UPI fraud: యూపీఐ, బ్యాంకింగ్‌ మోసాలు.. పోయిన డబ్బు తిరిగి పొందొచ్చా?

UPI fraud: ఆన్‌లైన్‌ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్కామ్‌ల వల్ల డబ్బు పోగొట్టుకుంటే వెంటనే తీసుకోవాల్సిన చర్యలేంటో చూద్దాం!

Updated : 07 Dec 2023 15:04 IST

UPI fraud | ఇంటర్నెట్‌ డెస్క్‌: యూపీఐ, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సహా ఇతర రకాల డిజిటల్‌ లావాదేవీలు మన రోజువారీ జీవితాల్లో భాగమైపోయాయి. అయితే, వీటిలో ఉన్న సౌలభ్యం.. వివిధ రకాల మోసాల (Online Fraud) బారిన పడే ముప్పును పెంచుతోంది. యూపీఐ (UPI), బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌లో నగదు బదిలీ.. ఇలా వివిధ మార్గాల్లో మోసాలు జరుగుతున్నాయి. ప్రజలను ఉచ్చులోకి లాగడానికి మోసగాళ్లు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి? వాటి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఒకవేళ డబ్బు పోగొట్టుకుంటే తిరిగి రాబట్టుకోవడం ఎలా? అనే విషయాలు తెలిసి ఉండాలి.

ఆన్‌లైన్‌ మోసాల బారినపడి సొమ్ము పోగొట్టుకున్నప్పుడు తీసుకోవాల్సిన కొన్ని చర్యలను పరిశీలిద్దాం..

యూపీఐ మోసాలు..

యూపీఐ రాకతో భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ భారీగా విస్తరించింది. సులభంగా, వేగంగా నగదు బదిలీ చేయగలగడం దీంట్లోని సౌలభ్యం. అయితే మోసాలకు యూపీఐ లావాదేవీలు (UPI Transactions) కూడా అతీతమేమీ కాదు. ఒక వేళ మోసపోతే.. తక్షణమే ఈ కింది చర్యలు తీసుకోవాలి.

యూపీఐ సర్వీస్‌ ప్రొవైడర్‌కు ఫిర్యాదు..

  • ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. యూపీఐ మోసం జరిగినట్టు గుర్తించిన వెంటనే చేయాల్సిన మొదటి పని సర్వీస్‌ ప్రొవైడర్‌లకు (ఉదా..జీపే, ఫోన్‌పే, పేటీఎం) సమాచారం అందించడం.
  • లావాదేవీ వివరాలను అందించి సొమ్ము వాపస్‌ వచ్చేలా చేయమని ఆయా సర్వీస్‌ ప్రొవైడర్లను ‘ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ’ ద్వారా అభ్యర్థించాలి.

ఎన్‌పీసీఐ ఫిర్యాదు పోర్టల్‌..

  • ఒకవేళ యూపీఐ ప్రొవైడర్‌ నుంచి స్పందన లేకపోతే, ‘నేషనల్‌ పేమెంట్స్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI)’ పోర్టల్‌ https://www.npci.org.in/లోకి వెళ్లి ‘‘గెట్‌ ఇన్‌ టచ్‌’’ విభాగంలో ‘యూపీఐ కంప్లయింట్‌’లో ఫిర్యాదు సమర్పించొచ్చు.
  • ప్రత్యామ్నాయంగా పేమెంట్ సర్వీస్‌ ప్రొవైడర్‌ (బ్యాంక్‌)లో కూడా ఫిర్యాదు ఇవ్వొచ్చు.

బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌, డిజిటల్‌ ఫిర్యాదులు..

  • 30 రోజులు దాటినా సమస్యకు పరిష్కారం లభించకపోతే బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. లేదా డిజిటల్‌ కంప్లయింట్స్‌ అంబుడ్స్‌మన్‌ను కూడా ఆశ్రయించొచ్చు.
  • ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. అంబుడ్స్‌మన్‌కు అధికారికంగా ఒక ఫిర్యాదు లేఖను సమర్పించాలి.
  • cms.rbi.org.in పోర్టల్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు. లేదా లావాదేవీకి సంబంధించిన వివరాలతో crpc@rbi.org.in ఐడీకి మెయిల్‌ చేయొచ్చు.

బ్యాంకింగ్‌ మోసాలు..

సైబర్‌ నేరగాళ్లు మన బ్యాంకింగ్‌ వివరాలను తస్కరించి మోసపూరిత లావాదేవీల ద్వారా డబ్బును కాజేస్తుంటారు. ఫిషింగ్‌ లింక్స్‌, హ్యాకింగ్‌ వంటి మార్గాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారు. ఒకవేళ ఈ తరహా బ్యాంకింగ్‌ మోసాల బారిన పడితే.. ఈ చర్యలు తీసుకోవచ్చు.

బ్యాంకుకు సమాచారం..

  • మోసం జరిగినట్టు గుర్తించిన వెంటనే లావాదేవీకి సంబంధించిన వివరాలతో బ్యాంకుకు సమాచారం అందజేయాలి. వీలైనంత వేగంగా ఫిర్యాదు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే రూ.25,000లోపు వరకు పరిహారంగా ఇప్పించేందుకు బ్యాంకులు కృషి చేస్తాయని నిపుణులు తెలిపారు. 
  • మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే బ్యాంకులు ఆ సమాచారాన్ని బీమా సంస్థలకు తెలియజేస్తాయి. తద్వారా పరిహారం అందించేందుకు కృషి చేస్తాయి. అయితే, ఖాతాదారుల ప్రమేయం ఏమాత్రం లేకుండా మోసం జరిగినట్టు తేలి.. దర్యాప్తులో పూర్తి వివరాలు లభ్యమైతేనే పరిహారం అందే అవకాశం ఉంది. అన్ని సందర్భాల్లో రిఫండ్‌ సాధ్యం కాదని నిపుణులు వివరించారు.

సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌..

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, లాటరీ వంటి మార్గాల్లోనూ మోసాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటిలోనూ మోసగాళ్లు బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకొని స్కామ్‌లకు పాల్పడుతుంటారు. ఇలాంటి సందర్భంలోనూ వెంటనే బ్యాంకులను సంప్రదించి ఫిర్యాదు అందజేయాలి. ఒకవేళ సమస్య క్లిష్టమైనదైతే.. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాకపోతే సైబర్‌క్రైమ్‌ పోర్టల్‌ https://cybercrime.gov.in/లోనూ ఫిర్యాదు సమర్పించొచ్చు. హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కి కూడా కాల్‌ చేయొచ్చు.

ఇలా రక్షించుకోవచ్చు..

ఇలాంటి ఆన్‌లైన్‌ మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. అసలు ఎలాంటి స్కామ్‌లు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. వాటిని గుర్తించడంపై అవగాహన పెంచుకోవాలి. ఆన్‌లైన్‌ ఖాతాలు, బ్యాంక్‌ వివరాలు సహా ఇతరత్రా వ్యక్తిగత సమాచారం లీక్‌ కాకుండా చూసుకోవాలి. 

  • అపరిచితులకు ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దు.
  • ఇ-మెయిళ్లు, టెక్ట్స్‌ మెసేజ్‌లలో వచ్చే లింక్‌లపై క్లిక్‌ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
  • ఆన్‌లైన్‌ ఖాతాలకు కఠినమైన పాస్‌వర్డ్‌లను సెట్‌ చేసుకోవాలి.
  • టూ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని