కేవైసీ అప్‌డేట్‌ చేశారా?

బ్యాంకులో ఖాతా ఉందా? మ్యూచువల్‌ ఫండ్‌లో మదుపు చేస్తున్నారా? జీవిత, ఆరోగ్య బీమా పాలసీలున్నాయా? మరి, మీ కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి.

Published : 15 Mar 2024 01:35 IST

బ్యాంకులో ఖాతా ఉందా? మ్యూచువల్‌ ఫండ్‌లో మదుపు చేస్తున్నారా? జీవిత, ఆరోగ్య బీమా పాలసీలున్నాయా? మరి, మీ కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి. ఇందులో సమయానుకూలంగా మార్పులు చేర్పులనూ తెలియజేయాల్సి ఉంటుంది. చాలామందికి ఇది ఇబ్బందిగా మారుతోంది. ఈ క్రమంలోనే కేవైసీ నిబంధనల్లో పూర్తిగా మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కేవైసీ సమస్యకు పరిష్కారం చూపించే ఉద్దేశంతో.. ఆర్థిక సేవల రంగంలో వినియోగదారుల వివరాలన్నీ లభ్యమయ్యే ఒకే కేవైసీ విధానాన్ని అమలు చేయాలని ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) ప్రతిపాదించింది. ఇప్పటికే బ్యాంకులు, ఇతర ఆర్థిక సేవల సంస్థలు కేవైసీ పత్రాలను మరోసారి సమర్పించాల్సిందిగా తమ ఖాతాదారులను కోరుతున్నాయి.

బ్యాంకులు తమ ఖాతాదారులకు కేవైసీ నిబంధనలను అప్‌డేట్‌ చేయాల్సిందిగా సందేశాలను పంపిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు దీనికి గడువు తేదీనీ ప్రకటించాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఈ నెల 19 లోపు కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాల్సిందిగా సమాచారాన్ని పంపిస్తోంది. గత ఏడాది డిసెంబరు 31 నాటికి కేవైసీ నిబంధనలు పాటించని వారికి ఇది       వర్తిస్తుందని పేర్కొంది.

 తనిఖీ చేయండి..

 ఖాతాదారులు తమ కేవైసీ పూర్తి వివరాలు బ్యాంకు వద్ద ఉన్నాయా లేదా అనేది బ్యాంకు వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో లాగిన్‌ అవడం ద్వారా తనిఖీ చేసుకోవడం మేలు. బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో ఈ వివరాలను తెలియజేయొచ్చు. దాదాపు అన్ని బ్యాంకులూ ఈ వెసులుబాటును అందిస్తున్నాయి. ఇ-మెయిల్‌లోనూ వివరాలు పంపించేందుకూ వీలుంది.

ఏయే పత్రాలు..

కేవైసీ/రీకేవైసీ నిబంధనలు పూర్తి చేసేందుకు ఖాతాదారులు గుర్తింపు, చిరునామా ధ్రువీకరణలు, ఆదాయం వివరాలు, ఫొటో, పాన్‌, ఆధార్‌, మొబైల్‌ నెంబరు, ఇతర పత్రాలను అందించాలి.

మ్యూచువల్‌ ఫండ్లలోనూ..

మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్‌, గ్యాస్‌ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంది. లేకపోతే మార్చి 31 నుంచి కొత్త పెట్టుబడులను అనుమతించకపోయే ఆస్కారం ఉంది. మదుపరులు కేఫిన్‌టెక్‌ లేదా క్యామ్స్‌లో కేవైసీ వివరాలు తాజాగా పేర్కొనాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్‌, ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ గుర్తింపు కార్డు తదితర పత్రాలను సమర్పించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని