Karnataka: లంచం కేసు.. సగం యూనిఫాంతో ఎస్సై పరుగో పరుగు!

సాధారణంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఛేజ్‌ చేస్తారు. కానీ కర్ణాటకలో మాత్రం విచిత్రం. ఇక్కడ ఓ ఎస్సైని పట్టుకునేందుకు అనిశా అధికారులు రోడ్లపై పరుగులు తీశారు. కారణం.. ఆ ఎస్సై లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు రావడమే. తుమకూరు...

Published : 05 Nov 2021 06:43 IST

బెంగళూరు: సాధారణంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఛేజ్‌ చేస్తారు. కానీ కర్ణాటకలో మాత్రం ఇందుకు రివర్స్‌ జరగడం విశేషం. ఇక్కడ ఓ ఎస్సైని పట్టుకునేందుకు అనిశా అధికారులు రోడ్లపై పరుగులు తీశారు. కారణం.. ఆ ఎస్సై లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు రావడమే. తుమకూరు నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సగం యూనిఫాంలో ఉన్న ఆ ఎస్సైని దాదాపు కిలోమీటరు దూరం వెంబడించి, ఎట్టకేలకు ప్రజల సాయంతో పట్టుకోగలిగారు. వివరాల్లోకి వెళ్తే.. తుమకూరు గుబ్బిన్ తాలుకాలోని చంద్రశేఖర్ పొరా ఠాణా పోలీసులు ఓ కేసు విషయంలో చంద్రన్న అనే వ్యక్తి వాహనాన్ని సీజ్ చేశారు. దాన్ని విడిచిపెట్టేందుకు రూ.28 వేల లంచం తీసుకోవాలని స్టేషన్‌ ఎస్సై సోమశేఖర్‌.. కానిస్టేబుల్‌ నయాజ్‌ అహ్మద్‌ను పురమాయించాడు.

దీంతో బాధితుడు వెంటనే అనిశా అధికారులను ఆశ్రయించాడు. వారు ఎస్సైను పట్టుకునేందుకు వల పన్నారు! ఈ క్రమంలో బుధవారం చంద్రన్న నుంచి రూ.12 వేలు తీసుకుంటున్న ఆ కానిస్టేబుల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకోవాలని ఎస్సైనే చెప్పినట్లు కానిస్టేబుల్‌ వెల్లడించాడు. అనంతరం అనిశా అధికారులు.. కానిస్టేబుల్‌తోపాటు స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎస్సై వెంటనే తన యూనిఫాం షర్ట్‌ను అక్కడే చెత్త డబ్బాలో పారేసి, స్టేషన్‌ నుంచి బయటకు పరుగందుకున్నాడు. ఏసీబీ అధికారులూ ఆయన్ను వెంబడించారు. చివరకు స్థానికుల సాయంతో పట్టుకున్నారు. అనంతరం ఇద్దరిని అరెస్టు చేసి, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని