Crime news: ఆమె మార్ఫింగ్‌ ఫొటోలకు వచ్చే కామెంట్స్‌ చదువుతూ సహజీవన భాగస్వామి వికృతానందం

తమిళనాడుకు చెందిన ఓ యువకుడు తన చిన్ననాటి స్నేహితురాలితో సహజీవనం చేస్తూ ఆమె చిత్రాలను మార్ఫింగ్‌ చేశాడు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి పైశాచికానందం పొందాడు. 

Published : 11 Oct 2023 15:38 IST

బెంగళూరు: సహజీవనం చేస్తున్న ప్రియుడే తన ప్రియురాలి చిత్రాలను మార్ఫింగ్‌ చేశాడు. ఆపై ఏమీ తెలియనట్లు బాధితురాలితో కలిసి వాటి గురించి ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో లోతుగా దర్యాప్తు చేయగా.. వాటిని పోస్టు చేసింది ప్రియుడేనని తెలిసింది. దాంతో బెంగళూరు (Bengaluru) పోలీసులు అతడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం వెల్లూరుకు చెందిన సంజయ్‌ కుమార్‌ అదే ప్రాంతానికి తన చిన్ననాటి స్నేహితురాలితో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. వారిద్దరికీ 10వ తరగతి నుంచి పరిచయం ఉంది. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న వీరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో తన మార్ఫింగ్‌ చిత్రాలు కొన్ని టెలిగ్రామ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టయిన విషయం సంజయ్‌ స్నేహితురాలి దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని సంజయ్‌కు చెప్పడంతో ఇద్దరూ కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. తన ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి ఎవరో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. 

ప్రియుడితో ఉండగా చూశారని.. చెల్లెళ్లను చంపిన అక్క

ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు ఆ ఫొటోలన్నింటినీ తొలగించాల్సిందిగా సామాజిక మాధ్యమ సంస్థల ప్రతినిధులను కోరారు. అలాగే అవి ఏ అకౌంట్‌ నుంచి పోస్టయ్యాయి. దాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అనే వివరాలను కూడా అడిగారు. ఆ సమాచారం ఆధారంగా విచారణ చేసిన పోలీసులకు నివ్వెరపోయే విషయం తెలిసింది. బాధితురాలి ఫొటోలను పోస్టు చేసింది ఆమె స్నేహితుడేనని, ఫిర్యాదు చేయడానికి అతడు కూడా వచ్చాడని తెలిసి షాక్‌కు గురయ్యారు. సంజయ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అతడు నేరాన్ని అంగీకరించాడు. బాధితురాలి ఫొటోలకు వచ్చే కామెంట్స్‌ చూసి ఆనందం పొందడానికే ఆ పని చేశానని పోలీసులకు చెప్పాడు. తనకు తెలిసిన స్నేహితులు, బంధువుల మార్ఫింగ్‌ చిత్రాలను సైతం నిందితుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టుల చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని