ హాస్పిటల్స్‌ పడకల సామర్థ్యం 9500 నుంచి 10,500కు పెరుగుతోంది.
  • 20 అరుదైన ఖనిజాల గనుల వేలం జూన్‌లో: దాదాపు 20 అరుదైన ఖనిజాల గనుల నాలుగో విడత వేలాన్ని జూన్‌ ఆఖరులో నిర్వహించనున్నట్లు కేంద్ర గనుల కార్యదర్శి వీఎల్‌ కాంతారావు తెలిపారు. మొదటి విడత కింద 7 అరుదైన గనుల వేలం ప్రక్రియ దాదాపు పూర్తయిందని, నెల రోజుల్లో ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. రాగి, లిథియం, నికెల్‌, కోబాల్ట్‌ వంటి ఖనిజాలను అరుదైనవిగా పరిగణిస్తారు.
  • ఆరోగ్య సంరక్షణ టెక్‌ సంస్థ ఇండిజీన్‌ లిమిటెడ్‌ ఐపీఓ మే 6న ప్రారంభమై 8న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.430- 452 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.1,842 కోట్లు సమీకరించనుంది. యాంకర్‌ మదుపర్లు మే 3న బిడ్‌లు దాఖలు చేయొచ్చు. రిటైల్‌ మదుపర్లు కనీసం 33 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.
  • దక్షిణ ముంబయిలో కొత్తగా చేపట్టిన గృహ ప్రాజెక్ట్‌లో రూ.1300 కోట్ల విలువైన విలాస ఫ్లాట్‌లను విక్రయించినట్లు ప్రెస్టీజ్‌ గ్రూప్‌ వెల్లడించింది.
  • గురుగ్రామ్‌లో విలాస గృహ ప్రాజెక్ట్‌ రెండో దశ మొదటి రోజునే రూ.300 కోట్లకు పైగా విలువైన 50 ఫ్లాట్లు అమ్ముడుపోయినట్లు తులిప్‌ ఇన్‌ఫ్రాటెక్‌ తెలిపింది.
  • దేశీయ, అంతర్జాతీయ విపణుల్లో రూ.1036 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లును కేఈసీ ఇంటర్నేషనల్‌ దక్కించుకుంది.

నేటి బోర్డు సమావేశాలు: ఐఓసీ, ఆర్‌ఈసీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, క్యాస్ట్రోల్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, హావెల్స్‌, ఇండస్‌ టవర్‌, మోల్డ్‌టెక్‌ టెక్నాలజీస్‌, స్టార్‌ హెల్త్‌, సింఫనీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని