Rent Now Pay Later: ‘రెంట్‌ నౌ పే లేటర్‌’.. చేతిలో డబ్బు లేకున్నా అద్దె చెల్లించేయొచ్చు!

Rent Now Pay Later: అద్దె చెల్లించడానికి కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో రెంట్‌ నౌ పే లేటర్‌ వంటి సేవలు ఉపయోగకరంగా ఉంటాయి.

Updated : 02 Mar 2023 12:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సకాలంలో అద్దె చెల్లించడానికి ఒక్కోసారి చేతిలో డబ్బుండదు. పోనీ క్రెడిట్‌ కార్డు ద్వారా ఇద్దామంటే అదీ ఉండదు. అద్దె కోసం కూడా అప్పు చేయాలంటే మనసొప్పదు. పోనీ అంత చిన్న మొత్తం చేబదులు తీసుకుందామంటే మొహమాటంగా ఉంటుంది. ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి ఇబ్బందులను చాలా మంది ఎదుర్కొంటుంటారు.

అటువంటి వారి సమస్యలకు పరిష్కారంగానే హౌసింగ్‌.కామ్‌ వినూత్న ఫైనాన్షియల్‌ ప్రొడక్ట్‌ను భారత విపణికి పరిచయం చేసింది. ‘బై నౌ పే లేటర్‌ (BNPL)’ తరహాలో ‘రెంట్‌ నౌ పే లేటర్‌ (RNPL)’ సేవల్ని ప్రారంభించింది. అందుకోసం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘నీరో’ అనే ఫిన్‌టెక్‌ స్టార్టప్‌తో చేతులు కలిపింది.

ఎలా పనిచేస్తుంది?

సమయానికి డబ్బుల్లేని కస్టమర్లు ఆర్ఎన్‌పీఎల్‌ (RNPL) ద్వారా అద్దె చెల్లించేయొచ్చు. అందుకు ఎటువంటి కన్వీనియెన్స్‌ ఫీజు  విధించడంలేదు. పైగా నలభై రోజుల వరకు ఈ మొత్తంపై ఎలాంటి వడ్డీ కూడా ఉండదు. అవసరమైతే ఆ మొత్తాన్ని నెలవారీ వాయిదాలు (EMIs)గా కూడా మార్చుకోవచ్చు. క్రెడిట్‌ కార్డు సదుపాయం లేని లక్షలాది మంది కస్టమర్లకు ఆర్‌ఎన్‌పీఎల్‌ ఉపయోగకరంగా ఉంటుందని హౌసింగ్‌.కామ్‌ సీఈఓ ధ్రువ్‌ అగర్వాల్‌ తెలిపారు. అధికారికంగా ఈ సేవల్ని ప్రారంభించడానికి ముందే ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షించినట్లు అగర్వాల్‌ తెలిపారు. దాదాపు లక్ష మంది యూజర్లు దీన్ని ఉపయోగించుకొని సంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ఫోన్‌ పే, పేటీఎం వంటి ఆర్థిక సేవల సంస్థలు రెంట్‌ పే ఆప్షన్‌ను అందిస్తున్నాయి. క్రెడిట్‌ కార్డును ఉపయోగించి వీటి ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఇందుకు గానూ కొంత ఛార్జీలను అవి వసూలు చేస్తున్నాయి. బ్యాంకులు సైతం 1 శాతం వరకు ఛార్జీలు వేస్తున్నాయి. అయితే, హౌసింగ్‌.కామ్‌ అందిస్తున్న RNPL సదుపాయం ఉపయోగించుకోవడానికి ఎలాంటి క్రెడిట్‌ కార్డూ అవసరం ఉండదు. 40 రోజుల వరకు ఎలాంటి ఛార్జీలూ ఉండవు. ఓ రకంగా ఇదో స్వల్పకాలిక రుణ సదుపాయం లాంటిదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని