Hyderabad News: డబ్బుకు ఆశపడి కన్నబిడ్డకు ఖరీదు కట్టారు!

మానవత్వం మంటగలిసేలా.. సభ్యసమాజం సిగ్గుపడేలా.. డబ్బుకు ఆశపడి ఓ దంపతులు కన్నపేగును అంగట్లో బేరం పెట్టిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. అమ్మమ్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన

Updated : 08 Feb 2022 06:44 IST

శిశువును విక్రయించిన ఘటనలో నలుగురి అరెస్టు

పోలీసుల అదుపులో నిందితులు

వనస్థలిపురం, న్యూస్‌టుడే: మానవత్వం మంటగలిసేలా.. సభ్యసమాజం సిగ్గుపడేలా.. డబ్బుకు ఆశపడి ఓ దంపతులు కన్నపేగును అంగట్లో బేరం పెట్టిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. అమ్మమ్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నవజాత శిశువును విక్రయించిన దంపతులతో పాటు కొనుగోలు చేసిన మహిళ, సహకరించిన ఆశా కార్యకర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. వనస్థలిపురంలోని కమలానగర్‌కి చెందిన దంపతులు దుర్గప్రియ, శ్రీనివాస్‌ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. జనవరి 21న గాంధీ ఆసుపత్రిలో మూడో కాన్పులో ఆడశిశువు జన్మించింది. మూడు రోజుల తర్వాత వారిని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేయడంతో దుర్గప్రియ తల్లి రాజేశ్వరి వారిని ఇంటి వద్ద దింపేసి తన స్వగ్రామైన కర్నూల్‌ జిల్లా ఆలూరుకు వెళ్లిపోయింది. ఇంటికి వెళ్లిన తర్వాత కూతురు, అల్లుడు ఫోన్‌ చేయడం లేదని ఈ నెల 6న ఆమె తిరిగి వనస్థలిపురానికి చేరుకుంది. ఇంట్లో నవజాత శిశువు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలానగర్‌కు చెందిన కవిత సోదరి ధనమ్మకు సంతానం లేదు. కవిత నవజాత శిశువు కోసం ఆశా కార్యకర్త బాషమ్మను సంప్రదించింది. ఆమె ఈ విషయాన్ని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న దుర్గప్రియ దంపతులకు చెప్పింది. డబ్బు కోసం ఆశపడిన ఆ దంపతులు రూ.80 వేలకు శిశువును విక్రయించారు. నిందితులు దుర్గప్రియ, శ్రీనివాస్‌తో పాటు ధనమ్మ, బాషమ్మపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. శిశువును ఛైల్డ్‌లైన్‌ సంస్థకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని