Updated : 05 Jul 2022 06:36 IST

వెంటాడిన మృత్యువు

రహదారి ప్రమాదంలో యువకుడి మృతి


నాగశివయ్య (పాతచిత్రం)

మంగళగిరి (తాడేపల్లి), న్యూస్‌టుడే: ఒకే కుటుంబంలోని వారిని ఒక్కొక్కరిని మృత్యువు కాటేసింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన యువకుడుకి కొన్ని రోజుల తరువాత సోదరి కూడా కన్నుమూసింది. అమ్మమ్మ వద్దే పెరిగి పెద్దవాడయ్యాడు. అయినా కూడా మృత్యువు ఆయన్ని కూడా కబళించడంతో బంధువర్గాల్లో విషాదం అలముకుంది. మంగళగిరి, తాడేపల్లి మధ్య 16వ నంబర్‌ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళగిరి కొత్తపేటలోని అన్నపురెడ్డి నాగశివయ్య (26) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... నాగశివయ్య తాడేపల్లిలోని ఓ ప్రైవేటు సంస్థలో ప్రమోటర్‌గా పని చేస్తున్నారు. విధులు ముగించుకుని బయలుదేరుతున్న క్రమంలో వర్షం కురవడంతో ఆలస్యంగా ఇంటికి ప్రయాణమయ్యారు. వడ్డేశ్వరం వద్దకు వచ్చేసరికి ద్విచక్రవాహనం అదుపు తప్పి పడిపోయారు. అయినా ఎలాంటి గాయాలు కాలేదు. పడిపోయిన బండిని నిలబెట్టి చూస్తుండగా అతివేగంగా విజయవాడ వైపు నుంచి వచ్చిన ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నాగశివయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య పావని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగశివయ్యను ఢీకొట్టిన ద్విచక్ర వాహనదారుడు విజయవాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.

చిన్నతనంలోనే అమ్మా నాన్న

నాగశివయ్య చిన్నతనంలోనే తండ్రి నాగేశ్వరరావు చనిపోయారు. అనంతరం తల్లి కూడా తనువు చాలించింది. విధి అంతటితో ఆగకుండా అతని సోదరిని కూడా కబళించింది. చిన్న వయస్సులోనే ఆధారం కోల్పోయిన నాగశివయ్య అమ్మమ్మ వద్ద పెరిగాడు. అందరనీ కోల్పోయినప్పటికీ మనోధైర్యంతో ముందుకుసాగాడు. తనకాళ్లపై తాను నిలబడి అమ్మమ్మకు అండగా నిలిచాడు. ఈ ఏడాది మే 20న గుంటూరుకు చెందిన పావనితో వివాహం జరిగింది. ఆషాఢమాసం కావడంతో భార్య పుట్టింటికి వెళ్లారు. విధులు ముగించుకుని వెళ్తుండగా మృత్యువు ప్రమాదరూపంలో కాటేసింది. భర్త మరణవార్త తెలిసిన భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని