Paytm పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఈ సేవలకు.. మరికొన్ని రోజులే గడువు

Paytm payments bank: ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో కొన్ని సేవలకు గడువు మార్చి 15తో ముగియనుంది. ఆ తర్వాత వాటిని కొనసాగించలేరు.

Published : 12 Mar 2024 15:33 IST

Paytm payments bank | ఇంటర్నెట్‌ డెస్క్‌: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై (Paytm payments bank) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) విధించిన ఆంక్షలు మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో కొన్నిరకాల సేవలు నిలిచిపోనున్నాయి. ఈ గడువును పొడిగించే ఉద్దేశమేదీ లేదని ఇప్పటికే ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. ఒకవేళ మీరు ఇప్పటికీ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ సేవలను వినియోగిస్తుంటే.. గడువు ముగియనున్న వేళ త్వరపడాల్సిందే. ఇంతకీ ఏయే సేవలు నిలిచిపోనున్నాయ్‌? ఏవి కొనసాగుతాయ్‌?

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరోసారి గడువు పొడిగింపు

ప్రభావితమయ్యే సేవలు ఇవే..

  • మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు ఖాతాలో గానీ, వాలెట్‌లో గానీ నగదును జమ/లోడ్‌ చేయలేరు. క్యాష్‌బ్యాక్‌లు, రిఫండ్లు కాకుండా ఇతరుల నుంచి నగదును కూడా అందుకోలేరు.
  • ఒకవేళ ఎవరైనా శాలరీ కోసం పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతా ఇచ్చి ఉంటే.. మార్చి 15 తర్వాత జమ చేయడం వీలుపడదు. కాబట్టి గడువులోగా మీ యజమానికి కొత్త బ్యాంక్‌ ఖాతా ఇవ్వడం మంచిది.
  • ఎల్పీజీ సబ్సిడీ లేదా ఇతర ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలకు (DBT) పేటీఎం పేమెంట్స్‌ ఖాతాను ఇచ్చి ఉంటే వెంటనే మార్చుకోండి. మార్చి 15 తర్వాత రాయితీలు, నగదు బదిలీలు అందుకోవడం వీలు పడదు.
  • పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఒకవేళ ఏదైనా నగదు ఉంటే మార్చి 15 తర్వాత కూడా విత్‌ డ్రా లేదా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. డెబిట్‌ కార్డును కూడా వినియోగించుకోవచ్చు.
  • రిఫండ్లు, క్యాష్‌బ్యాక్‌లు, పార్టనర్‌ బ్యాంకుల నుంచి స్వీప్‌-ఇన్‌ సేవలు, వడ్డీ మొత్తాలు మార్చి 15 తర్వాత కూడా అనుమతిస్తారు.
  • మీ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతా ఆటో డెబిట్‌కు లింక్‌ అయ్యి ఉంటే అందులో ఉన్న బ్యాలెన్స్‌ పూర్తయ్యేవరకు వినియోగించుకోవచ్చు. మార్చి 15 తర్వాత కొత్తగా డిపాజట్లు మాత్రం అనుమతించరు. కాబట్టి ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే.
  • ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌కూ ఇదే నియమం వర్తిస్తుంది. బ్యాలెన్స్‌ ఉన్నంతవరకు మాత్రమే ఆటో డెబిట్‌కు అనుమతిస్తారు. మార్చి 15 తర్వాత కొత్తగా లోడ్‌ చేయడం కుదరదు కాబట్టి ఆటో డెబిట్‌లు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
  • పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ వాలెట్‌లో ఒకవేళ నగదు ఉంటే దాన్ని వినియోగించుకోవచ్చు. కావాలనుకుంటే విత్‌డ్రా లేదా వేరే బ్యాంక్‌ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. 
  • పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు జారీ చేసిన ఫాస్టాగ్‌లను కూడా బ్యాలెన్స్‌ ఉన్నంతవరకు వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత ఫాస్టాగ్‌ చెల్లుబాటు కాదు. కాబట్టి కొత్త ఫాస్టాగ్‌ తీసుకోవడం ఉత్తమం. ఒకవేళ ఫాస్టాగ్‌ను మూసివేయాలని భావిస్తే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ను అభ్యర్థించొచ్చు. రిఫండ్‌ కోరవచ్చు.
  • ఒకవేళ పేటీఎం యూపీఐ ఐడీ (@paytm) వాడుతుంటే ప్రత్యామ్నాయ బ్యాంకు ఖాతాకు లింక్‌ చేసుకోవడం ఉత్తమం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని