Narayana Murthy: నాపై డీప్‌ఫేక్‌ వీడియోలు.. ఆ ప్రకటనలు నమ్మొద్దు: ఇన్ఫీ నారాయణమూర్తి

Narayana Murthy: సోషల్‌ మీడియాతో తన డీప్‌ఫేక్‌ వీడియోలు వైరల్‌ అవుతున్నాయని, వాటిని నమ్మొద్దని ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి సూచించారు.

Published : 14 Dec 2023 17:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘డీప్‌ఫేక్‌ (Deepfake)’ కట్టడికి ఓ వైపు కేంద్రం చర్యలు తీసుకుంటున్నా.. నిత్యం ఇలాంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) కూడా దీని బారినపడ్డారు. ట్రేడింగ్‌ యాప్‌లకు ఆయన ప్రచారం చేస్తున్నట్లు డీప్‌ఫేక్‌ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడిస్తూ.. ఆ నకిలీ ప్రకటనలను నమ్మొద్దని హెచ్చరించారు.

‘‘ఆటోమేటెడ్‌ ట్రేడింగ్‌ యాప్‌ల్లో నేను పెట్టుబడులు పెట్టానని, వాటికి ప్రచారం చేస్తున్నానని పేర్కొంటూ గత కొన్ని నెలలుగా సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలు ప్రచారం అవుతున్నాయి. బీటీసీ ఏఐ ఎవెక్స్‌, బ్రిటిష్‌ బిట్‌కాయిన్‌ ప్రాఫిట్‌, బిట్‌ లైట్‌, క్యాపిటాలిక్స్‌ వెంచర్స్‌ వంటి వాటికి నేను ప్రచారం చేస్తున్నానని వాటిల్లో పేర్కొన్నారు. కొన్ని వెబ్‌సైట్లలో అయితే డీప్‌ఫేక్‌ ఫొటోలు, వీడియోలతో నకిలీ ఇంటర్వ్యూలు కూడా ప్రసారం చేశారు. వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అలాంటి యాప్‌లు, వెబ్‌సైట్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వాటిని నేను ప్రచారం చేయట్లేదు. అలాంటి మోసపూరిత కథనాలను నమ్మొద్దు. ఇలాంటి అసత్య వార్తలు కన్పించినప్పుడు సంబంధిత రెగ్యులేటరీ అధికారులకు రిపోర్ట్‌ చేయండి’’ అని నారాయణమూర్తి (Narayana Murthy) సామాజిక మాధ్యమాల్లో కోరారు.

యూపీఐతో క్రెడిట్‌ కార్డు జత చేస్తున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే..!

ఇటీవల పలువురు సినీ తారలతో పాటు సచిన్‌ కుమార్తె సారా తెందూల్కర్‌ డీప్‌ఫేక్‌ వీడియోలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు, ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటాకు సంబంధించి ఓ ఫేక్‌ వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. పెట్టుబడికి సంబంధించి రతన్‌ టాటా మాట్లాడినట్లు వీడియో రూపొందించి కొందరు ఇన్‌స్టాలో పోస్టు చేశారు. అయితే, ఆ వీడియో అవాస్తవమంటూ రతన్‌ టాటా తన ఇన్‌స్టా ఖాతాలో స్పష్టం చేశారు.

డీప్‌ఫేక్‌పై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో  కేంద్రం దీనిపై చర్యలు చేపట్టింది. తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌లను నియంత్రించేందుకు ఇటీవల సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఈ నకిలీ వీడియోల వ్యాప్తిని నిలువరించేందుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని