IRCTC Package: హైదరాబాద్‌ To తిరుపతి విమాన ప్రయాణం.. ఆపై శ్రీనివాసుని దర్శనం

IRCTC tour package: తిరుపతి వెంకటేశ్వరుని దర్శనం కోసం చాలా మంది ఎదురుచూస్తుంటారు. అలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఆ వివరాలివీ..

Updated : 21 Jul 2023 11:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కలియుగ వైకుంఠం తిరుమలలో వెలసిన శ్రీనివాసుడిని దర్శించుకోవాలని చాలా మందికి ఉంటుంది. దక్షిణ భారతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని పరితపిస్తుంటారు. అయితే, తిరుమల ప్రయాణమంటే మాటలా? అటు దర్శనంతో పాటు ఇటు ప్రయాణ టికెట్లూ ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాలంటే పక్కాగా ప్లాన్‌ చేసుకోవాలి. అలాంటి వారి కోసం కేవలం రెండ్రోజుల్లోనే శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యేలా ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. దర్శన టికెట్ల కోసం చింతించకుండా ఎంచక్కా వెంకటేశ్వరున్ని దర్శించుకోవచ్చు. రానూపోనూ విమాన ప్రయాణమే కాబట్టి కేవలం రెండు రోజుల్లోనే తిరుపతి వెళ్లి తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చు. తిరుమలతో పాటు చుట్టు పక్కల పుణ్యక్షేత్రాలనూ దర్శించుకోవచ్చు. ఒకవేళ మీరూ తిరుపతి ప్రయాణానికి సిద్ధమవుతుంటే ఈ ప్యాకేజీపై లుక్కేయండి..

‘తిరుపతి బాలాజీ దర్శనం’ (TIRUPATI BALAJI DARSHNAM) పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఆగస్టు 1 నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. కేవలం రెండు రోజుల్లోనే తిరుమల శ్రీనివాసుని దర్శించుకొని తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చు. తిరుపతితో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు ఆలయాలను కూడా సందర్శించవచ్చు. ఆగస్టు నెలలో 1, 3, 8, 10, 17, 22; సెప్టెంబర్‌ 12, 26 తేదీల్లో, అక్టోబర్‌ 3, 5, 10, 12, 31 తేదీల్లో ఈ యాత్ర ఉంటుంది. ఇప్పటికే ఆగస్టు 1, 10 తేదీల ప్రయాణానికి టికెట్లు యాత్రికులు పూర్తిగా కొనుగోలు చేశారు. మిగిలిన తేదీల్లో మీ ప్రయాణ సమయానికి అనుగుణంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

ప్రయాణం ఇలా..

  • హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు విమానం (6E-2005) బయల్దేరుతుంది. మధ్యాహ్నం 2:05 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి బస్సు మార్గంలో కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు ఆలయాలను దర్శించుకుంటారు. సాయంత్రానికి ముందుగా ఏర్పాటు చేసిన హోటల్‌కు చేరుకుంటారు. అక్కడే రాత్రి భోజనం ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత కొండపైకి చేరుకుంటారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత భోజనం ముగించుకొని శ్రీకాళహస్తికి పయనమవుతారు. అక్కడ ఆలయాన్ని దర్శించుకుని తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. హైదరాబాద్‌ చేరుకోవటానికి విమానం (6E-267) ఎక్కటంతో మీ యాత్ర పూర్తవుతుంది.

ప్యాకేజీ వివరాలు (టికెట్‌ ధర ఒక్కొక్కరికి)

  • సింగిల్‌ షేరింగ్ రూ.16,330
  • ట్విన్‌ షేరింగ్‌ రూ.14,645
  • ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ రూ.14,550
  • 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు ఒకరికి విత్‌ బెడ్‌ అయితే రూ.13,740; విత్‌ అవుట్‌ బెడ్‌ అయితే రూ.13,490 చెల్లించాలి.
  • 2-4 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.13,490 చెల్లించాలి.
  • రెండేళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులకు రూ.1,500 వరకు ఎయిర్‌పోర్టులో చెల్లించాల్సి ఉంటుంది.

ప్యాకేజీలో ఉండేవి..

  • హైదరాబాద్‌- తిరుపతి- హైదరాబాద్‌ విమాన టికెట్లు
  • తిరుపతిలో ఒక రాత్రి బస కోసం ఏసీ హోటల్‌ గది
  • మొదటి రోజు రాత్రి భోజనం, రెండో రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం
  • ఒక చోటు నుంచి మరో చోటుకు ఏసీ బస్సులో ప్రయాణం
  • తిరుమల శ్రీవారి దర్శన టికెట్లతో పాటు తిరుచానూరు, శ్రీకాళహస్తి కాణిపాకం, శ్రీనివాస మంగాపురం దర్శనం ప్యాకేజీలో అంతర్భాగంగా ఉంటాయి.
  • యాత్రికులకు గైడ్‌ సదుపాయం, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది.

ఇవి గమనించాలి..

  • విమాన ప్రయాణానికి ప్రయాణికులు 2 గంటలు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలి.
  • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే భక్తులే చెల్లించాలి.
  • విమాన టికెట్‌ ధర పెరిగితే ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. 
  • 12 ఏళ్లలోపు చిన్నారులకు లడ్డూ ప్రసాదం ఉండదు.
  • తిరుమల్లో శ్రీవారిని దర్శించుకోవాలంటే స్త్రీ, పురుషులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది.
  • ఏదైనా కారణం చేత 21 రోజుల ముందు టికెట్ క్యాన్సిల్‌ చేసుకుంటే ఒక్కో టికెట్‌కు 30 శాతం మీ టికెట్‌ ధర నుంచి మినహాయిస్తారు. అదే 21-15 రోజుల ముందు క్యాన్సిల్‌ చేసుకుంటే 55 శాతం, 14-08 రోజుల ముందు క్యాన్సిల్‌ చేసుకుంటే 80 శాతం మీ టికెట్‌ ధర నుంచి మినహాయిస్తారు. అలాగే ప్రయాణానికి ఏడు రోజుల ముందు క్యాన్సిల్‌ చేస్తే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు.
  • ప్యాకేజీకి సంబంధించిన ఇతర వివరాలు, బుకింగ్‌ కోసం IRCTC Tourism వెబ్‌సైట్‌ను సందర్శించండి..
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు