క్రెడిట్ కార్డు ప్రయోజనాల్లో యాక్సిస్‌ కోత.. ‘అమృత్‌ కలశ్‌’కు లాస్ట్‌ ఛాన్స్‌.. ఆగస్టులో రానున్న మార్పులివే

Financial Updates in August 2023: యాక్సిస్‌ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో కొత్తగా తీసుకొచ్చిన మార్పులు, అమృత్‌ కలశ్‌ గడువు పెంపుతో పాటు ఆగస్టులో వచ్చే ఆప్‌డేట్లపై ఓ లుక్కేయండి.

Updated : 28 Jul 2023 12:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గత ఆర్థిక సంవత్సరానికి (2022-23) గానూ ఐటీ రిటర్ను దాఖలు చేయాల్సిన గడువు జులై 31తో ముగియనుంది. ఆగస్టు 1 నుంచి రిటర్నులు ఫైలింగ్‌ చేసే వారిపై పెనాల్టీలు పడనున్నాయి. ఆదాయ పన్ను చట్టం 1961, సెక్షన్‌ 234F ప్రకారం.. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వచ్చే వారికి గరిష్ఠంగా రూ.1,000,  రూ.5 లక్షలు దాటిన వారికి గరిష్ఠంగా రూ.5,000 వరకు జరిమానా పడనుంది. అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల్లో ప్రయోజనాలు, అమృత్‌ కలశ్‌ గడువు వంటివి ఆగస్టు నెలలో మారనున్నాయి. అవేంటో చూసేయండి..

యాక్సిస్‌ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌

కో బ్రాండెండ్ క్రెడిట్ కార్డుల్లో ఎక్కువ ప్రయోజనాలు అందించే ఫ్లిప్‌కార్ట్‌ క్రెడిట్ కార్డు (Axis Bank Flipkart Credit Card) ప్రయోజనాల్లో పెద్ద ఎత్తున కోత విధించింది. మింత్రా కొనుగోళ్లపై 5 శాతం ఇస్తున్న క్యాష్‌ బ్యాక్‌ను 1.5 శాతానికి తగ్గించింది. అంతే కాకుండా ఫ్యూయల్‌ కొనుగోళ్లు, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రాలో కొనుగోలు చేసే గిఫ్ట్‌ కార్డులు, ఈఎంఐ లావాదేవీలు, రెంటల్‌ పేమెంట్స్‌, ఆభరణాల కొనుగోళ్లలో ఇకపై ఎలాంటి క్యాష్‌ బ్యాక్‌ లభించదు. కొన్ని ఇతర కార్డుల ప్రయోజనాల్లోనూ యాక్సిస్‌ బ్యాంక్‌ కోత పెట్టింది.

యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ వాడుతున్నారా? ఈ ప్రయోజనాల్లో కోత!

అమృత్‌ కలశ్‌..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) అమృత్‌ కలశ్‌ (Amrit Kalash) ఫిక్స్ డిపాజిట్‌ పథకం గడువు ఆగస్టులోనే ముగియనుంది. జూన్‌ 30తో గడువు ముగియాల్సి ఉండగా.. ఆగస్టు 15 వరకు పొడిగించారు. 400 రోజుల కాలవ్యవధితో ఉన్న ఈ పథకం కింద సీనియర్‌ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది.

బ్యాంక్‌ సెలవు రోజులు ఎన్నంటే..?

వరుస సెలవుల కారణంగా ఆగస్టు నెలలో బ్యాంకులు దాదాపు సగం రోజులు పనిచేయవంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం ఆగస్టులో శని, ఆదివారాలతో కలిపి దాదాపు 14 రోజుల పాటూ బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకూ వర్తించవు. ఓనం, తిరువోణం, రక్షాబంధన్‌ పండగల సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. రెండో, నాలుగో శనివారాలు, నాలుగు ఆదివారాలతో పాటు ఆగస్టు 15 (మంగళవారం) బ్యాంకులు పనిచేయవు. అంటే నెల మొత్తంలో 7 రోజులు మాత్రమే బ్యాంకులు అందుబాటులో ఉండవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని