కేకు రాక.. ఈతకు దిగి.. మృత్యు కేక

కీసర మండలం నాట్కాన్‌ చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు దిగి ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళితే.. తీగల కృష్ణారెడ్డి(టీకేఆర్‌) కళాశాలలో డిప్లొమా మూడో సంవత్సరం చదువుతున్న హరిహరన్‌(18), హుబేద్‌(18) బుధవారం తమ పుట్టిన రోజు సందర్భంగా మిత్రులతో కలిసి గూగూల్‌లో దగ్గర్లోని ఉత్తమ పర్యాటక ప్రాంతాన్ని వెతికారు.

Updated : 01 Oct 2022 02:26 IST

గల్లంతైన విద్యార్థుల మృతదేహాల వెలికితీత


చెరువులో గాలిస్తున్న రాచకొండ పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం

కీసర, న్యూస్‌టుడే: కీసర మండలం నాట్కాన్‌ చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు దిగి ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళితే.. తీగల కృష్ణారెడ్డి(టీకేఆర్‌) కళాశాలలో డిప్లొమా మూడో సంవత్సరం చదువుతున్న హరిహరన్‌(18), హుబేద్‌(18) బుధవారం తమ పుట్టిన రోజు సందర్భంగా మిత్రులతో కలిసి గూగూల్‌లో దగ్గర్లోని ఉత్తమ పర్యాటక ప్రాంతాన్ని వెతికారు. అందులో చీర్యాలలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని చూసి అక్కడికి వచ్చారు. దర్శనానంతరం జొమాటోలో కేకు ఆర్డర్‌ ఇచ్చారు. కేక్‌ వచ్చేసరికి సమయం పడుతుందని పక్కనే ఉన్న నాట్కాన్‌ చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ఈ క్రమంలోనే మాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. బుధవారం హరిహరన్‌ మృతదేహం లభింగా, మిగతా ఇద్దరి కోసం గురువారం తెల్లవారుజాము నుంచి రాచకొండ పోలీసులు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో చెరువులో గాలింపు చేపట్టారు. హుబేద్‌, బాలాజీ(18) మృతదేహాలను వెలికి తీశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి, కీసర ఆర్డీవో రవి, ఇతర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అయ్యో పాపం..

గుడికి వెళతానని చెప్పి..

 హరిహరన్‌ తల్లిదండ్రులు తరిగోపుల రామకృష్ణయ్య, లక్ష్మిల సొంతూరు కర్నూలు. కొడుకు, కూతురు పూజితతో కలిసి హయత్‌నగర్‌లోని వినాయకనగర్‌కాలనీ రోడ్డు నంబరు-4లో తొమ్మిదేళ్లుగా ఉంటున్నారు. తండ్రి రామోజీఫిలీం సిటీలో షూటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నారు. బుధవారం హరిహరన్‌ పుట్టిన రోజు కావడంతో స్నేహితులతో కలిసి గుడికి వెళ్తున్నానని తల్లికి చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. చెరువులో మునిగి మృతి చెందినట్లు పోలీసులు సాయంత్రం తండ్రికి ఫోన్‌చేసి సమాచారం అందించారు. దీంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

టెంపర్‌ గ్లాస్‌ వేయిస్తానని..

* హుబేద్‌ తల్లిదండ్రులు ఖాజావలి, షెహనాస్‌ చంపాపేట్‌ ముస్లిం బస్తీలో ఉంటున్నారు. తల్లి డీమార్ట్‌లో పని చేస్తుండగా తండ్రి ప్రైవేటుగా పని చేస్తున్నారు. కుమారుడి పుట్టినరోజు కావడంతో కొత్త చరవాణి కొనిచ్చారు. దానికి టెంపర్‌ గ్లాస్‌ వేసుకొస్తానంటూ చెప్పి వెళ్ళాడని తల్లి బోరున విలపించడం పలువురిని కలిచివేసింది.

* బాలాజీ తల్లిదండ్రులు వెంకటేశ్వర్‌రావు, కనకదుర్గ అబ్దుల్లాపూర్‌మెట్‌ కనకదుర్గానగర్‌లో ఉంటున్నారు. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. తండ్రి వెంకటేశ్వర్‌రావు టైలరింగ్‌ చేస్తు పిల్లలిద్దరిని చదివిస్తున్నారు. స్నేహితులతో బయటకెళ్లి వస్తానని చెప్పి వచ్చిన తన కొడుకు నీట మునిగి మృతి చెందడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు మృతి చెందడంతో గుండెలవిసేలా రోదించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని