Microsoft app store: గూగుల్‌, యాపిల్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్‌ స్టోర్‌

Microsoft app store: గూగుల్‌, యాపిల్ ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు మైక్రోసాఫ్ట్‌ కంపెనీ సిద్ధమవుతోంది. త్వరలో గేమ్స్‌ స్టోర్‌ను తీసుకురానుంది.

Published : 10 May 2024 16:19 IST

Microsoft app store | ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్‌ గేమ్స్‌ విషయంలో గూగుల్‌ ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌దే హవా. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఈ గేమ్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే ఈ రెండు స్టోర్లే దిక్కు. అతిపెద్ద గేమింగ్‌ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్‌.. మొబైల్‌ గేమింగ్‌ మార్కెట్‌లో మాత్రం వెనుకంజే. ఇప్పుడీ కంపెనీ సొంత మొబైల్‌ గేమింగ్‌ స్టోర్‌ను ప్రారంభించబోతోంది. ఎక్స్‌బాక్స్‌ మొబైల్‌ గేమింగ్‌ స్టోర్‌ ద్వారా గూగుల్‌, యాపిల్‌కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది.

బ్లూమ్‌బెర్గ్‌ టెక్నాలజీ సమ్మిట్‌లో మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎక్స్‌బాక్స్‌ ప్రెసిడెంట్‌ సారా బాండ్‌ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని పంచకున్నారు. మైక్రోసాఫ్ట్‌కే చెందిన క్యాండీ క్రష్, మైన్‌ క్రాఫ్ట్‌ వంటి గేమింగ్‌ యాప్స్‌తో తొలుత వెబ్‌ ఆధారిత గేమింగ్‌ స్టోర్‌ను లాంచ్‌ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది జులైలో ఈ యాప్‌ స్టోర్‌ అందుబాటులోకి రానుందని చెప్పారు. తరవాత ఇతర పబ్లిషర్లకు చెందిన గేమ్స్‌ను కూడా వేదిక పైకి తీసుకురానున్నట్లు  పేర్కొన్నారు. 

ఏ డివైజ్‌ అయినా, ఏ దేశానికి చెందినవారైనా సులువుగా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ స్టోర్‌ను తీసుకొస్తున్నామని బాండ్‌ చెప్పారు. ప్రస్తుతం గూగుల్‌, యాపిల్ కంపెనీలు యాప్‌ డెవలపర్ల నుంచి 30 శాతం వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. దీంతో గేమ్‌ డెవలపర్లు పెదవి విరుస్తున్నారు. దీన్ని తనకు అవకాశంగా మలుచుకోవాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. ఇందులోభాగంగానే యాప్‌ స్టోర్‌ను లాంచ్‌ చేయబోతోంది. గూగుల్‌, యాపిల్‌ను కాదని గేమర్లను ఆకట్టుకోవడానికి మైక్రోసాఫ్ట్‌ ఏవిధమైన వ్యూహాలను అనుసరిస్తుందో చూడాలి మరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని