వేర్వేరు ఘటనల్లో 14మందికి అస్వస్థత

విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి విషవాయువు లీకై 11మంది మృత్యువాత పడిన విషాద ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే తమిళనాడు, .....

Published : 08 May 2020 02:11 IST

చెన్నై: విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి విషవాయువు లీకై 11మంది మృత్యువాత పడిన విషాద ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో వేర్వేరు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడులోని కడలూర్‌ జిల్లాలో  నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌లో బాయిలర్‌ పేలింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. దీంతో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. షార్ట్‌ సర్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో పేపర్‌మిల్లులో గ్యాస్‌ లీకై.. 
ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో మరో విషాదం వెలుగులోకి వచ్చింది. టెట్ల గ్రామంలోని  శక్తి పేపర్‌ మిల్లులో  విష వాయువు లీకైంది. బుధవారం సాయంత్రం ట్యాంక్‌ను శుభ్రం చేస్తున్న సమయంలో ఈ విషవాయువు ప్రభావానికి ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. లాక్‌డౌన్‌ కారణంగా మూసిఉన్న ఈ మిల్లులో పనులు పునఃప్రారంభించే ముందు శుభ్రపరిచే పనులు జరుగుతున్న క్రమంలో ఈ విషాదం జరిగినట్టు రాయగఢ్‌ ఎస్పీ వెల్లడించారు. అయితే, ఈ ఘటన గురించి పరిశ్రమ యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు.  ఈ ఘటనలో ఏడుగురు అస్వస్థతకు గురికాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు. దీనిపై దర్యాప్తు జరిపేందుకు ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం ఘటనా స్థలానికి వెళ్లిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని