భర్తతో విడిపోయేందుకు నిర్ణయం.. లుథియానా వ్యక్తితో స్నేహం.. అతను ద్రోహం

ఫేస్‌బుక్‌ పరిచయం.. ఓ మహిళను ప్రాణసంకటంలో పడేసింది.. ఇద్దరు పిల్లలున్న ఆమె, అభిప్రాయభేదాల కారణంగా భర్తతో విడిపోదామని నిర్ణయించుకుంది.. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో పంజాబ్‌లోని లుథియానాకు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

Updated : 17 Apr 2022 07:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఫేస్‌బుక్‌ పరిచయం.. ఓ మహిళను ప్రాణసంకటంలో పడేసింది.. ఇద్దరు పిల్లలున్న ఆమె, అభిప్రాయభేదాల కారణంగా భర్తతో విడిపోదామని నిర్ణయించుకుంది.. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో పంజాబ్‌లోని లుథియానాకు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను వ్యాపారం చేస్తున్నానని, నెలకు రూ.2లక్షలు ఆదాయం వస్తుందని చెప్పడంతో నమ్మింది.. అతన్ని హైదరాబాద్‌కు ఆహ్వానించింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఒకసారి మీ ఇంటికి వస్తానంటూ ఆమె లుధియానా వెళ్లగా.. అతడు ఓ హత్య కేసులో ముద్దాయని తేలింది. పెళ్లి ప్రతిపాదన తిరస్కరించిన ఆమెపై అతడికి ఆగ్రహం వచ్చింది.. ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఆమెకు పంపించాడు. పెళ్లిచేసుకుంటావా? చస్తావా? అంటూ బెదిరించాడు. దీంతో ఆమె ఇటీవల సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మనం పెళ్లిచేసుకుందాం...

సికింద్రాబాద్‌లో ఉంటున్న మహిళ(40)కు ఇరవై ఏళ్లక్రితం పెళ్లయ్యింది. భర్త, ఇద్దరు పిల్లలున్నారు. అభిప్రాయభేదాల కారణంగా విడాకులు తీసుకోవాలనుకున్నారు. తొమ్మిది నెలలుగా విడిగా ఉంటున్నారు. కొత్తపరిచయాలు, వ్యాపార ఆలోచనల కోసం ఆమె తన ఫేస్‌బుక్‌ఖాతాను క్రియాశీలకంగా మార్చుకుంది. వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన యువతీయువకులను పరిచయం చేసుకుంది. లుథియానాకు చెందిన వ్యక్తి(38)తో పరిచయం ఏర్పడింది. తన ఆర్థిక పరిస్థితి బాగుందని, పెళ్లిచేసుకుందామంటూ అతడు చెప్పడంతో మహిళ అంగీకరించింది. రెణ్నెల్ల క్రితం అతడు హైదరాబాద్‌కు రాగా.. ఇద్దరూ కలిసి దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లారు. స్వస్థలానికి వెళ్లేముందు తనకు రూ.లక్ష కావాలంటూ కోరగా.. ఆమె తన వద్ద రూ.60వేలే ఉన్నాయని ఇచ్చింది.. మీ ఊరికి వస్తానని అతనితో కలిసి వెళ్లింది.

నగ్నచిత్రాలు.. మార్ఫింగ్‌ వీడియోలతో బెదిరింపులు

లుథియానా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కొద్దిరోజులకే ఆ వ్యక్తి.. నగ్నచిత్రాలు, మార్ఫింగ్‌ వీడియోలను ఆమె చరవాణికి పంపించాడు. వాటిని స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులకూ పంపుతానంటూ బెదిరించాడు. మహిళ లెక్కచేయకపోవడంతో వాటిని ఆమె స్నేహితులకు పంపించాడు. భయపడిన మహిళ ఏం కావాలంటూ అడగ్గా.. పెళ్లి చేసుకోవాలంటూ చెప్పాడు. తనకు ఇష్టంలేదని తిరస్కరించగా.. ఫొటోలు, వీడియోలను యూట్యూబ్‌లో ఉంచుతానంటూ హెచ్చరించాడు. దీంతో ఆమె సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె భర్త.. ఆమెను ఓదార్ఛి. పోలీస్‌ఠాణాకు తీసుకురావడం కొసమెరుపు.


అక్కడికి వెళ్తే తెలిసిన రహస్యం..

ఫేస్‌బుక్‌ కొత్త స్నేహితుడి కుటుంబీకులను కలుసుకునేందుకు నెలరోజుల క్రితం ఆమె లుథియానాకు వెళ్లింది. అక్కడికి వెళ్లాక ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది.. ఆ స్నేహితుడు మాటలతో మాయచేశాడని, ఏ పనిచేయకుండా పదవీవిరమణ చేసిన తన తండ్రి పింఛన్‌తో జీవిస్తున్నాడని తెలుసుకుని నిర్ఘాంతపోయింది... వారుంటున్న ఇల్లు కూడా చాలా చిన్నగా ఉంది.. ఇదేంటని అతడి తండ్రిని అడగ్గా.. ఓ హత్య కేసులో ముద్దాయిగా పదేళ్ల క్రితం జైలుకెళ్లాడని, ఇటీవలే బయటకు వచ్చాడని చెప్పాడు. ఈలోపు ఆమె స్నేహితుడు రాగా.. తనను మోసం చేశావంటూ నిలదీసింది.. దీంతో అతడి తండ్రి జోక్యం చేసుకుని.. నీకు ఎలాంటి నష్టం జరక్కుండా చూస్తానంటూ హామీ ఇచ్చి ఆమెను పంపించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని