Global Innovation Index: ఇన్నోవేషన్‌లో భారత్‌కు 40వ స్థానం

Global Innovation Index: అంకుర సంస్థలకు అనువైన వాతావరణం, అపారమైన విజ్ఞాన సంపద అందుబాటులో ఉండటం, ప్రభుత్వ ప్రైవేట్‌ సంస్థల పరిశోధనలు మెరుగైన ర్యాకింగ్‌కు దోహదపడినట్లు నీతి ఆయోగ్‌ తెలిపింది.

Published : 28 Sep 2023 17:19 IST

దిల్లీ: ‘గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌- 2023 (Global Innovation Index 2023)’ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 40వ స్థానంలో నిలిచింది. ‘ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (WIPO)’ గురువారం ఈ జాబితాను విడుదల చేసింది. స్విట్జర్లాండ్‌, స్వీడన్‌, అమెరికా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్‌ గత ఏడాది కూడా 40వ స్థానంలోనే ఉండడం గమనార్హం. 2013లో 66వ స్థానంలో ఉన్న భారత్‌.. పదేళ్లలో 26 స్థానాలు ఎగబాకడం విశేషం. 

రాజకీయ వాతావరణం, విద్య, మౌలిక సదుపాయాలు, పరిశోధన, మానవ మూలధనం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏటా ఈ ర్యాంకులు కేటాయిస్తారు. భారత్‌ తాజా (Global Innovation Index 2023) ర్యాంకింగ్‌పై నీతి ఆయోగ్‌ స్పందిస్తూ.. అంకుర సంస్థలకు అనువైన వాతావరణం, అపారమైన విజ్ఞాన సంపద అందుబాటులో ఉండటం, ప్రభుత్వ ప్రైవేట్‌ సంస్థల పరిశోధనలు మెరుగైన ర్యాకింగ్‌కు దోహదపడినట్లు పేర్కొంది. విద్యుత్‌ వాహనాలు, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, అంతరిక్షం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు మొదలైన వివిధ రంగాల్లో ఆవిష్కరణల కోసం చేస్తున్న ప్రయత్నాలను నీతి ఆయోగ్ శ్రద్ధగా సమన్వయపరుస్తోందని తెలిపింది.

మధ్యాదాయ దేశాల్లో టాప్‌-40లో భారత్‌ సహా చైనా (12), మలేషియా(36), బల్గేరియా(38), తుర్కియే(39) మాత్రమే ఉన్నాయని డబ్ల్యూఐపీఓ తెలిపింది. దిగువ మధ్యాదాయ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉన్నట్లు తెలిపింది. తర్వాత వియత్నాం, ఉక్రెయిన్‌ నిలిచినట్లు వెల్లడించింది. అలాగే వరుసగా 13వ ఏడాది ‘ఇన్నోవేషన్‌ ఓవర్‌పర్ఫార్మర్లు’గా భారత్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ మాల్దోవా, వియత్నాం నిలిచినట్లు తెలిపింది. ప్రపంచంలోని యూనికార్న్‌ (ఒక బిలియన్ డాలర్‌ విలువ కలిగిన అంకుర సంస్థలు) సంస్థల్లో దాదాపు 80 శాతం ఐదు దేశాల్లోనే ఉన్నట్లు తెలిపింది. ఈ జాబితాలో అమెరికా (54%), చైనా (14%), భారత్‌ (6%), యూకే (4%), జర్మనీ (2%) ఉన్నాయని వెల్లడించింది. ప్రపంచంలోని మొత్తం యూనికార్న్‌ల విలువ 3.8 మిలియన్ డాలర్లు కాగా.. ఒక్క అమెరికాలోని వాటి విలువే రెండు ట్రిలియన్‌ డాలర్లని పేర్కొంది. తర్వాత చైనాలో 736 బిలియన్‌ డాలర్లు, భారత్‌లో 193 బిలియన్‌ డాలర్లు విలువ చేసే యూనికార్న్‌ కంపెనీలు ఉన్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని