వివేక్‌ ఒబెరాయ్‌ బావమరిది ఇంట్లో సోదాలు

చందన సీమలో మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల హస్తం ఇందులో ఉన్నట్లు  బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటుడు....

Updated : 15 Sep 2020 20:08 IST

చందన సీమ డ్రగ్‌ కేసులో కొత్త మలుపు

బెంగళూరు: చందన సీమలో మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నట్లు  బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ బావ మరిది, కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్‌ అల్వా కుమారుడు ఆదిత్య అల్వా ఇంట్లో పోలీసులు సోదారులు జరిపారు. చందన సీమలో డ్రగ్‌ వ్యవహారం కేసులోని 12 మంది నిందితుల్లో ఆదిత్య అల్వా ఒకరు. సెర్చ్‌ వారెంట్‌తో వెళ్లి సోదాలు నిర్వహించామని జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు (క్రైమ్‌) మీడియాకు తెలిపారు.

చందన సీమలో డ్రగ్స్‌ కేసుకు సంబంధించి నటీమణులు రాగిణి ద్వివేది, సంజన, ఖన్నా, ఆదిత్య అల్వా, వ్యాపారవేత్త రాహుల్‌, నటుడు నియాజ్‌లను అరెస్టు చేసి, సీసీబీ విచారణ జరుపుతోంది. రాగిణి ద్వివేదికి 14 రోజుల జ్యూడిషియల్‌ కస్టడీ విధించారు. ఆపై పరప్పన అగ్రహార కారాగారానికి తరలించారు. సోమవారం న్యాయస్థానం ముందు రాగిణి ద్వివేదిని హాజరుపరిచిన పోలీసులు.. ‘విచారణకు ఏమాత్రం సహకరించటం లేదు’ అంటూ న్యాయమూర్తికి విన్నవించారు. డిజిటల్‌ సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా నాశనం చేసిన రాగిణి ద్వివేది నుంచి ఆశించిన స్థాయిలో సమాచారం సేకరించటం కష్టంగా మారిందని వివరించారు. ఆమెతో పాటు మరో ఐదుగురికి జ్యూడిషియాల్‌ కస్టడీకి తరలించాలని కోర్టు ఆదేశించింది. మరోపక్క బెయిల్‌ కోసం రాగిణి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

ఇదే కేసులో అదుపులో ఉన్న మరోనటి సంజనాకు ఈనెల 16 వరకు పోలీస్‌ కస్టడీని పొడిగిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. సంజనా కూడా విచారణకు సహకరించటం లేదని పోలీసులు కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆమెను మహిళా సాంత్వన కేంద్రానికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని