కోఫోర్జ్‌ చేతికి సిగ్నిటీ టెక్నాలజీస్‌

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ టెస్టింగ్‌ సేవల సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్‌ను, దేశీయ ఐటీ రంగ అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన కోఫోర్జ్‌ లిమిటెడ్‌ (గతంలో ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌) సొంతం చేసుకోనుంది.

Updated : 03 May 2024 13:35 IST

54% వాటా కొనుగోలుకు నిర్ణయం
ప్రమోటర్లు, ఇతర వాటాదార్లతో ఒప్పందం
ఒక్కో షేరు ధర రూ.1,415
సాధారణ వాటాదార్లకు ఓపెన్‌ ఆఫర్‌
లావాదేవీ విలువ దాదాపు రూ.2,000 కోట్లు  
ఈనాడు - హైదరాబాద్‌

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ టెస్టింగ్‌ సేవల సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్‌ను, దేశీయ ఐటీ రంగ అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన కోఫోర్జ్‌ లిమిటెడ్‌ (గతంలో ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌) సొంతం చేసుకోనుంది. ఈ మేరకు సిగ్నిటీ టెక్నాలజీస్‌ ప్రమోటర్లు, ఇతర వాటాదార్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కోఫోర్జ్‌ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం సిగ్నిటీ టెక్నాలజీస్‌లో 54% వాటాను దాదాపు   రూ.2000 కోట్లకు కోఫోర్జ్‌ కొనుగోలు చేస్తుంది. దీనికోసం సిగ్నిటీ టెక్నాలజీస్‌ షేరుకు రూ.1415 చొప్పున చెల్లిస్తుంది. సిగ్నిటీ టెక్నాలజీస్‌ ప్రమోటర్లలో చక్కిలం వెంకట సుబ్రహ్మణ్యం, రాజేశ్వరి చక్కిలం, శ్రీకాంత్‌ చక్కిలం, పెన్నం సుధాకర్‌, పెన్నం స్వప్న తదితరులకు సంస్థలో 32.77% వాటా ఉండగా, 32.47% విక్రయించనున్నారు. సెబీ నిబంధనల ప్రకారం సిగ్నిటీ టెక్నాలజీస్‌ సాధారణ వాటాదార్ల నుంచి షేర్లు కొనుగోలు చేయడానికి కోఫోర్జ్‌ ‘ఓపెన్‌ ఆఫర్‌’ జారీ చేయాల్సి వస్తుంది.

2023-24లో రూ.95 కోట్ల లాభం

సిగ్నిటీ టెక్నాలజీస్‌ 2023-24లో రూ.814.47 కోట్ల టర్నోవర్‌పై రూ.94.79 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కంపెనీ చేతిలో రూ.350 కోట్లకు పైగా నగదు నిల్వ ఉన్నట్లు సమాచారం. ఈ కంపెనీలో 54% వాటా కొనుగోలు పూర్తయితే, దీనిపై అజమాయిషీ కోఫోర్జ్‌ చేతికి వెళ్తుంది. ఈ ప్రక్రియ 6 నెలల్లో పూర్తవుతుందని సమాచారం. గురువారం స్టాక్‌మార్కెట్‌ ట్రేడింగ్‌ సమయం ముగిశాక, కోఫోర్జ్‌ లిమిటెడ్‌, సిగ్నిటీ టెక్నాలజీస్‌ విడివిడిగా ఈ నిర్ణయాలను వెల్లడించాయి. అంతకంటే ముందు బీఎస్‌ఈలో సిగ్నిటీ టెక్నాలజీస్‌ షేరు రూ.1372 వద్ద, కోఫోర్జ్‌ షేరు రూ.4986 వద్ద ముగిశాయి.

రూ.2100 కోట్ల రుణ ప్రతిపాదన

సిగ్నిటీ టెక్నాలజీస్‌లో మెజార్టీ వాటా కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసిన కోఫోర్జ్‌ డైరెక్టర్ల బోర్డు, 250 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2,100 కోట్లు) అప్పు తీసుకోవడానికీ అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం కోఫోర్జ్‌ లిమిటెడ్‌కు సింగపూర్‌లోని అనుబంధ సంస్థ కోఫోర్జ్‌ పీటీఈ లిమిటెడ్‌, హెచ్‌ఎస్‌బీసీ- గిఫ్ట్‌ సిటీ బ్రాంచ్‌తో రుణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రుణ నిధులను సిగ్నిటీ టెక్నాలజీస్‌లో మెజార్టీ వాటా కొనుగోలు కోసం వెచ్చించనున్నట్లు కోఫోర్జ్‌ వెల్లడించింది.

ఇటీవల కాలంలో హైదరాబాద్‌ ఐటీ రంగంలో నమోదైన పెద్ద లావాదేవీగా సిగ్నిటీ టెక్నాలజీస్‌- కోఫోర్జ్‌ ఒప్పందం నిలవనుంది. సిగ్నిటీని సొంతం చేసుకోవడం ద్వారా ఐటీ టెస్టింగ్‌ సేవల్లో అత్యంత క్రియాశీలక సంస్థగా ఎదిగే అవకాశం కోఫోర్జ్‌కు లభిస్తుందని సంబంధిత వర్గాలు వివరించాయి.  

కోఫోర్జ్‌ లాభం రూ.224 కోట్లు

మార్చి త్రైమాసికంలో కోఫోర్జ్‌ నికర లాభం రూ.223.7 కోట్లుగా ఉంది. 2022-23 ఇదే కాల లాభం రూ.114.8 కోట్లతో పోలిస్తే, ఇది 94.86% అధికం. ఇదే సమయంలో ఆదాయం రూ.2170 కోట్ల నుంచి రూ.2358.5 కోట్లకు పెరిగింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికరలాభం రూ.808 కోట్లు, ఆదాయం రూ.9179 కోట్లుగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు