CBI: కరీంనగర్‌ గ్రానైట్‌ మైనింగ్‌ అక్రమాలపై సీబీఐ విచారణ

కరీంనగర్‌ గ్రానైట్‌ మైనింగ్‌ అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ చేపట్టాయి. భాజపా నేత పేరాల శేఖర్‌రావు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ విశాఖ విభాగం..

Updated : 18 Feb 2022 20:23 IST

హైదరాబాద్‌: కరీంనగర్‌ గ్రానైట్‌ మైనింగ్‌ అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ చేపట్టాయి. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు సీబీఐ అంగీకరించింది. ఈమేరకు విశాఖ విభాగానికి సంబంధించిన అధికారులకు సీబీఐ కేంద్ర కార్యాలయం సందేశం పంపింది. కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు సీబీఐ విశాఖ విభాగం అధికారులు విచారణ ప్రారంభించారు.

కాకినాడ పోర్టు నుంచి కరీంనగర్‌ గ్రానైట్‌ విదేశాలకు ఎగుమతైంది. 2011లో కాకినాడ పోర్టులో సోదాలు నిర్వహించిన అధికారులు అక్రమంగా గ్రానైట్‌ విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించారు. అక్రమ ఎగుమతులపై పలు సంస్థలకు నోటీసులు ఇచ్చిన అధికారులు భారీగా జరిమానా విధించారు. అప్పట్లో మైనింగ్‌ కంపెనీలకు రూ.750 కోట్ల జరిమానా విధించారు. ఆ జరిమానాలకు సంబంధించి ఈడీ కూడా విచారణ చేపట్టింది. ఇంకా ఈడీ విచారణ కొనసాగుతూనే ఉంది. జరిమానా విధించినప్పటికీ అక్రమ మైనింగ్‌, అనుమతులు లేకుండా ఎగుమతులు జరుగుతున్నాయని శేఖర్‌రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా 2011 నుంచి ఇప్పటి వరకు జరిగిన వ్యవహారాలు, ప్రస్తుతం కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌, అక్రమ ఎగుమతులు, పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌, అక్రమరవాణా ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ, ఈడీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు ఎంత అక్రమమైనింగ్‌ జరిగింది, ఏయే దేశాలకు ఎగుమతి చేశారు. కాకినాడ పోర్టునే ఎందుకు ఎంచుకున్నారు అనే అంశాలపై సీబీఐ దర్యాప్తు చేసే అవకాశముంది. ఈమేరకు సీబీఐ నుంచి ఫిర్యాదు దారు శేఖర్‌రావుకు సమాచారమందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని