సింగరేణి గనిలో ప్రమాదం.. కార్మికుడు మృతి 

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 గనిలో బుధవారం జరిగిన ప్రమాదంలో రట్నం లింగయ్య (54) అనే కార్మికుడు మృతి చెందగా మరో ముగ్గురు కార్మికులు, ఒక సూపర్ వైజర్‌కు........

Published : 03 Sep 2020 02:40 IST

మరో నలుగురికి గాయాలు

శ్రీరాంపూర్‌ గ్రామీణం: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 గనిలో బుధవారం జరిగిన ప్రమాదంలో రట్నం లింగయ్య (54) అనే కార్మికుడు మృతి చెందగా మరో ముగ్గురు కార్మికులు, ఒక సూపర్ వైజర్‌కు గాయాలయ్యాయి. గని కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం..  రెండో షిప్ట్‌ విధుల్లో భాగంగా గని భూగర్భంలోని సెక్టార్-బిలోని నాల్గో సీమ్‌ 1డీప్‌ 36 క్రాస్‌ వద్ద కోల్ కటింగ్ పనులను కోల్ కట్టర్ కార్మికులు రట్నం లింగయ్య, పల్లె రాజయ్య, గాదె శివయ్య, బదిలీ వర్కర్ చిలుక సుమన్ కుమార్‌.. షాట్ ఫైరర్‌ కాస శ్రీకాంత్ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్నారు. వారు పనులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పని స్థలంలో పేలుడు జరిగింది.

ఈ ప్రమాదంలో బొగ్గు పెళ్లలు కార్మికుల చేతులకు, ముఖాలకు తాకడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిలో రట్నం లింగయ్యకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని రామకృష్ణపూర్‌లోని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడికి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ మరో ముగ్గురు కార్మికులు రాజయ్య, శివయ్య, సుమన్ కుమార్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. షాట్ ఫైరర్‌ శ్రీకాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం సమాచారం అందుకున్న ఏజెంట్‌ రఘు కుమార్, గని మేనేజర్ రామన్‌ వి.పాఠక్, గని రక్షణాధికారి సింహా ప్రమాద స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. రామకృష్ణపూర్ ఏరియా ఆస్పత్రిలో క్షతగాత్రులను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, ఏఐటీయూసీ, బీఎంహెచ్‌ కార్మిక సంఘాల నాయకులు బాధితులను పరామర్శించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని