ప్రమాదంలో ఉపాధ్యాయుడి దుర్మరణం

పెదనాన్న దశదినకర్మకు హాజరై తిరిగి వస్తున్న ఉపాధ్యాయుడు... రహదారి ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బ్రాహ్మణపల్లె వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 07 Dec 2022 05:53 IST

పెదనాన్న దశదినకర్మకు వెళ్లివస్తుండగా ఘటన

జి.నారాయణరెడ్డి (పాత చిత్రం)

కొమరోలు గ్రామీణం, న్యూస్‌టుడే: పెదనాన్న దశదినకర్మకు హాజరై తిరిగి వస్తున్న ఉపాధ్యాయుడు... రహదారి ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బ్రాహ్మణపల్లె వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వైయస్‌ఆర్‌ జిల్లా పోరుమామిళ్ల మండలం సిద్దవరానికి చెందిన గుత్తిరెడ్డి నారాయణరెడ్డి (45)... కొమరోలు ఎస్‌బీఎన్‌ఆర్‌ఎం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన పెదనాన్న దశదినకర్మలో పాల్గొనేందుకు... కుటుంబంతో సహా స్వగ్రామానికి వెళ్లారు. ఆ కార్యక్రమం ముగించుకుని... భార్య రమణమ్మ, కుమారుడు, కుమార్తెతో పాటు తమ్ముడు శివారెడ్డి దంపతులు, వారి కుమారుడితో కలిసి స్కార్పియో వాహనంలో సోమవారం రాత్రి కొమరోలుకు బయలుదేరారు. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో... బ్రాహ్మణపల్లె వద్ద ముందు వెళ్తున్న టిప్పర్‌ను అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును ఢీకొన్నారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున మంచు కురుస్తుండడం, లైట్లు వేయకుండా ట్రావెల్స్‌ బస్సు రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నారాయణరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా... వాహనంలో ఉన్న మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో గిద్దలూరు తరలించారు. పోస్టుమార్టం అనంతరం నారాయణరెడ్డి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుడి భార్య రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుబ్బరాజు తెలిపారు. పోరుమామిళ్లలో గుత్తిరెడ్డి నారాయణరెడ్డి కుటుంబీకులను బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని