గృహ రుణం తీసుకునేముందు గుర్తుంచుకోవాల్సిన ఐదు విషయాలు

మధ్య తరగతి వారు సొంత ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఉపకరించే ఒక మంచి మార్గం గృహ రుణం. ఈ విషయంలో జాగ్రత్త వహించకపోతే రుణం చెల్లించేటప్పుడు కొంత ఇబ్బంది ప‌డే అవ‌కాశం ఉంటుంది. మేలైన గృహ రుణాన్ని ఎంచుకునేందుకు రెండు,మూడు బ్యాంకులను సంప్రదించడం, ప్రాపర్టీ షోలలో పాల్గొని అవగాహన

Published : 23 Dec 2020 13:10 IST

మధ్య తరగతి వారు సొంత ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఉపకరించే ఒక మంచి మార్గం గృహ రుణం. ఈ విషయంలో జాగ్రత్త వహించకపోతే రుణం చెల్లించేటప్పుడు కొంత ఇబ్బంది ప‌డే అవ‌కాశం ఉంటుంది. మేలైన గృహ రుణాన్ని ఎంచుకునేందుకు రెండు,మూడు బ్యాంకులను సంప్రదించడం, ప్రాపర్టీ షోలలో పాల్గొని అవగాహన పెంచుకోవడం ద్వారా మార్కెట్లో ఉండే వడ్డీ రేట్లను పరిశీలించండి. పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రకటనలను చూసి అన్ని విషయాలు తెలుసుకోకుండా గృహ రుణం తీసుకుంటే తర్వాత బాధ పడాల్సి ఉంటుంది. కింది ఐదు విషయాలను జాగ్రత్తగా గమనిస్తే వీలైనంత వరకూ రుణ చెల్లింపు సమయంలో వచ్చే ఇబ్బందులను అధిగమించవచ్చు.

వడ్డీ రేట్లు :
గృహ రుణాల విషయంలో బ్యాంకులు రెండు రకాల వడ్డీ రేట్లు అమలు చేస్తున్నాయి. రుణ దరఖాస్తు సమయంలోనే స్థిర, చర వడ్డీ రేట్ల గురించి తెలుసుకుంటే మంచిది. ఒకవేళ చర వడ్డీ రేటే అమలు చేసేటట్లయితే, ఏ ప్రాతిపదికన ఎన్ని రోజులకోసారి వడ్డీ మారుతూ ఉంటుందో అవగాహన ఉండేలా చూసుకోవాలి. వార్షిక వడ్డీ రేటు(ఏపీఆర్‌) మొదట్లోనే నిర్ణయిస్తారు. దాని తర్వాత చర వడ్డీ రేట్ల మార్పు గురించిన సమాచారాన్ని మీకు ఏ విధంగా చేరవేస్తారో తెలుసుకోండి. ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలనే విషయానికి వస్తే, వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు చర, కనిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు స్థిర వడ్డీ రేటును ఎంచుకోవడం సూచనీయం.

వివిధ రుసుములు :
ప్రాసెసింగ్‌ రుసుము , నిర్వహణ రుసుము, ఆలస్య చెల్లింపు రుసుము, ముందస్తు చెల్లింపు రుసుము వంటి వాటి గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ఆర్థిక భారం ఎక్కువ అవుతోందని అనిపించి ఒక్కసారిగా రుణం తీర్చేయాలనుకుంటే అందుకుగాను ముందస్తు చెల్లింపు రుసుము రూపంలో భారీ మొత్తం చెల్లించాల్సి రావచ్చు. ఒక్కోసారి వడ్డీ రేటు తక్కువ అని చెప్పినా, అన్నీ రుసుములు కలిపి లెక్కిస్తే చెల్లించే మొత్తం చాలా ఎక్కువ అవుతుంది. రుణం తీసుకునే ముందే అన్నింటినీ బేరీజు వేసుకుని జాగ్రత్త వహించండి.

రుణ కాలపరిమితి :
రుణ కాలపరిమితి విషయంలో బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలవైపే మొగ్గు చూపుతాయి. 30 లక్షల రుణానికి 8% వడ్డీ చొప్పున 20 సంవత్సరాలకు వడ్డీ రూపంలోనే దాదాపు 30 లక్షల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ స్వల్పంగా వడ్డీ రేటు లేదా రుణ కాలపరిమితి పెరిగినా ఇంటి ధర కంటే మీరు చెల్లించే వడ్డీయే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సంపాదన సామర్థ్యం బాగా ఉన్నవారు స్వల్పకాలంలో ఈఎమ్‌ఐలు చెల్లించగలిగే గృహ రుణం తీసుకోవడం మంచిది.

డౌన్‌ పేమెంట్‌ :
ఇల్లు కొనుగోలు చేసినప్పుడు మొదటిసారి నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే డౌన్‌ పేమెంట్‌ అంటారు. సాధారణంగా మొత్తం రుణంలో 20 నుంచి 30 శాతం వరకూ డౌన్‌ పేమెంట్‌ చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ డౌన్‌పేమెంట్‌ అందించే విషయంలో వడ్డీ రేటు రూపంలో ఎక్కువ చెల్లించాల్సి వస్తుందా అనే విషయాన్ని గమనించాలి.

గృహ రుణం మార్చుకోవాలనుకుంటే :
ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు రుణాన్ని బదిలీ చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కేవైసీ పత్రాన్ని కొత్త బ్యాంకుకు అందించాలి. మీ ఆస్తికి సంబంధించిన పత్రాలు, మీ ఆదాయ, బ్యాంకు ఖాతా వివరాలను జత చేయాలి. పాత బ్యాంకు రుణ వాయిదాలకు సంబంధించిన సమాచారాన్ని కొత్త బ్యాంకుకు తెలియపరచాలి.

ప్రైవేటు రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకు రుణాలు వినియోగదారులకు సౌకర్యంగా ఉంటాయి. రుణ ఆమోద ప్రక్రియలో జాప్యం జరిగినా, చెల్లింపు విషయంలో పెద్దగా ప్రతిబంధకాలు ఎదురు కావు. ప్రైవేటు సంస్థలు కొన్ని రుసుముల గురించి స్పష్టంగా వెల్లడించకుండా మధ్యలో ఇబ్బంది పెడతాయి. బ్యాంకులు వడ్డీరేట్ల విషయయంలో కఠినంగా వ్యవహరిస్తాయి. ఆర్‌బీఐ రేట్లను పెంచినప్పుడు బ్యాంకులు వెంటనే వడ్డీ రేట్లను పెంచుతాయి. అదే రేట్లలో కోత విధించినప్పుడు మాత్రం ఆ ప్రయోజనాలను వెంటనే వినియోగదారులకు అందించవు. అందువల్ల చరవడ్డీ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని