Digilocker: డిజీ లాకర్‌తో ఆధార్‌, పాన్‌ వంటి పత్రాలు ఎప్పుడూ మీ వెంటే.. ఎలా దాచుకోవాలి?

DigiLocker: ప్రభుత్వం జారీ చేసిన ఆధార్‌ కార్డ్‌, పాన్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇలా అన్నీ ఒకేచోట డిజిటల్‌గా అందుబాటులో ఉంచేందుకు డిజీలాకర్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతకీ ఇదెలా ఉపయోగపడుతుందో తెలుసా?

Updated : 09 Apr 2024 13:34 IST

DigiLocker | ఇంటర్నెట్‌డెస్క్‌: వాహనం నడుపుతూ రోడ్డు మీద వెళ్లాలంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాల్సిందే. బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే పాన్‌కార్డ్‌ తప్పనిసరి. ఇక టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకొని ప్రయాణం కొనసాగించాలన్నా ఆధార్‌కార్డు లాంటి ఏదైనా గుర్తింపుకార్డు తప్పనిసరిగా చూపించాలి. ప్రభుత్వం జారీ చేసిన ఈ గుర్తింపు కార్డులు మనకు నిత్యం అవసరం అవుతూనే ఉంటాయి. దీంతో ఎక్కడికి వెళ్లినా వీటిని తీసుకెళ్లాల్సి వస్తోంది. వీటిని ఫిజికల్‌గా తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఎల్లప్పుడూ మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌లో డిజిటల్‌ రూపంలో ఉంటే ఎంత బాగుంటుందో కదా. అయితే, డిజీలాకర్‌ గురించి తెలుసుకోవాల్సిందే. అసలేంటీ లాకర్‌? ఎలా ఉపయోగించాలి?

డిజీలాకర్‌ (DigiLocker) అనేది ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌. ఇందులో మీ సర్టిఫికెట్లు, పత్రాలు సురక్షితంగా దాచుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడు సులువుగా యాక్సెస్‌ చేయొచ్చు. పదోతరగతి సర్టిఫికెట్‌ నుంచి ఆధార్‌, పాన్‌, రేషన్‌.. ఇలా ప్రభుత్వం జారీ చేసిన అన్ని డాక్యుమెంట్‌లనూ డిజిటల్ రూపంలో దాచుకోవడానికి ఈ డిజీలాకర్‌ ఉపయోగపడుతుంది. జీవిత బీమా వంటి ముఖ్యమైన పత్రాలను ఇందులో దాచుకోవచ్చు. ఒకవేళ డ్రైవింగ్‌ లైసెన్స్‌ మర్చిపోయి ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కిన సందర్బాల్లో డిజీలాకర్‌లో ఉన్న పత్రాలు చూపించొచ్చు. ఇలా ఎక్కడైనా, ఎప్పుడైనా వీటిని వినియోగించుకోవచ్చు. కేవలం ప్రభుత్వం అందించే డాక్యుమెంట్లే కాకుండా ఇతర విలువైన పత్రాలను డిజిటల్‌ రూపంలో భద్రపరచుకోవచ్చు.

ఎలా వినియోగించాలంటే?

  • మీ ఫోన్‌లో డిజీలాకర్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోండి.
  • పేరు, పుట్టిన తేదీ, ఇ-మెయిల్‌, ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగా వచ్చే ఆరంకెల సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్‌ చేయాలి.
  • మీ ఆధార్‌కార్డ్‌ లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేసి Submitపై క్లిక్‌ చేసి అకౌంట్‌ని క్రియేట్‌ చేసుకోవాలి.
  • తర్వాత ఆధార్‌ నంబర్‌ లేదా ఆరంకెల సెక్యూరిటీ సాయంతో సైన్‌- ఇన్‌ అవగానే మీ ఆధార్‌ కార్డు వివరాలు అందులో ప్రత్యక్షమవుతాయి. పైన కుడివైపున మీ ఫొటో కనిపిస్తుంది. 
  • యాప్‌లో కింద ఉన్న సెర్చ్‌ సింబల్‌పై క్లిక్‌ చేసి మీ రాష్ట్రాన్ని ఎంచుకోగానే పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ సర్టిఫికెట్ల లిస్ట్‌ ప్రత్యక్షమవుతుంది. 
  • వాటిలో మీ ప్రాంతం, యూనివర్సిటీకి సంబంధించిన ఆప్షన్‌ను ఎంచుకొని హాల్‌టికెట్‌ నంబర్‌, ఉత్తీర్ణత పొందిన సంవత్సరం ఎంటర్‌ చేసి డాక్యుమెంట్లు పొందొచ్చు.
  • వీటితో పాటు పాన్‌, రేషన్‌.. లాంటి ప్రభుత్వ గుర్తింపుకార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకున్న పత్రాలు కింద ఉన్న ISSUEDలో దర్శనమిస్తాయి.

గమనిక: అన్ని విద్యా సంబంధిత సర్టిఫికెట్లూ డౌన్‌లోడ్‌ కావడం లేదు.

మాన్యువల్‌ అప్‌లోడ్‌ ఇలా..

  • యాప్‌లో సైన్‌-ఇన్‌ అవ్వగానే కిందకు స్క్రోల్‌ చేస్తే DigiLocker drive అని ఆప్షన్‌ కనిపిస్తుంది.
  • దాన్ని క్లిక్‌ చేసి + సింబల్‌పై క్లిక్‌ చేసి మీకు కావాల్సిన డాక్యుమెంట్లను మాన్యువల్‌గా అప్‌లోడ్‌ చేసి స్టోర్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ డ్రైవ్‌ మాదిరిగా అక్కడే ప్రత్యేక ఫోల్డర్లు కూడా క్రియేట్‌ చేసుకొనే సదుపాయం ఉంటుంది. డిజీలాకర్‌లో ప్రతీ యూజర్‌కు 1 జీబీ క్లౌడ్‌ డేటా లభిస్తుంది. 10 ఎంబీ వరకు ఒక్కో ఫైల్‌ను స్టోర్‌ చేసుకోవచ్చు.
  • ఇంటర్నెట్‌ సాయంతో ఎక్కడున్నా వీటిని యాక్సెస్‌ చేయొచ్చు.

నామినీ జత చేయొచ్చు..

  • కింద కుడివైపు ఉన్న menu ఆప్షన్‌పై క్లిక్‌ చేసి Nomineeని ఎంచుకొని యాడ్‌ నామినీపై క్లిక్‌ చేయండి.
  • తర్వాత కనిపించే స్క్రీన్‌లో మీరు నామినీ జత చేయాలనుకుంటున్న వారి పేరు, పుట్టిన తేదీ.. తదితర వివరాలు ఎంటర్ చేసి ఓటీపీ సాయంతో నామినీని జత చేయొచ్చు. 
  • దీనివల్ల భవిష్యత్తులో మీ అకౌంట్‌ను యాక్సెస్‌ చేసే వెసులుబాటు మీ నామినీకి ఉంటుంది. ఒకసారి నామినీ వివరాలు ఎంటర్‌ చేశాక ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మార్చడానికి వీలుండదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని