Hyderabad: ఈ దొంగ స్టైలే వేరు.. క్యాబ్‌ డ్రైవర్‌ను బిర్యానీ తెమ్మని కారుతో పరారీ

క్యాబ్‌ డ్రైవర్‌ను బిర్యానీ కోసం పంపి ఓ ప్రయాణికుడు కారుతో ఉడాయించాడు. హైదరాబాద్‌ పటాన్‌చెరులో ఆదివారం ఈ ఘటన జరిగింది.

Updated : 13 Aug 2023 17:17 IST

పటాన్‌చెరు అర్బన్‌: క్రైమ్‌ బ్రాంచి పోలీసుని.. హైదరాబాద్‌ వెళ్లాలని కారు కిరాయికి మాట్లాడుకున్నాడు. మార్గ మధ్యలో హోటల్‌ వద్ద ఆపి క్యాబ్‌ డ్రైవర్‌ను బిర్యాని తెమ్మని చెప్పి కారుతో సహా ఉడాయించాడు ఓ అగంతకుడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జరిగింది. 

వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా గంగాపూర్‌ గ్రామానికి చెందిన నరేష్‌ తన కారును జహీరాబాద్‌ అడ్డాపై ఉంచి కిరాయికి నడుపుతున్నాడు. ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి  సంగారెడ్డి ఉమెన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పని ఉందంటూ కారు కిరాయికి మాట్లాడుకున్నాడు. తాను మహారాష్ట్రకు చెందిన క్రైమ్‌ బ్రాంచి పోలీసుగా పరిచయం చేసుకుని సంగారెడ్డి ఉమెన్ పోలీస్‌స్టేషన్‌ ముందు కారు ఆపి లోపలికి కూడా వెళ్లి వచ్చాడు. అలాగే ఎస్పీ కార్యాలయం వరకూ వెళ్లి అక్కడ ఫోన్‌ మాట్లాడాడు. దీంతో క్యాబ్‌ డ్రైవర్‌ నిజంగా పోలీసే అయి ఉంటాడని నమ్మాడు.

అనంతరం హైదరాబాద్‌లో దింపాలని క్యాబ్‌ డ్రైవర్‌కు చెప్పాడు. సంగారెడ్డి నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు అదనంగా రూ.3వేలు ఇవ్వాలని నరేష్ కోరడంతో ఇస్తానని చెప్పాడు. హైదరాబాద్‌ వస్తుండగా పటాన్‌చెరు మండలం రుద్రారం శివారులో ఉన్న ప్యాలెస్‌ హోటల్‌ వద్ద ఆపి డ్రైవర్‌ను బిర్యానీ తీసుకురమ్మని పంపాడు. తెచ్చాక మళ్లీ 3 బిర్యానీలు తీసుకురావాలని రూ.వెయ్యి ఇచ్చాడు. బిర్యానీ తెచ్చే లోపే కారుతో సహా అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో క్యాబ్‌ డ్రైవర్‌ తమ అసోసియేషన్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో కారు ఎక్కడైనా ఉంటే తెలియజేయాలని సమాచారం షేర్‌ చేశాడు. సికింద్రాబాద్‌లో కారును చూశామని, అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు తోటి క్యాబ్ డ్రైవర్లు చెప్పారు. దీంతో పటాన్‌ చెరు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు జహీరాబాద్‌లో స్టే చేసిన హోటల్‌ గదికోసం ఇచ్చిన ఆధార్‌ కార్డు వివరాల్లో నిందితుడి పేరు అభినాష్ ప్రకాష్ షిండే అని ఉందని గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు