Crime News: ‘నన్ను క్షమించండి’.. బాలికను 114 సార్లు పొడిచి చంపిన యువకుడు..!

అమెరికాలో 2021లో సంచలనం సృష్టించిన మైనర్‌ హత్య కేసు కొలిక్కి వచ్చింది. స్నేహితురాలిని 114 సార్లు పొడిచి చంపిన కేసులో నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

Published : 08 Feb 2023 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2021లో ఓ 13ఏళ్ల బాలికను మైనర్‌ యువకుడు అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన అమెరికాలో (America) సంచలనం సృష్టించింది. బాలికపై దాడి చేసి 114 సార్లు పాశవికంగా పొడిచి చంపాడు. ముద్దాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపారు. తాజాగా ఆ కేసులో నేరాన్ని నిందితుడు అంగీకరించాడు. బాలిక కుటుంబంతోపాటు తన కుటుంబీకులు కూడా క్షమించాలంటూ విన్నవించుకున్నట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

అమెరికాలోని జాక్సన్‌విల్లే నగర శివారు ప్రాంతంలో ట్రిస్టిన్‌ బెయిలీ (Tristyn Bailey) అనే బాలిక నివసించేది. అయితే, 2021లో మదర్స్‌ డే (మే రెండో ఆదివారం) రోజున ఏడెన్‌ ఫస్సీ అనే స్నేహితుడు దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చాడు. అనంతరం తన ఇంటికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోనే మృతదేహాన్ని పూడ్చివేశాడు. ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు ఇటీవల విచారణ పూర్తి చేశారు. ఈ క్రమంలో నిందితుడు నేరాన్ని అంగీకరించిన విషయాన్ని పేర్కొంటూ దర్యాప్తు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

చిన్న వయసులోనే ఈ దాడికి పాల్పడినప్పటికీ ఆయన్ను మేజర్‌గానే పరిగణిస్తున్నట్లు అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. శిక్ష విధించడంలో ఎటువంటి కనికరం అవసరం లేదని బాధితురాలి తరఫున న్యాయవాదులు న్యాయస్థానానికి విన్నవించారు.  14ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతడు ఈ నేరానికి పాల్పడినందున మరణశిక్ష విధించే అవకాశం లేదని తెలుస్తోంది.

మరోవైపు దర్యాప్తు సమయంలో నిందితుడి స్నేహితులు కీలక సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగే కొన్ని నెలల ముందునుంచే హింస, హత్య గురించి ఫస్సీ బహిరంగంగా మాట్లాడేవాడట. అంతేకాకుండా ఛిద్రమైన శరీర భాగాల చిత్రాలు గీసేవాడట. చివరకు తన క్లాస్‌మేట్‌నే హత్య చేసేందుకు ఎంచుకున్నట్లు తోటి విద్యార్థులు దర్యాప్తులో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని