Aaftab: శ్రద్ధ హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు.. కత్తుల వాడకంపై పూర్తి పరిజ్ఞానం..!

శ్రద్ధా వాకర్‌ను ముందుగా హెచ్చరించినట్లుగానే హత్య చేసిన శరీర భాగాలను ముక్కలు చేశాడని దిల్లీ పోలీసులు తెలిపారు. అతడు శిక్షణ పొందిన చెఫ్‌ కావడం వల్ల కత్తుల వినియోగం, మాంసం భద్రపరచడంపై పూర్తి అవగాహన ఉందని విచారణ సందర్భంగా న్యాయస్థానం ముందు వెల్లడించారు.

Published : 08 Mar 2023 01:27 IST

దిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌(shraddha-walker) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలా (Aaftab Poonawala) శిక్షణ పొందిన చెఫ్‌ అని.. కత్తులను వినియోగించడంలో అతడికి నైపుణ్యం ఉందని దిల్లీ పోలీసులు వెల్లడించారు. దీంతోపాటు మాంసాన్ని వాడటం, భద్రపరచే తీరుపై పూర్తి అవగాహన ఉందన్నారు. అంతేకాకుండా గతంలో శ్రద్ధా వాకర్‌ మహారాష్ట్ర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పినట్లుగానే ఆమె శరీరాన్ని ముక్కలుగా చేశాడని కేసు విచారణ సందర్భంగా కోర్టులో దిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

ఆఫ్తాబ్‌ కేసుకు సంబంధించి దిల్లీని సెషన్స్‌ కోర్టులో విచారణ జరిగింది. దిల్లీ పోలీసుల తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఎస్‌పీపీ) తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా శ్రద్ధా వాకర్‌ గతంలో మహారాష్ట్ర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ప్రస్తావించిన ఎస్‌పీపీ.. అప్పుడు భయపెట్టినట్లుగానే ఆఫ్తాబ్‌ నేరానికి పాల్పడినట్లు న్యాయస్థానానికి వెల్లడించారు. ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాలకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు అందించారు.

‘భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ వారిద్దరూ కలిసే ఉన్నారు. ముంబయిలో మూడుచోట్ల ఇల్లు అద్దెకు తీసుకున్నారు. కలిసి పనిచేసేవారు. అయితే, ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పటికీ వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. చివరకు శ్రద్ధాను చంపేందుకు నిర్ణయించుకున్న ఆఫ్తాబ్‌.. అందుకోసం కత్తులు కొన్నాడు. ఆమెను చంపి ముక్కలుగా చేశాడు. కొత్త ఫ్రిజ్‌ కొని.. కొంతకాలం వాటిలో భద్రపరిచాడు. అనంతరం వాటిని వివిధ ప్రదేశాల్లో విసిరేశాడు. సుమారు ఆరు నెలల తర్వాత కేసు బయటపడింది. సేకరించిన ఎముకలకు డీఎన్‌ఏ పరీక్షలు చేయించగా అవి శ్రద్ధా తండ్రితో సరిపోలాయి. శద్ధాను చంపిన తర్వాత మరో అమ్మాయితో స్నేహం మొదలుపెట్టాడు. ఆమెకు ఓ ఉంగరం కానుకగా ఇచ్చాడు. అది గతంలో శ్రద్ధాకు ఇచ్చిందే. ఆఫ్తాబ్‌ నేరం చేశాడనడానికి ఇవన్నీ సాక్షాలే’ అని న్యాయస్థానానికి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని