విద్యుత్తు తీగకు యువరైతు బలి

కొన్ని రోజుల్లో భార్యకు సీమంతం చేయాల్సి ఉండటంతో ఆ యువకుడు ఏర్పాట్లు చేస్తున్నాడు.

Updated : 04 Dec 2022 04:32 IST

రోదిస్తున్న భార్య, కుటుంబ సభ్యులు (అంతరచిత్రంలో) రామకృష్ణ

మెంటాడ, న్యూస్‌టుడే: కొన్ని రోజుల్లో భార్యకు సీమంతం చేయాల్సి ఉండటంతో ఆ యువకుడు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇంతలో వ్యవసాయ పనులు ఉండటంతో కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరాడు. ఈ సమయంలో విద్యుదాఘాతం జరగడంతో వారి కళ్ల ముందే అక్కడికక్కడే కుప్పకూలి దుర్మరణం చెందాడు. మెంటాడ మండలంలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జక్కువ గ్రామానికి చెందిన రౌతు రామకృష్ణ (26) తమ పొలంలో మొక్కజొన్న విత్తనాలు విత్తేందుకు యంత్రాన్ని భుజంపై వేసుకొని బయలుదేరాడు. విద్యుత్తు తీగల కింద నుంచి వెళ్తున్న సమయంలో యంత్రానికున్న ఇనుప రాడ్డు తీగలకు తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలి పొలంలో పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు 108లో గజపతినగరం సామాజిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రామకృష్ణకు ఎనిమిది నెలల క్రితం వివాహమైందని, భార్య సునీతకు త్వరలో సీమంతం చేయనున్నట్లు అతని తల్లిదండ్రులు నారాయణమ్మ, నారాయణరావు తెలియజేశారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆండ్ర ఏఎస్‌ఐ రమణ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని