చోరీ ముఠా అరెస్టు

బస్సు ప్రయాణికుల వద్ద డబ్బు, నగలు చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

Updated : 06 Dec 2022 05:04 IST

రూ.4.8 లక్షల నగదు స్వాధీనం

స్వాధీనం చేసుకున్న నగదుతో డీఎస్పీ కె.శ్రీనివాసులు, సీఐ వెంకట్రావు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: బస్సు ప్రయాణికుల వద్ద డబ్బు, నగలు చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రూ.4.8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసులు  వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘజియాబాద్‌ జిల్లా నజీం కాలనీకి చెందిన ఇనాంకురోషి, బాబు, మీరట్‌ జిల్లా సమర్‌కాలనీ వాసి ఇమ్రాన్‌ఖాన్‌ ముగ్గురు స్నేహితులు.  అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే కోరికతో రాత్రివేళ బస్సు ప్రయాణికుల నుంచి నగదు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీన ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చి గుంటూరులో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. ఆగస్టు 19వ తేదీ రాత్రి  ఒంగోలు వచ్చారు. ఒంగోలు బస్టాండులో అదేరోజు రాత్రి 12 గంటల సమయంలో తిరుపతి వెళ్లే ఇంద్ర బస్సు ఎక్కారు.  నెల్లూరు కోటమిట్టకు చెందిన మంచ ఆనంద్‌బాబు  బంగారం విక్రయించిన రూ.9.88 లక్షల నగదుతోపాటు 29 గ్రాముల నగలు తన వెంట తీసుకుని ఇంద్ర బస్సు ఎక్కారు. ఒంగోలు డిపోకు వచ్చిన సదరు బస్సులో ఎక్కిన ముగ్గురు దొంగల ముఠా నిద్రిస్తున్న ఆనంద్‌బాబు వద్ద ఉన్న నగదు సంచిని గమనించి  దొంగిలించారు. అనంతరం ఉలవపాడు మండలం వీరేపల్లిలో బస్సు దిగారు.   బాధితుడు ఉలవపాడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేశారు. నిందితులు ఘజియాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేశారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని