పన్ను రాయితీలను ‘ఊహాజనిత నష్టం’గా ఎలా పరిగణిస్తారు?

ప్రభుత్వం ప్రకటించిన పన్ను రాయితీలను, కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) ‘ఊహాజనిత నష్టం’ గా ఎలా నిర్ణయిస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు ప్రశ్నించారు.

Published : 03 May 2024 03:33 IST

ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించే అర్హత సీఏజీకి లేదు
ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు

దిల్లీ: ప్రభుత్వం ప్రకటించిన పన్ను రాయితీలను, కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) ‘ఊహాజనిత నష్టం’ గా ఎలా నిర్ణయిస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి నష్టం చేసేవే కానీ, మేలు చేయవని ఆయన అభిప్రాయపడ్డారు. ‘జస్ట్‌ ఏ మెర్సీనరీ..నోట్స్‌ ఫ్రమ్‌ మై లైఫ్‌ అండ్‌ కెరీర్‌’ అనే పుస్తకంలో దువ్వూరి తన అనుభవాలు వెల్లడించిన విషయం విదితమే. ఇందులో 2జీ స్ప్రెక్ట్రమ్‌ ధర నిర్ణయించే విషయంలో పరిశీలించిన అంశాలు, అప్పటి పరిస్థితులను ఆయన ప్రస్తావించారు. ‘ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం టెలికాం సేవలను ప్రజలకు బాగా దగ్గర చేయాలనే లక్ష్యంతో కొంత ఆదాయాన్ని కోల్పోవటానికి సిద్ధమైంది, దాని మీద సీఏజీ సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకుని ‘ఊహాజనిత నష్టం’ వచ్చిందని వ్యాఖ్యానించవచ్చా’ అని దువ్వూరి సుబ్బారావు ప్రశ్నించారు. ఈ విధమైన అభిప్రాయానికి రావటానికి సీఏజీని అనుమతిస్తే, మరి బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించే ప్రతి పన్ను రాయితీని ఎవరైనా ప్రశ్నించవచ్చు కదా? అని ఆయన అన్నారు. కొన్ని సందర్భాల్లో పన్ను ఆదాయం కంటే విస్తృత ప్రజా ప్రయోజనాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని దువ్వూరి వివరించారు. మార్కెట్‌ ధర కంటే తక్కువ ధరకు 2జీ స్ప్రెక్ట్రమ్‌ను విక్రయించాలనే అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించడానికి సీఏజీకి హక్కు ఎక్కడిదని సుబ్బారావు నిలదీశారు.


ఇదీ జరిగింది

దేశవ్యాప్తంగా 23 టెలికాం సర్కిళ్ల పరిధిలో 2జీ స్ప్రెక్ట్రమ్‌ కేటాయింపు విషయంలో ఎక్కువ మంది ఆపరేటర్లకు లైసెన్సులు ఇవ్వడం ద్వారా అధిక పోటీ సృష్టించాలని, తత్ఫలితంగా ప్రజలకు మేలు జరుగుతుందని 2007లో అప్పటి ప్రభుత్వం, టెలికామ్‌ మంత్రి ఏ. రాజా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ కూడా ఆమోదించింది. 2001లో వేలంలో నిర్ణయించిన ధరనే దీనికీ వర్తింపజేశారు. 2001లో కేంద్ర మంత్రివర్గ నిర్ణయం ప్రకారం ఈ విషయంలో టెలికాం విభాగం, ఆర్థిక శాఖలు సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాలి. ఈ అంశం ఆర్థిక శాఖ పరిశీలనకు వచ్చినప్పుడు ‘2007లో స్ప్రెక్ట్రమ్‌ను, 2001 ధరల ప్రకారం విక్రయించటం సరికాదనే అభిప్రాయానికి నేను వచ్చాను. అందువల్ల మళ్లీ వేలం ద్వారా ధర నిర్ణయించాలని సూచించాను’ అని దువ్వూరి సుబ్బారావు తన పుస్తకంలో వెల్లడించారు. కానీ ‘స్పెక్ట్రమ్‌కు మళ్లీ కొత్తగా ధర నిర్ణయించాల్సిన అవసరం లేదని, ట్రాయ్‌ సిఫారసు చేసినట్లుగా 2001 ధరనే వర్తింపజేయాలని’ టెలికాం విభాగం నిర్ణయించింది. తక్కువ ధర వల్ల ఎక్కువ మంది ఆపరేటర్లు ముందుకు వస్తారని, తద్వారా పోటీ పెరిగి ప్రజలకు తక్కువ ధరలో టెలికాం సేవలు లభిస్తాయనేది టెలికాం విభాగ అభిప్రాయం కావచ్చని దువ్వూరి పేర్కొన్నారు. ధర విషయంలో ఏకాభిప్రాయం రానప్పటికీ, టెలికాం విభాగం దరఖాస్తులు పిలిచి, 46 కంపెనీలకు 120 లైసెన్సులు జారీ చేసింది. 2001 ధర ప్రకారమే లైసెన్సు ఇస్తున్నప్పటికీ, ఆర్థిక శాఖ అభిప్రాయాన్ని బట్టి, భవిష్యత్తులో ధర మారే అవకాశం ఉందనే నిబంధనను లైసెన్సు ఒప్పందంలో పొందుపరిచారు. ఆ తర్వాత ఈ వ్యవహారం వివాదాస్పదం అయింది. ఈ నేపథ్యంలో 2010 నవంబరులో సీఏజీ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. స్ప్రెక్ట్రమ్‌ను తక్కువ ధరకు  విక్రయించడం వల్ల ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల మేరకు నష్టం వచ్చిందని ఈ నివేదికలో సీఏజీ తన అభిప్రాయాన్ని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని