Aadhaar Card: ఆధార్‌ కార్డ్‌లో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఏమేం కావాలి?

Aadhaar Card: ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీలో తప్పుందా? మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఎలా అప్‌డేట్‌ చేసుకోవాలో చూడండి..

Published : 15 Apr 2024 10:38 IST

Aadhaar Card | ఇంటర్నెట్‌డెస్క్‌: నిత్యం వినియోగించే డాక్యుమెంట్లలో ఆధార్‌ కార్డ్‌ (Aadhaar Card) ఒకటి. బ్యాంకుల్లో ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్‌ కార్డు తీసుకోవాలన్నా, రుణం పొందాలన్నా ఈ కార్డ్‌ ఉండాల్సిందే. ముఖ్యంగా అధికారిక గుర్తింపుకార్డుగా దీనికి ఉన్న ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. తరచూ వినియోగించే ఆధార్‌కార్డ్‌లో ఏవైనా తప్పులుంటే భవిష్యత్‌లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు కోల్పోయే అవకాశమూ ఉంది.  అందుకే ఇందులో వివరాలు తప్పుల్లేకుండా చూసుకోవడం ముఖ్యం. అందులో ముఖ్యమైనది పుట్టిన తేదీ. ఆధార్‌ కార్డ్‌లో పేరు, చిరునామా, ఫొటోతో పాటు పుట్టిన తేదీని మార్చుకోవడానికీ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అనుమతిస్తోంది. పుట్టిన తేదీని ఒకసారి మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. పాన్‌కార్డ్‌, జనన ధ్రువపత్రం, పాస్‌పోర్ట్‌, బ్యాంక్‌ పాస్‌బుక్‌ లేదా మార్క్‌షీట్‌ వీటిలో ఏదైనా పత్రాన్ని సమర్పించి పుట్టిన తేదీని మార్చుకోవచ్చు.

ఆధార్‌కార్డ్‌పై పేరు, పుట్టిన తేదీ, చిరునామా ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?

ఎలా అంటే..?

  • మీ సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌ సెంటర్‌కు వెళ్లి ఆధార్‌ అప్‌డేట్‌/కరెక్షన్‌ ఫారమ్‌లో వివరాలు సమర్పించాలి.
  • అందులో మీరు అప్‌డేట్‌ చేయాలనుకుంటున్న పుట్టిన తేదీ వివరాలు, దానికి సంబంధించిన ప్రూఫ్‌ను అందించాలి.
  • బయోమెట్రిక్‌ వివరాలు అందించి, పుట్టిన తేదీని మార్చడానికి రూ.50 రుసుము చెల్లించాలి.
  • మీ డాక్యుమెంట్లను ధ్రువీకరించుకున్నాక కొన్ని రోజుల్లోనే మీ పుట్టిన తేదీ అప్‌డేట్‌ అవుతుంది.
  • ఆధార్‌ కార్డ్‌లో మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఆధార్‌ కేంద్రం వాళ్లు ఒక స్లిప్‌ ఇస్తారు. దాని సాయంతో ఆధార్‌ అప్‌డేట్‌ను ట్రాక్‌ చేయొచ్చు.
  • అప్‌డేట్‌ అయిందని తెలుసుకున్నాక ఉడాయ్‌ వెబ్‌సైట్‌ నుంచి మీరే స్వయంగా ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
  • ఆధార్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఉడాయ్ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1947ను సంప్రదించొచ్చు. లేదా help@uidai.gov.in ఈ ఐడీకి ఈమెయిల్‌ చేయొచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని